జగదాచార్యునికి వందనమ్‌

24 Aug, 2019 07:31 IST|Sakshi

పరమ గురువు

వసుదేవుని సుతుడు, కంసచాణూరులను మర్దించినవాడు, దేవకీదేవికి పరమానందం కలిగించినవాడు, జగద్గురువు అయిన శ్రీకృష్ణునికి వందనం.ఒకనాడు శ్రీకృష్ణుడు పాండవులను వెంటబెట్టుకుని, అంపశయ్య మీద ఉన్న భీష్మపితామహుడిని దర్శించి, ‘తాతా! నీ మనుమలకు ధర్మబోధ చెయ్యి’ అన్నాడు. శ్రీకృష్ణుని మాటలకు చిరునవ్వుతో భీష్మపితామహుడు, ‘జగన్నాటక సూత్రధారీ! చతుర్దశ భువనాలనూ సృష్టించి, పోషించి, లయం చేసే పరాత్పరుడవు, జగదాచార్యుడవు. నీ సమక్షంలో నేను పాఠం చెప్పడమంటే, గురువుగారి సమక్షంలో శిష్యుడు పాఠం చెప్పినట్లుంటుందయ్యా’ అన్నాడు. అలా భీష్ముడంతటి వాడు స్వయంగా శ్రీకృష్ణుడిని ‘జగదాచార్యా!’ అని సంబోధించాడు. (ఉషశ్రీ భారతం నుంచి)

జగద్గురువు, జగదోద్ధారకుడు, జగదాచార్యుడు, గీతాచార్యుడు... ఎన్ని నామాలతో స్మరించినా తనివి తీరదు.  దశావతారాలలో శ్రీకృష్ణుడిని మాత్రమే సంపూర్ణావతారంగా, మిగిలిన అవతారాలను అంశావతారాలుగా వివరించారు. కృష్ణస్తు భగవాన్‌ స్వయమ్‌... కృష్ణుడు స్వయంగా భగవంతుడు... అని శ్రీకృష్ణుని స్తుతించారు.

కురుక్షేత్ర యుద్ధం కురుపాండవుల మధ్య జరిగింది. ఆవలి పక్షంలో ఉన్న కురు, గురు వృద్ధులను చూసిన అర్జునుడికి వైరాగ్యంతో చేతిలో గాండీవం జారిపోతోంది, నన్ను పెంచి పెద్ద చేసిన తాతలను, విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సంహరించలేను, నేను యుద్ధం చేయలేను’ అన్నాడు. నవ్వురాజిల్లెడు మోముతో శ్రీకృష్ణపరమాత్ముడు గవద్గీత ప్రబోధించాడు. అర్జునుడు కర్తవ్యం తెలుసుకున్నాడు. చేసేవాడు, చేయించేవాడు అన్నీ ఆ పరమాత్ముడేనని అవగతం చేసుకున్నాడు. అంతే! గాండీవం అందుకున్నాడు. శత్రు సంహారం చేశాడు. లోకాలకు శాంతి చేకూర్చాడు. ఇదంతా అర్జునుడు చేసినది కాదు. జగద్గురువు శ్రీకృష్ణుడు నడిపించాడు. సాక్షాత్తూ పరమాత్ముడు భగవంతుడై, భగవంతుడు శ్రీకృష్ణుడై మానవజాతి సంక్షేమానికి ఉపకరించేలా సమగ్రమైన మార్గదర్శక సూత్రాలను ‘భగవద్గీత’ గా అందించి జగద్గురువయ్యాడు.

శ్రీకృష్ణుని పేరులోనే ఆకర్షణ ఉంది. కర్షతి ఇతి కృష్ణ... ఆకర్షించేవాడని అర్థం. శ్రీకృష్ణునిలాగే, భగవద్గీత కూడా అందరినీ ఆకర్షిస్తూనే ఉంటుంది. మానవజాతిని శాసిస్తూనే ఉంటుంది. ఆ శాసనాన్ని భగవంతుడు తియ్యగా గానం చేశాడు. కఠినమైన పాఠాన్ని శిష్యులకు సులభంగా అర్థమయ్యేలా చెప్పగలిగాడు. గురువులకే గురువైన శ్రీకృష్ణుడు జగద్గురువయ్యాడు. ఉపనిషత్తుల సారమే భగవద్గీత. మానవజాతికి మానవ ధర్మాలను బోధించిన సరళమైన సమగ్ర గ్రంథం.  భక్తి జ్ఞాన వైరాగ్యాలను, వ్యక్తిత్వ వికాసానికి కావలసిన ధైర్యాన్ని, మానసిక స్థైర్యాన్ని, కార్యశీలతను కేవలం 700 శ్లోకాలలో చెప్పాడు. కాల ప్రాంతాలకు అతీతంగా అందరికీ ఎక్కడైనా పనికొచ్చేలా మార్గనిర్దేశం చేశాడు. శ్రీకృష్ణుడు బోధించిన అంశాలు సర్వకాల సర్వావస్థలలో సర్వ మానవాళికీ ఆచరణయోగ్యంగా ఉంటాయి కనుకనే ఆయన జగద్గురువయ్యాడు.

‘మానవజాతికి పిరికితనం పనికిరాదు. హృదయ దౌర్బల్యాల వల్ల ఏమీ సాధించలేం’ అని ఉపదేశించాడు.  ఒక పని చేసేటప్పుడు ఆందోళన పడకుండా, ఫలితం కోసం ఆశపడకుండా, పనిని శ్రద్ధగా ఆచరిస్తే సత్ఫలితాలొస్తాయని చెబుతూ, ‘కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన...’ అన్నాడు. ‘‘మనసులో చెలరేగే కోరికలను అక్కడే అణగదొక్కి ఆత్మయందే అన్నిటినీ అనుభవించగలవాడు స్థితప్రజ్ఞుడు. క్లేశాలకు కుంగడు, సుఖాలు మీదపడినా లొంగడు. భయం, క్రోధం, రాగం అనేవాటిని దరిచేరనివ్వడు’’ అన్నాడు. అత్యాశతో సమాజాన్ని పీడించకుండా, సుఖదుఃఖాలను సమానంగా భావించాలి... అంటూ అన్ని మతాలు, అన్నిప్రాంతాల వారికి  సందేశం ఇచ్చాడు. అందువల్లే ఆయన జగద్గురువయ్యాడు.

లోకంలో జనసామాన్యం తమ కంటె ఉత్తములైన వారినే అనుసరిస్తారు. ముల్లోకాలలో చెయ్యవలసింది యేదీ లేకపోయినా, వాంఛించేది లేకపోయినా జ్ఞానులు నిరంతరం కర్మ చేస్తూనే ఉండాలి. కర్తవ్యం నిర్వర్తించకపోతే సోమరులవుతారు. దానివల్ల లోకనాశం తప్పదు. జ్ఞానులు కర్మ చేస్తూ అజ్ఞానులకు మార్గదర్శకులు కావాలని బోధించి జగద్గురువయ్యాడు.జ్ఞానబోధ చేస్తూ, ‘‘ఎన్ని పాపాలనైనా జ్ఞానం నశింపచేస్తుంది. పాపనాశన విధానం తెలుసుకోవడం కోసమే గురు శుశ్రూష చేయాలి’’ అని గురువు ఔన్నత్యాన్ని బోధించి జగద్గురువయ్యాడు. ఒక్క భగవద్గీత చేత పట్టుకుని స్వామి వివేకానంద ప్రపంచమంతా పర్యటించాడు. విద్యారణ్యులు విజయనగర సామ్రాజ్యం స్థాపించాడు.యశోదా నందనుడైన చిన్ని శిశువుకి, దేవకీ సుతుడైన జగద్గురువుకి వందనమ్‌!!!– డా. పురాణపండ వైజయంతి

గురువంటే...
గురువు త్రిమూర్త్యాత్మకంగా ఉండాలి. శిష్యులలోని అజ్ఞానాన్ని పోగొట్టి, నడిపించే శక్తి కలిగి ఉన్నవాడు గురువు. అజ్ఞానమనే చీకటిని పారద్రోలగలిగేవాడు గురువు అని శాస్త్రం చెబుతోంది. తన సందేశం ద్వారా మొత్తం ప్రపంచాన్ని నడిపించగలిగినవాడిని జగద్గురువు అంటారు. శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీతతో ఆయన జగద్గురువయ్యాడు.– డా. పాలపర్తిశ్యామలానందప్రసాద్‌

భగవద్గీతలోని కొన్ని శ్లోకాల అర్థాలు...
∙కర్మ చెయ్యని వాని కంటె కర్మ చేసే వాడే ఉత్తముడు ∙జ్ఞానికి ఈ లోకంలో భేద దృష్టి లేదు. విద్యతో వినయ సంపత్తితో భూషితుడై విద్వాంసుడు ఎలా కనిపిస్తాడో అలానే ఆవునీ, ఏనుగునీ, కుక్కనీ, కుక్క మాంసం తినేవానినీ చూస్తాడు ∙దొరికిన దానితో తృప్తిగా జీవిస్తూ జీవయాత్ర నడుపుతూ, నిందలకు కుంగకుండా, పొగడ్తలకు గర్వపడకుండా స్థిరచిత్తంతో ఉండేవాడు ప్రీతి కలిగించే భక్తుడు ∙ఆత్మస్తుతి, ఆడంబరం, హింస దరి చేరరాదు. ఓరిమి, సౌమ్య స్వభావం, సద్గురుసేవ, శుచి, నిగ్రహం, విరాగం అవసరం ∙కామక్రోధలోభాలు మూడూ నరక ద్వారాలే. అందుకే వీటిని జయించాలి. అప్పుడు  శ్రేయోమార్గం ప్రాప్తిస్తుంది ∙కర్మలన్నిటిలోనూ దోషం ఉన్నది. పొగ లేని నిప్పు ఉండదు. పొగను చూసి దూరం పోతే అగ్ని లభించదు కదా.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా