శ్రీ మద్భగవద్గీతా ప్రాశస్త్యం

10 Jan, 2016 00:58 IST|Sakshi
శ్రీ మద్భగవద్గీతా ప్రాశస్త్యం

• మామిడిపూడి ‘గీత’
ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో భీష్మద్రోణాది ప్రముఖులు, తన తండ్రులు, తాతలు, మామలు, అన్నలు, తమ్ములు, మిత్రులు గల కౌరవ సేనను చూడగానే, ‘వీరితోనా నేను యుద్ధం చేయవలసింది, వీరినా నేను సంహరించ వలసింది?’ అని అమితంగా బాధపడ్డాడు అర్జునుడు. అతని కళ్లలో నీళ్లు నిండాయి. తనను కౌరవులు కడతేర్చినా సరే, తాను మాత్రం యుద్ధం చేయనని ధనుర్బాణాలను వ దలి, రథంపై కూలబడి, శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు...
 
  ‘‘కృష్ణా! పూజ్యులైన గురువులను వధించి రక్తసిక్తములైన రాజ్యభోగాలను అనుభవింపమంటావా? కౌరవులందరిని వధించిన తర్వాత నేను బతికుండి ఏం లాభం? నాకేమీ తోచటం లేదు. దేవరాజ్యమైన స్వర్గం లభించినా నా శోకం తీరేలా లేదు. నాకు శాంతి కలిగే మార్గాన్ని బోధించు. నేను నీ శరణుకోరి ప్రార్థిస్తున్నాను. నా యెడల దయచూపి, ఇప్పుడు నాకు ఏది శ్రేయస్కరమో నిశ్చయించి, ఉపదేశించు’’
 అర్జునుడి ప్రార్థన విని శ్రీ కృష్ణుడి హృదయంలో అతని యెడల కరుణ రసం పొంగింది.

అప్పుడు ఆయన చేసిన బోధయే శ్రీ మద్భగవద్గీత.
 శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి తత్వజ్ఞానం ఉపదేశించి అజ్ఞానం పోగొట్టి, ధర్మాధర్మాలను నిర్వచించి, మనం కర్మలు చేయడంలో ఎలాంటి భావాలను అలవరచుకోవాలో చెప్పి, సంసార సాగరాన్ని తరించడానికి ఉపాయం సూచించాడు. మోక్షమార్గం చూపాడు. లోకోపకారం కోసం తత్వ విషయాలను అనేక విధాల వివరించి, స్పష్టం చేశాడు. గీతాశాస్త్రంలోని ఉపదేశాలను అర్థం చేసుకుని అనుసరిస్తే మనం మన జీవితాలను ప్రశాంతంగా గడిపి మోక్షం పొందవచ్చు.
 
 శ్రీకృష్ణుడు మానవ మాత్రుడు కాడు... లోకాన్ని ఉద్ధరించడానికి దేహధారి అయి, అవతరించిన సర్వేశ్వరుడు. ధర్మసంస్థాపన కోసం అవతరించిన పరమాత్ముడు. ధర్మం మరుగున పడి అధర్మం చెలరేగినప్పుడు ధర్మాన్ని ఉద్ధరించి సాధువులను రక్షించడానికి, దుష్కృతులను శిక్షించడానికి ప్రతి యుగంలోనూ అవతరించి లోకాన్ని కాపాడుతున్న విశ్వేశ్వరుడు.
 విశ్వరహస్యాలను విశ్వేశ్వరుడు గాక మరెవరు చెప్పగలరు? కాబట్టి శ్రీ మద్భగవద్గీత ప్రమాణ గ్రంథం. అందులోని వాక్యాలు సత్యాలు, పూజనీయాలు.
             కూర్పు: బాలు- శ్రీని
             గీతాశాస్త్రం ఉపదేశించిన విషయాలు సనాతన సత్యాలు (వచ్చేవారం)

 

మరిన్ని వార్తలు