రోజంతా కష్టపడేది ఎందుకు?

12 Jul, 2013 12:49 IST|Sakshi
వంటింటికి స్పూన్ ఫీడింగ్?
రోజంతా కష్టపడేది ఎందుకు? అంటే... ‘కడుపు నింపుకోవడానికే కదా!’ నూటికి తొంభై మంది ఇచ్చే సమాధానం ఇదే అయి ఉంటుంది. రోటీ, కపడా ఔర్ మకాన్‌కి ఢోకా లేకుండా సమకూర్చుకున్న తర్వాత మనసు సౌకర్యాల మీదకు పోతుంది, ఆ తర్వాత సృజనాత్మకత మీదకు మళ్లుతుంది. అప్పటివరకు డైనింగ్ టేబుల్ మీద ఉన్న సాదా స్పూన్ల స్థానంలో మరింత కొత్తగా ఏదైనా చేస్తే బావుణ్ననిపిస్తుంది. అలా తయారైనవే ఇక్కడ కనిపించే కట్లరీ సెట్‌లు. 
 
ఇక్కడ కనిపించే ఫొటోలను పరాకుగా చూస్తే ఒక నగల పెట్టె, ఒక డిసెక్షన్ బాక్సు వగైరా వగైరా అని పొరబడతాం. నిజానికి ఇవన్నీ కట్లరీ సెట్ బాక్సులు. నగల పెట్టెలా కనిపిస్తున్నది సిల్వర్ కట్లరీ సెట్. డిసెక్షన్ బాక్సును తలపించే నీలిరంగు పెట్టెలో ఉన్నవి బంగారు పూత పూసిన స్పూన్లు, ఫోర్కులు, కత్తులు. వీటిని చూస్తే బ్రిటిష్ పాలకులు మనల్ని డైనింగ్ టేబుల్‌ని కూడా శాసిస్తున్నట్లే ఉంటుంది. కానీ గ్లోబలైజేషన్ ప్రభావంతో ప్రపంచం మొత్తం ఒక గ్రామంగా మారిన నేపథ్యంలో ఆహారపు అలవాట్లు కూడా కలగాపులగం అయిపోయాయి.  ఈ క్రమంలో అన్నాన్ని చేత్తో కలుపుకుని నోట్లో ముద్దలు పెట్టుకోవడం చేతకాని ప్రవాస భారతీయ తరం రూపొందింది. 
 
ఇప్పుడు భోజనం తినడానికి కంచం ఎంత అవసరమో చెంచా కూడా అంతే అవసరం మరి. అలాగని ప్రతి ఇంట్లో వెండి చెంచాలు, బంగారు చాకులను మెయింటెయిన్ చేయడం సాధ్యమయ్యే పని కాదు. కానీ స్టీల్ కట్లరీ సెట్ కొనుక్కోవడం కష్టమేమీ కాదు. ఇక్కడ కనిపిస్తున్న నీలిరంగు, పసుపురంగు హ్యాండిల్స్ ఉన్న కట్లరీ సెట్‌ల ధర దాదాపుగా ఐదు వందల రూపాయలు ఉంటుంది. సిల్వర్ కట్లరీ సెట్ ధర దాదాపుగా మూడువేల రూపాయలు ఉంటుంది.
 
మరిన్ని వార్తలు