బ్రహ్మోత్సవ గిరి

25 Apr, 2017 23:45 IST|Sakshi
బ్రహ్మోత్సవ గిరి

పుణ్యతీర్థం

శివ స్వరూపుడైన వైద్యనాథేశ్వరునికి, విష్ణు స్వరూపుడైన చెన్నకేశవునికి నిలయమైన పుష్పగిరి  క్షేత్రం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. పంచనదీ సంగమక్షేత్రంగా వాసికెక్కింది. ప్రతి సంవత్సరం చైత్ర బహుళ త్రయోదశి నుంచి వైశాఖ శుద్ధ సప్తమి వరకు పుష్పగిరిలోని శ్రీ కామాక్షీ వైద్యనాథేశ్వర, శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వార్ల బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఏప్రిల్‌ 28న శ్రీ చెన్నకేశవుని చందనోత్సవం అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది. 29న అక్షయ తదియ సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు భారీగా తరలి వస్తారు. 30న ముత్యాల తలంబ్రాలతో శ్రీ కామాక్షీ వైద్యనాథుల, శ్రీ లక్ష్మీ చెన్నకేశవుల కల్యాణోత్సవాలు, మే1న ఇరువురు స్వాముల రథోత్సవాలు జరగనున్నాయి.  

స్కంద పురాణంలోని శ్రీశైల ఖండం పుష్పగిరిని విశేషంగా పేర్కొంది. ఇందులో పుష్పగిరి క్షేత్రంగానే కాక తీర్థంగా కూడా కొనియాడబడింది. పుష్పగిరిలో ఒక్కరోజు ఉపవాసం వుండి ఆయా దేవతలను దర్శిస్తే ఈలోకంలోనే కాక పరలోకంలో కూడా సౌఖ్యం లభిస్తుందని స్థల పురాణం చెపుతోంది. సూర్యగ్రహణ సమయంలో కానీ, అక్షయతృతీయ రోజున గానీ సంకల్ప పూర్వకంగా పినాకినీలో స్నానం చేసి శివ కేశవులను దర్శిస్తే వంద అశ్వమేధ యాగాలు చేసిన ఫలం లభిస్తుందని విశ్వాసం. ఇక్కడ శ్రాద్ధ కర్మలు చేయడం ఎంతో ఫలదాయకమని, గయ క్షేత్రంలో చేసే పిండ ప్రదానంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రం ఇక్కడ ప్రవహిస్తున్నపినాకినీ నది పాపాగ్ని, కుముద్వతి, వల్కల, మాండవి నదుల సంగమమై ప్రవహిస్తూ పంచ నదీ సంగమంగా వాసికెక్కింది. ఇక్కడ స్నానాలాచరిస్తే సకల పాపాలూ హరిస్తాయని భక్తులు విశ్వసిస్తారు.

అబ్బుర పరిచే శిల్ప సంపద
కొండపైన గల చెన్న కేశవ స్వామి ఆలయ కుడ్యాలపై వున్న శిల్ప సంపద మన వారసత్వ సంపదకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి. కాళీయ మర్దనం, క్షీర సాగర మదనం, తాండవ కృష్ణుడు, నారసింహుడు, యోగ నారసింహ మూర్తి, కృష్ణార్జున యుద్ధ ఘట్టం, ప్రత్యేకతను సంతరించుకున్న నృత్య గణపతి శిల్ప సంపద చూపరులను ఆకర్షిస్తుంది.

శ్రీరామునిచే పూజలందుకున్న వైద్యనాథేశ్వరుడు
ఒక ఇతిహాసం ప్రకారం శ్రీ రామచంద్రుడు రావణుని సంహరించేందుకు లంకకు వెళుతూ ఈ ప్రాంతంలో కొంతకాలం న్నాడు. ఆయన ప్రతిరోజూ ఇక్కడి వైద్యనాథేశ్వరుని పుష్పాలతో పూజించి, ముందురోజు పూజకుపయోగించిన పూలను తీసి నదిలో వేసేవాడు. కొన్నాళ్లకు ఆ పూల రాసి క్రమంగా కొండంత పెరిగి, నీటిలో తేలియాడింది. దీంతో పుష్పగిరి అనే పేరు వచ్చిందనే కథ ప్రచారంలో వుంది.

ఆది శంకరాచార్యులు స్థాపించిన అద్వైత పీఠం
శ్రీ జగద్గురువు ఆది శంకరాచార్యుల చేతుల మీదుగా దక్షిణాదిలో స్థాపించబడిన ఏకైక అద్వైత పీఠంగా పుష్పగిరిలోని పీఠం ప్రఖ్యాతి గాంచింది. స్వయంగా ఆది శంకరాచార్యుల శిష్యులైన శ్రీ విద్యారణ్య భారతి స్వామి అధిష్టించి ధర్మపాలన చేసిన పీఠం. ఆయన పరంపరగా శ్రీ విద్యా శంకర భారతి స్వామివారు ప్రస్తుతం ఈ పీఠానికి పీఠాధిపతిగా ధర్మ సంస్థాపనకు కృషి చేస్తున్నారు. ఈ పీఠంలోని మహిమాన్విత చంద్రమౌళీశ్వరుని రూప స్ఫటిక లింగం కైలాసం నుండి నేరుగా ఇక్కడి పీఠంలో వెలసిందని ప్రతీతి. ఈ స్ఫటిక లింగానికి అనునిత్యం  పూజలు జరుగుతాయి.

విశిష్టమైన శ్రీ చక్రం
పుష్పగిరిలోని వైద్యనాథేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో వున్న శ్రీ కామాక్షీదేవి ఆలయంలో అమ్మవారికి ఎదుట ఎంతో విశిష్టత కల శ్రీచక్రం వుంది. చతుర్దశ భువనాలకు అధికారిణి అయిన కామాక్షీ దేవి శ్రీచక్ర సంచారిణి అని ప్రతీతి. ఇక్కడి అమ్మవారి ఎదుట బిందు, త్రికోణ, వసు కోణాలతో దాదాపు 27 అంగుళాల ఎత్తు వున్న మహామేరువు శ్రీచక్రం విజయనగర రాజ్య స్థాపనకు హరి హర బుక్క రాయలను ప్రేరేపించిన శ్రీ విద్యారణ్య స్వామి ప్రతిష్టితమని స్థలపురాణం చెబుతోంది.

దర్శించాల్సిన ఆలయాలు
పుష్పగిరి గ్రామంలో శ్రీ వైద్యనాథ స్వామి, శ్రీ చక్ర సహిత కామాక్షీ దేవి, లక్ష్మీనారాయణ స్వామి, భీమలింగేశ్వర స్వామి ఆలయం, త్రికూటేశ్వర స్వామి ఆలయంలో త్రికూటేశ్వరుడు, భీమేశ్వరుడు, ఉమా శంకరుడు, అభినవ చెన్న కేశవ స్వామి, పాతాళ గణపతి,

పుష్పగిరి పీఠం.
పుష్పగిరి కొండపైన శ్రీ చెన్న కేశవ స్వామి, లక్ష్మీ దేవి, ఆంజనేయ స్వామి, సంతాన మల్లేశ్వర, సాక్షి మల్లేశ్వర, రుద్రపాదం, దుర్గ, ఇంద్ర నాథేశ్వర ఆలయాలను సందర్శించవచ్చు.

చేరుకోవడం ఇలా
వైఎస్‌ఆర్‌ జిల్లా కేంద్రమైన కడప పట్టణానికి 18 కి. మీ దూరంలో పుష్పగిరి వుంది.  అక్కడి నుండి బస్సులు, ఆటోల్లో పుష్పగిరికి చేరుకోవచ్చు. కడప రైల్వే స్టేషన్‌ నుండి దాదాపు 18 కి. మీ దూరం వుంటుంది.
– నవనీశ్వర్‌రెడ్డి సాక్షి, వైఎస్సార్‌ జిల్లా

మరిన్ని వార్తలు