నీలో ఉన్నదే విశ్వంలోనూ...

23 Sep, 2018 01:32 IST|Sakshi

ఈశ్వరుడు మన రూపానికి, విశ్వంలోని రూపాలన్నింటికీ హేతువని ఆధ్యాత్మికంగా ఆలోచించాలన్నా, విజ్ఞాన శాస్త్రపరంగా విశ్లేషించాలన్నా అపారమైన శ్రద్ధ, లోతైన హేతువాదం ఉండాల్సిందే. విజ్ఞానశాస్త్ర పరిశోధన ఆగిపోయిన తర్వాత ఆధ్యాత్మికత మొదలవుతుందని అందరూ అనుకుంటారు. కానీ, విజ్ఞానశాస్త్రం, ఆధ్యాత్మికత అంతిమంగా సత్యాన్వేషణ చేస్తూనే ఉంటాయి. తేడా ఏంటంటే విజ్ఞాన శాస్త్రానికి ఆధారం ఉండాల్సి ఉండగా, ఆధ్యాత్మికతకు అర్థం చేసుకోవడం, అనుభవించడమే ఉంటాయి.

విజ్ఞాన శాస్త్రం నిజంపైన ఆధారపడి ఉండగా, ఆధ్యాత్మికత సత్యంపైన ఆధారపడి ఉంటుంది. మనం నిలుచున్న భూమి తిరగడం లేదని, మన చుట్టూ సూర్యుడే తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. కానీ, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని నిరూపించేది విజ్ఞాన శాస్త్రం కాగా, భూమి ఆదిత్యుని చుట్టూ తిరిగినా, ఆదిత్యుడు గ్రహాలకన్నింటికి ఆధారమైనా, వీటన్నింటినీ ఒకానొక శక్తి నడిపిస్తూ ఉందనీ, అదే ఈశ్వరుడని ఆధ్యాత్మికత అంటుంది. ఆధ్యాత్మికతను తొలుస్తూ సత్యం వైపు సాగిపోన్నదే విజ్ఞానశాస్త్రం.

బొగ్గులో ఉండేది కర్బనం వజ్రంలో ఉండేది అదే కర్బనం. కానీ, బొగ్గు సులభంగా చూర్ణమయ్యేది, మండగలిగేది. వజ్రం కఠినాతి కఠినమైనది, ఉష్ణాన్ని నిరోధించేది. ఈ విధంగా పదార్థాల అంతర్గత అణునిర్మాణ భేదాల రీత్యా, ఆయా భౌతిక రూపాల ఏర్పాటు, వాటి ఆధారంగా వాటి లక్షణాలు బహిర్గతమౌతూ ఉంటాయి. జలంనుండి విద్యుత్తు, విద్యుత్తు నుండి వెలుగు, వెలుగు నుండి దృష్టి పొందడమెంత నిజమో, ఆ అనంతశక్తి నుండి నక్షత్రం, నక్షత్రం నుండి గ్రహం, గ్రహం నుండి జీవం పొందడమూ అంతే నిజం. మనం మన ప్రస్థానాన్ని తెలుసుకోవాలంటే మన గతంలోకి తొంగి చూడాల్సిందే.

మన ప్రస్థానం మాతృగర్భంలో మనం బీజంగా మొదలైనా, ఆకృతిగా రూపొందడం మాత్రం సూర్యరశ్మిని స్పృశించి, నీటిని తాగి, భూమిలోని వనరులను స్వీకరించి, గాలిని పీల్చి, చుట్టూ ఉన్న ఉష్ణాన్ని వాడుకుని పదార్థంగా రూపుదిద్దుకున్న ఆకులు, అలములు, పండ్లు, పాల నుండి మాత్రమే జరుగుతుంది. వృక్షాలు, సరీసృపాలు, జంతువుల అంతర్గత నిర్మాణాలు వేర్వేరుగా ఉండటం వలన, వాటి రూపాలు వేరుగా ఉండి, వాటి మీద ఆధారపడి లక్షణాలు ఉంటాయి. అన్నీ పంచభూతాల ద్వారా రూపొందాయి కాబట్టే,  తరచి చూస్తే అవి అన్నీ అంతర్లీనంగా అద్వైతాన్నే బోధిస్తాయి. మనలో ఉన్నాయి, కాబట్టే మనకు జీర్ణమవుతాయి. మన ఆకృతి ఎదగడానికి, చైతన్య స్థితిలో ఉండడానికి హేతువౌతాయి. ఇదే విషయాన్ని ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, ఆదిశంకరుల వారి జ్ఞానసుధలు తేటతెల్లం చేసాయి.

ఈ సృష్టిధర్మం తెలుసుకుని ఈ ప్రపంచంలో ఏయే జీవాలు ఉన్నాయో, ఆయా జీవులన్నింటికీ  గౌరవంగా జీవించే హక్కు ఉందని గ్రహించి పరోపకారార్థం జీవించడమే మానవ ధర్మం. ఇదే విషయాన్ని ఈశావాస్యోపనిషత్తు– తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే! తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః! అంటూ ఆ అనంతశక్తి అన్నింటి లోపల, బయటా వ్యాప్తి చెంది ఉందని తెలియజేస్తుంది. అయితే, ఈ శక్తి ఇంద్రియాలకు అందేది కాదు. ఆయా జీవుల భౌతిక ఆకృతులు, భౌతిక లక్షణాల ద్వారా ద్యోతకమౌతుంది. ఆ భేదాలను వదలి అంతర్గతశక్తి స్వరూపాన్ని అర్థం చేసుకోవడమే అద్వైతాన్ని ఆకళింపు చేసుకోవడం. అలా ఆకళింపు చేసుకోవడమనేదే దైవదర్శన సోపానం.  

ఒక ఇనుపగుండును వేడి చేస్తే ఆ వేడి ఇనుపగుండులోని అణువణువునా ఏ విధంగా వ్యాప్తి చెంది ఉంటుందో, అయస్కాంతంలో అయస్కాంతశక్తి ఎలా ప్రతి అణువునూ పట్టుకుని ఉంటుందో, అదేవిధంగా విశ్వమంతా శక్తి వ్యాపించి ఉంటుంది. ఏతావాతా తేలేదేంటంటే, ప్రతి దానిలో ఉన్నదే నీలో ఉన్నది, నీలో ఉన్నదే విశ్వంలో ఉన్నది. ఇట్టి విషయాన్ని దర్శించడమే దైవాన్ని దర్శించడం. ఈ విషయాన్ని గుర్తెరిగి ఆ భగవంతుడు లేదా అనంతమైనశక్తి అనేది సర్వాంతర్యామి అని, అతను అన్నింటిలో నిండి ఉన్నాడని గుర్తెరిగి మానవ ధర్మాన్ని ఆచరించాలి. ప్రతి మనిషి ఈ సదాచారాన్ని స్వీకరించి ఆచరించాలి. ఆ సదాచారం వలననే కులాల, మతాల, జాతుల పట్ల భేదభావం ఉత్పన్నం కాకుండా శాంతి, సౌభ్రాతృత్వం సమాజంలో వ్యాప్తి చెందుతాయి.

– గిరిధర్‌ రావుల

>
మరిన్ని వార్తలు