మనకు కోపమొస్తే... వాటికీ కోపమొస్తుంది

12 Jul, 2020 00:01 IST|Sakshi

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

ఈ దేశానికున్న గొప్పతనం...ఇది శాంతికి ఆలవాలం. ప్రత్యేకంగా శాంతి మంత్రం చెప్తాం. అది కేవలం మనం శాంతిగా ఉండడం కోసం కాదు. భూమి, వాయువు, అగ్ని, అంతరిక్షం... అన్నీ ప్రశాంతంగా ఉండాలని ప్రార్థించడం. మనం ప్రశాంతంగా ఉన్నాం...సముద్రం ప్రశాంతంగా లేదు...ఎంత హడలిపోతాం మనం!!! అందుకే  సర్వం ప్రశాంతంగా ఉండాలి. ఆ అవకాశం ఎప్పుడొస్తుంది? శాంతి మంత్రం చెబితే రాదు. దాని అర్థం తెలుసుకుని అనుష్ఠిస్తే వస్తుంది. 

అందరూ శాంతంగా ఉండగలిగిన ప్రజ్ఞ ఎప్పుడొస్తుంది ? మన వైపునుండీ ఆలోచించడంతోపాటూ, ఇతరులవైపునుండీ కూడా ఆలోచించడం చేతనయిననాడు వస్తుంది. శాంతిని కొని తెచ్చుకోవడానికి అది అంగడి సరుకు కాదు. ఆయన అలా ఎందుకన్నాడో, ఎందుకలా ప్రవర్తించాల్సి వచ్చిందో, ఆయన నన్నెందుకు ఇక్కడే ఉండమన్నారో, ఆయన నన్నెందుకు పిలవలేదో, నా కెందుకు ఇవ్వలేదో... ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది.. లేకపోతే ఆయన అలా చేయరు... ఇలా సానుకూలంగా అవతలి వారి వైపునుంచీ ఆలోచించడం అలవాటయిన నాడు ప్రశాంతత అదే వస్తుంది. శాంతంగా ఉన్నవాడు ఉపకారాన్నే ఆలోచిస్తాడు.

అవతలివారిని ఎలా సంతోషపెట్టాలా అని ఆలోచించ గలగాలి.సత్వంలోంచి మంచి ఆలోచనలే వస్తాయి. వ్యగ్రత, బాధతో కూడుకున్న ఆలోచనల్లోంచి రాక్షస భావాలు వ్యక్తమవుతాయి. ఇతరులకు అపకారం చేసే లక్షణం వస్తుంది. ఎప్పుడయితే ఇతరులకు అపకారం చేసే ఆలోచనలు, గుణాలు పెరిగిపోతాయో పంచభూతాలలో(గాలి, నీరు, అగ్ని...) కూడా అంతే వ్యగ్రత పెరగడం ప్రారంభమవుతుంది. భాగవతంలో పోతనగారు...‘‘పరహితము చేయునెవ్వడు పరహితుండగును భూతపంచకమునకుం, పరహితమె పరమ ధర్మము, పరహితునకు ఎదురు లేదు పర్వేందుముఖీ!’’ అన్నారు.

ఇతరులకు ఉపకారం చేయాలన్న, వారిని బాధపెట్టకూడదన్న, వాళ్ళజోలికి వెళ్ళకూడదన్న  భావన, ఇతరులను కష్టపెట్టకూడదన్న ధోరణి, ఆ సంస్కారం లేనప్పుడు ఇతరుల కష్టానికి నేను కారణమవుతాను.  అది మంచిది కాదు. ఒకవేళ నా ప్రమేయం లేకుండా అటువంటి కష్టం అవతలివారికి జరిగినప్పుడు వెంటనే పూజా మందిరంలోకి వెళ్ళి ‘‘ఈశ్వరా, నిస్సంకోచంగా పొరబాటు జరిగింది. నా వలన అది జరిగి వారి దుఃఖానికి కారణమయ్యాను. మన్నించు. ఇంకెప్పుడూ ఇటువంటి పొరబాట్లు చేయకుండా నన్ను నిగ్రహించు తండ్రీ’’ అని ప్రార్థన చేయడం నీ సంస్కారం, అవే ఔన్నత్యంగా ఉండి నిన్ను కాపాడతాయి.

దేశంలో శాంతి నెలకొనాలని ఉపన్యాసాలు, ప్రబోధాలు, ప్రతిజ్ఞలు చేస్తే శాంతి రాదు. అవతలివారి వైపునుంచి ఆలోచించడం ప్రారంభమయిన క్షణంలో చల్లటి శాంతి పవనాలు వీచడం మొదలుపెడతాయి.. కుటుంబాల్లో  నిత్యం చూసే గొడవలకు కారణం.. అవతలివారివైపు నుంచి ఆలోచించాలన్న స్పృహ లోపించడమే. కుటుంబసభ్యుల్లో ఒకరితో ప్రారంభమయిన అశాంతి ఎంతమంది అశాంతికి కారణమవుతుందో ఆలోచించండి. లొంగడంలో కీర్తి ఉంటుంది, శాంతి ఉంటుంది. అందుకే జీవితంలో శాంతికి, అందరి ప్రశాంతతకు ఉండాల్సిన ప్రధాన లక్షణం– సంస్కారం. దానికి హేతువు – వినయం. ఇవి ఉన్నప్పుడు మనకన్నా అధికులపట్ల, సమానుల పట్ల, మనకన్నా కిందివారి పట్ల ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది. అవతలివారి వైపునుంచి ఆలోచించి మనమెలా నడుచుకోవాలో తెలుస్తుంది. అది అర్థమయిన నాడు మనం, వాళ్ళు, సమాజం, దేశం, ప్రపంచం అంతా ప్రశాంతం..అందుకే ఈ దేశంలో ఏం చేసినా ఓం శాంతిః, శాంతిః, శాంతిః అని చెప్పుకుంటాం. 

మరిన్ని వార్తలు