గోకుల కృష్ణా... గోపాల కృష్ణా!

23 Aug, 2019 07:50 IST|Sakshi

కృష్ణప్రేమ

గోకులంలో ఒక రోజు. గోకులం అంతా సందడిగా ఉంది. నందవ్రజంలో  నందుని ఇంట సమావేశాలు జరుగుతున్నాయి. అందరి నోటా కృష్ణా! కృష్ణా! అనే నామ స్మరణ వినబడుతోంది. ఆ ఘన పదం, ఆ అద్భుత నామం బయటకి రాగానే అది వాయువు మోసుకొస్తే బయట నంద వీధుల్లో పయనించి అందరి వీనులను స్పృశించ గానే ఇళ్ళల్లో ఉన్న గోపికలకు, గోపవనితలకు అది  దివ్య స్మరణగా మారితే భక్తిపారవశ్యంతో తలుచుకుంటూ  ఒళ్ళుతెలియని స్థితిలో పెరుగు, పాలు పారబోసుకుంటూ ఇంట్లో వాళ్ళతో తిట్లు తింటున్నారు. కానీ స్వామి నామస్మరణలో స్మృతిలో లేని వాళ్ళకి ఆ తిట్లు ఏవీ వినబడడం లేదుట. స్వామి నందనవనం విడిచి వెళ్లిపోయాక వారి బాధ వర్ణనాతీతం.

మరోచోట నందుని ఇంటి పెరట్లో ఉన్న  వెనక పెద్ద అరుగు మీద ‘కవ్వాలు‘ కట్టిన స్తంభాలకి ఆనుకుని కూర్చుని ఉన్న మరింత మంది అమ్మలక్కలతో యశోద చంటాడి చిన్నప్పటి లీలలు, వాడి ముద్దుమాటలు తలుచుకుని తలుచుకుని ఆనందపడిపోతూ మధ్య మధ్యలో చిప్పిల్లిన కన్నీళ్ళు తుడుచుకుంటోంది.వాడు చిన్నప్పుడు అల్లరి చేస్తే మీ ‘గోలకి ‘వాడ్ని రోలుకు కట్టాను పాపాత్మురాల్ని! దామోదరుడి ‘ఉదరానికి‘ తాడుకట్టి చెట్టుకి కట్టాను.. అయినా నా కన్నయ్య ఎప్పుడూ చిలిపిగానే నవ్వేవాడు తప్ప ఒక్క రోజు కూడా ఏడవలేదు.

‘మన్ను తిన్నాడని’ కొట్టబోతే మిన్నకుండి నన్ను చూసి నవ్వి నోరు చూపిస్తే, నాకు అదేదో మత్తులాంటి నిద్రలా వచ్చింది, తరవాత వాడి ముఖంలో ‘‘ముగ్ధమనోహరంగా ఒక మెరుపు, నాకేమో మైమరుపు’’ ఏం జరిగిందంటారు ఆ రోజు?  అని అమాయకంగా వాళ్ళని  అడుగుతుంటే మిగిలినవారు ఏమోనమ్మ? మీ అమ్మా కొడుకుల మధ్య  ఏముందో! మాకైతే ఈ మధ్య అస్సలు తోచడం లేదు చేతికి పనిలేక! ఎంత దాచిన వెన్నైనా ఇట్టే దోచేసేవాడు, ఒఠ్ఠి వెన్నదొంగ! దాంతో మళ్ళీ మేము చేతులు నెప్పిపుట్టేదాక కవ్వాలతో చిలికి వెన్నతీయడం దాయడం అది మళ్ళీ ఆ నందగోపాలుడి పాలపడేది. మాకు ఇదే పనితో రోజు సరిపోయేది.

ఇప్పుడు పూర్తిగా మా ‘వెన్న కుండలు ‘ నిండుగా ఉన్న మా మనస్సులు మాత్రం ఖాళీగా ఉన్నాయి సుమా! ఇదంతా వింటున్న, అక్కడ ఉన్న గోశాలంలో ఉన్న కపిల గోవులు ‘అయ్యో అదే కదా! కృష్ణ మాయ! మేం పాలివ్వమని మొండికేస్తే ఆయన మురళీరవానికి మాకు తెలియకుండా పొటమరించిన పొదుగులనుండి ధారాపాతంగా పాలు పెల్లుబికి ఆ కృష్ణ పాదాలు కడిగేసేవి! ఆయన  ‘గోపాలుడు‘ కదా మరి!’ అని అనుకుంటుంటే వాటి మనసు తెలిసిన తువ్వాయిలు‘అవునా అమ్మ! మరి మా గతి ఏమిటి ఇప్పుడు?? అంటే ‘గోవిందుడొస్తాడుగా మళ్ళీ! వేచిచూడండి అంటున్నాయి. (కలియుగంలో పుట్టలో శ్రీనివాసునికి పాలిచ్చే అవకాశం వచ్చిందిట)

గత వారం రోజులనుండి రాబోయే గోకులాష్టమికి ఎలా ఏర్పాట్లు ఎంత వైభవంగా  చెయ్యాలా ? ఎంత ఎత్తున పెరుగు, వెన్న ఉట్టులు నిల బెట్టాలా? విందుల్లోకి ఏమేమి  వండివార్చాలా? అని తర్జన భర్జన పడుతున్న నందునికి తన కుమారునితో గడిపిన ఆ ఘట్టం గుర్తుకొచ్చింది. తన చిటికిన వేలు చూసుకుని దానిని ఆప్యాయంగా ముద్దుపెట్టుకొన్నాడు.
నా చిన్ని తండ్రి వాడి చిన్నప్పుడు తన చిటికిన వేలుని నా వేళ్ళతో కలిపి పెనవేసుకొని గోకులం వీధులలో నాతో తిరగడానికి  వచ్చేవాడు. వద్దు కన్న!  వద్దు కన్నా! అంటున్నా నన్ను వారించి  తామరతూడులాంటి  చిటికెన వేలితో ఆశ్చర్యంగా, నా కళ్ళను నేనే నమ్మలేనంతగా గోవర్థనం ఎత్తి మమ్మల్నందరిని కాపాడిన గోవిందుడతడు. అలాంటి కొడుకు  నా ఇంట పెరగడం వల్ల మా జీవితాలు ధన్యమయ్యాయి, ఈ నందవనం మరింత ధన్యమయ్యింది అనుకుంటున్నాడు. అందరూ మళ్ళీ కృష్ణుడు ఉపదేశించినట్టుగా కర్తవ్యోన్ముఖులై శ్రీ కృష్ణ జన్మాష్ఠమిని వైభవోపేతంగా జరపడానికి సంసిద్ధమయ్యారు.

ఆకసం నీలం రంగును పులుముకొంది, శ్రావణ మేఘమాలిక నెమలి ఫించంగా రూపుదాల్చుకుంది. వెదుళ్ళ మధ్యలోంచి విహరిస్తున్న వాయువు మురళీరవాన్ని అనుకరించడానికి ప్రయత్నిస్తోంది. రోహిణీ నక్షత్రం పొడిచింది. భగవానుడు ప్రకృతిని ఆరాధించమని ఏనాడో చెప్పాడుకదా మరి గోకులంలో గోవులకి. వృక్షరాజాలకి పూజలు చేశారందరూ.
గోపాలురు, గోపవనితలు కలిసి సప్తవర్ణాల ‘భర్గుండా‘లు నీటిలో కలిపి  ఒకళ్ల మీద ఒకళ్లు జల్లుకున్నారు. ఆ వర్ణాలతో అది ‘హరి‘విల్లయింది. ఆ హరివిల్లుమీద ఆసీనుడైన భగవానుని సాక్షాత్కారమైంది కొందరికి. వాళ్ళు భక్తిలో, సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయారు. ఉట్టి కొట్టిన గోపబాలురకు నందుడు మంచిమంచి బహుమతులిచ్చాడు. యశోద గో ఘృతం అంటే ఆవు నెయ్యి వేసిన ‘కాయపు చూర్ణం‘ అందరికి పంచిపెట్టింది. అందరూ ఆనందంతో విందు ఆరగిస్తూ కృష్ణుని లీలలు తలుచుకుంటూ తన్మయమవుతూ శ్రీ కృష్ణాష్టమి పండగ చేసుకున్నారు. మనం కూడా భగవానుని కృపకు పాత్రులవుదుము గాక!– చాగంటి ప్రసాద్‌ (చా.ప్ర)

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా