ఆశలకు ఆస్ట్రేలియా రెక్కలు

23 Jan, 2020 01:28 IST|Sakshi

కోరుకున్న చదువు

స్రష్టవాణి బెంగళూరులోని రేవా న్యాయ విశ్వవిద్యాలయంలో ఎల్‌ఎల్‌బీ చేస్తున్నారు. ఇటీవలే ఆస్ట్రేలియాలోని వొలొంగాంగ్‌ యూనివర్శిటీలో బిఎల్‌ డిగ్రీ చదవటానికి అర్హత సంపాదించారు. ‘చేంజ్‌ ద వరల్డ్‌’ పేరుతో ఆ విశ్వవిద్యాలయం ప్రకటించిన అరవై లక్షల రూపాయల స్కాలర్‌ షిప్‌ అందుకోనున్నారు. ఆ స్కాలర్‌షిప్‌కు దేశవ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న 1.52 లక్షల మందిలో ఆ అరుదైన అవకాశాన్ని స్రష్టవాణి మాత్రమే దక్కించుకున్నారు. ఆ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడారు.

‘‘భారతీయ చట్టాలు, రాజ్యాంగంతోపాటు విదేశీ చట్టాలు, శిక్షల గురించి కూడా తెలుసుకోవటం మీద నాకు ఆసక్తి ఎక్కువ. బెంగళూరులో న్యాయవిద్యలో చేరిన నాటి నుంచే ఎలాగైనా విదేశాలకు వెళ్లాలని ఉండేది. అక్కడి చదువంటే లక్షలాది రూపాయలతో పని. నాన్న అరవింద్‌కుమార్‌ జర్నలిస్టు, అమ్మ ఆశ గృహిణి. మాది సాధారణ కుటుంబం. అందువల్ల నా ఆశ నెరవేరుతుందా అనుకునేదాన్ని. నాలుగో సెమిస్టర్‌ చదువుతున్నప్పుడు ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్‌ వొలొంగాంగ్‌ అందించే ‘ఛేంజ్‌ ద వరల్డ్‌’ స్కాలర్‌షిప్‌ గురించి తెలిసి, దరఖాస్తు చేసుకున్నాను. ఇందుకోసం లక్షలమంది పోటీ పడతారు.

జోక్‌ అనుకున్నాను
నేను ఈ స్కాలర్‌షిప్‌కి ఎంపికైనట్లు నాన్న చెప్పగానే మొదట జోక్‌ చేస్తున్నారనుకున్నాను. యూనివర్సిటీ ప్రతినిధుల నుంచి ఫోన్‌ వచ్చి, నిజమని తెలిశాక నా ఆనందం ఇంతా అంతా కాదు. అమ్మానాన్నలను గట్టిగా హత్తుకున్నాను. ఈ స్కాలర్‌షిప్‌కి న్యాయవిద్య చదువుతున్నవారే అర్హులు. ఇదొక్కటే చాలదు. బాల్యంలోని వ్యక్తిగత విశేషాలు, చదువులో చూపిన మెరుగైన ప్రతిభను కూడా పరిగణనలోకి తీసుకుని, పరీక్షిస్తారు. ‘న్యాయవిద్యతో మీరు ఈ ప్రపంచాన్ని ఎలా మార్చాలనుకుంటున్నారో  వివరిస్తూ రెండు నిమిషాల వీడియో పంపండి’ అని కోరటంతో, నా అభిప్రాయాలు చెప్పగలిగాను. నాకున్న పుస్తక పరిజ్ఞానం, అనేక సామాజిక అంశాలపై ఉన్న అవగాహన కారణంగా విశ్వవిద్యాలయ అధికారులు అడిగిన ప్రశ్నలకు సులభంగా సమాధానాలు చెప్పగలిగాను. వీటితోపాటు నా అభిరుచులు, నడవడిక, చేతిరాత కూడా ఈ ఎంపికలో ప్రధాన అంశాలుగా నిలిచాయనుకుంటాను.

మేఘం.. రైతు.. కవిత
చిన్నప్పటి నుంచి నాకు పుస్తకాలు చదవటం బాగా అలవాటు. ఆరోతరగతి చదువుతున్నప్పుడు మేఘాలకీ, రైతుకీ ఉండే సంబంధం గురించి హిందీలో రాసిన కవిత స్కూల్‌ మ్యాగజీన్లో అచ్చయింది. అది చూసుకున్న రోజు చెప్పలేనంత ఆనందంగా అనిపించింది. అప్పటినుంచి కవితలు రాస్తూనే ఉన్నాను. తాజాగా ‘మూన్‌లైట్‌ ఆఫ్‌ ది నూన్‌’ పేరుతో ఒక కవితల సంపుటాన్ని తీసుకొచ్చాను. ఇది నాకు మంచిపేరు తెచ్చి పెట్టింది’’ అని తెలిపారు స్రష్టవాణి.  
– సంభాషణ: వైజయంతి పురాణపండ

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా