శివుడి ప్రీతి కోసం కావడి వ్రతం

31 Jul, 2019 07:56 IST|Sakshi

కావడి వ్రతం ఎన్ని వందల ఏళ్ల క్రితం మొదలైంది అనడానికి సరైన ఆధారాలు లేవు. తల్లిదండ్రులను కావడిలో పెట్టుకుని పుణ్యక్షేత్రాలకు తిరిగిన శ్రావణ కుమారుడు వారిని హరిద్వార్‌లో పుణ్యస్నానం చేయించి తిరిగి వస్తూ ఘటంలో గంగాజలం తెచ్చుకున్నాడట. అలా ఈ ఆచారం మొదలైందని అంటారు.

ఉత్తరాదిన శ్రావణ మాసం జూలై ద్వితీయార్థం నుంచే మొదలైపోతుంది. శ్రావణ మాసం రాగానే ‘హరిద్వార్‌’, ‘గోముఖి’, ‘గంగోత్రి’ వంటి పుణ్యక్షేత్రాలు ‘కన్వరీయల’తో కిటకిటలాడతాయి. ‘కన్వరీయులు’ శివ భక్తులు. వీరు శ్రావణ మాసంలో గంగా నదీ తీరంలో ఉన్న పుణ్యక్షేత్రాలను చేరుకుని అక్కడి గంగాజలాలను కావడిలో నింపుకుని చుట్టుపక్కల ఉన్న ప్రసిద్ధ శైవ క్షేత్రాలకు చేరుకుని ఆ జలాలతో శివుని అభిషేకం నిర్వహించడం ద్వారా వ్రతాన్ని ముగిస్తారు.

తమ సొంత ఊరి వరకూ చేరుకుని ఊళ్లోని శివుని గుడిలో అభిషేకం ముగిస్తారు. ‘కన్వర్‌ యాత్ర’, ‘కావడి యాత్ర’గా పేరుగడించిన ఈ యాత్ర ప్రస్తుతం ఆచరణలో ఉంది. కొందరు భక్తులు శ్రావణ మాసంతో మొదలుపెట్టి శివరాత్రి మధ్యకాలంలో ఎప్పుడైనా కావడి యాత్రను చేస్తారు. కాని ఎక్కువగా శ్రావణమాసంలోనే ఈ వ్రతం ఆచరించడం పరిపాటి.

శివుడికి ఇష్టమైన మాసం
శ్రావణ మాసం శివునికి ఇష్టమైన మాసం అనీ ఈ మాసంలోనే శివుడు పార్వతిని పరిగ్రహించాడని భక్తుల నమ్మకం. అందువల్ల ఉత్తరాదిన ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, హర్యాణా, రాజస్థాన్, పంజాబ్‌ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు హరిద్వార్‌కు లేదా గంగానది పరివాహక పుణ్యక్షేత్రానికి చేరుకుంటారు. అక్కడ కాషాయ వస్త్ర ధారణ చేస్తారు. ఆ తర్వాత ఒక కావడి బద్దకు ఇరువైపులా స్టీలు, ఇత్తడి, లేదా ప్లాస్టిక్‌ ఘటాలను కట్టుకుని వాటిలో గంగాజలం నింపుకుంటారు.

ఈ వ్రతం పూర్తయ్యేవరకు కావడి పవిత్రమైనది. దానిని భుజాన మోస్తూ బోసి పాదాలకు దగ్గరిలోని ప్రసిద్ధ శైవ క్షేత్రానికి గానీ, లేదా తమ సొంత ప్రాంతంలోని శైవ క్షేత్రానికి గాని చేరుకుంటారు. తీసుకొచ్చిన గంగాజలంతో శివుడికి అభిషేకం జరిపిస్తారు. ఈ వ్రతాన్ని ఒక్కరుగా చేస్తారు. లేదా బృందాలుగా చేస్తారు. ఈ కావళ్లలో రకాలు ఉన్నాయి.

‘వ్యక్తి కావళ్లు’, ‘వాహన కావళ్లు’ అనే విభజనలు ఉన్నాయి. వ్యక్తి కావళ్లు పట్టిన వాళ్లు దారి మధ్యలో కావడిని దించవచ్చు. విశ్రాంతి, కాలకృత్యాలకు విరామం తీసుకోవచ్చు. కాని కొన్ని రకాల కావడి వ్రతంలో కావడిని కిందకు దించకూడదు. అందువల్ల ఆరుమంది సభ్యుల బృందం మార్చుకొని మార్చుకొని కావడి మోస్తూ గమ్యం చేరుకుంటుంది.

ఎప్పుడు మొదలైంది
కావడి వ్రతం ఎన్ని వందల ఏళ్ల క్రితం మొదలైంది అనడానికి సరైన ఆధారాలు లేవు. తల్లిదండ్రులను కావడిలో పెట్టుకుని పుణ్యక్షేత్రాలకు తిరిగిన శ్రావణ కుమారుడు వారిని హరిద్వార్‌లో పుణ్యస్నానం చేయించి తిరిగి వస్తూ ఘటంలో గంగాజలం తెచ్చుకున్నాడట. అలా ఈ ఆచారం మొదలైందని అంటారు. కాని పరశురాముడు ఈ ఆచారాన్ని మొదలెట్టాడని అనేవారు కూడా ఉన్నారు.

పురాణ ఉదాహరణ తీసుకుంటే క్షీరసాగర మథనంలో వెలువడ్డ హాలాహలాన్ని శివుడు కంఠాన నిలిపాక ఆయన కంఠం నీలంగా మారింది. దాంతో పాటు ఒక సన్నటి శిఖ ఆ హాలాహలం నుంచి రేగి శివుడిని ఇబ్బంది పెట్టసాగింది. ఇది తెలిసిన దేవతలు గంగానదికి వెళ్లి గంగాజలాన్ని తెచ్చి ఆయనకు అభిషేకం జరిపించారు.

అలా చేయడం వల్ల ఆ శిఖ చల్లబడి శివుడికి సౌకర్యం కలుగుతుందని భావించారు. అప్పుడు అలా మొదలైన ఆచారం ఇప్పటికీ కొనసాగుతుందని భక్తులు నమ్ముతారు. కాలకూట విషాన్ని గొంతులో మోస్తున్న శివుడిని చల్లబరిచే ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఆ బోళా శంకరుడు ప్రసన్నమై భక్తుల కోర్కెలు నెరవేరస్తాడని భావిస్తారు.

చాలా పెద్ద ఉత్సవం
కావడి వ్రత సమయంలో ఉత్తరాఖండ్, బీహార్, ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రాలు వ్రతబద్ధులు అయిన కన్వరీయుల సౌకర్యం కోసం మార్గమధ్యంలో ఎన్నో ఏర్పాట్లు చేస్తాయి. వారికి ఆహారం ఉచితంగా ఇవ్వబడుతుంది. తాత్కాలిక విశ్రాంతి కేంద్రాలు ఉంటాయి. కావడి నేల మీద పెట్టకుండా ఉండేందుకు ప్రత్యేకమైన స్టాండ్లు కూడా అందుబాటులోకి తెస్తారు.

అలహాబాద్, వారణాసి, దియోఘర్‌ (జార్ఘండ్‌), సట్లజ్‌గంజ్‌ (బీహార్‌) వంటి క్షేత్రాలలో కూడా కన్వరీయులు దీక్ష బూనడం ఈ శ్రావణ మాసంలో కనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మనవైపు అయ్యప్ప దీక్షతో సమానంగా ఉత్తరాదిన కావడి దీక్ష ఆచరణలో ఉంది. 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా