శ్రీరామునర్చించు జిహ్వజిహ్వ..!

4 Apr, 2014 23:52 IST|Sakshi
శ్రీరామునర్చించు జిహ్వజిహ్వ..!

రాముడి పేరు తియ్యన కాబట్టి
 ‘పిబరే రామరసం’ అనుకుంటూ ఒకాయనా, ‘నీ నామమెంతొ రుచిరా’ అంటూ ఇంకొకాయనా
 దాన్నే తాగేస్తూ గడుపుతానంటారు.
 మాన్యుల మాటలు సరే... మనలాంటి సామాన్యుల సంగతేమిటి?
 అందుకే మనం...
 ఒడల పులకరింతతో పాటు ‘వడపప్పునూ, రామనామామృతానికి తోడు పంచామృతాన్నీ,తినగలిగినన్ని సెనగలనూ స్వీకరిద్దాం.  
 కౌసల్యాసుప్రజారాముణ్ణి నర‘శార్దూలా’ అన్న తర్వాత ఇక పొడి ‘పులి’హోర ఆరగించకపోతే ఎలా...?
 ఇక పై రుచులన్నింటికీ అదనపు అనుపానంలా రాముడి నామాన్నే తేనె, చక్కెరల్లా కలిపేద్దాం!
 పండగ నాడు పానకంలా కలిపేసి తాగేద్దాం!!

 
 పొడి పులిహోర

 కావలసినవి:  
 సన్నబియ్యం - 2 కప్పులు; పచ్చిమిర్చి - 4; కరివేపాకు - 3 రెమ్మలు; ఉప్పు - తగినంత; పసుపు - తగినంత; నూనె - కప్పు; చింతపండు రసం - పావు కప్పు (చిక్కగా ఉండాలి); పోపు కోసం: ఆవాలు - టీ స్పూను; మినప్పప్పు - టీ స్పూను; సెనగపప్పు - 2 టేబుల్ స్పూన్లు; ఇంగువ - పావు టీ స్పూను; ఎండుమిర్చి - 6;

పొడి కోసం:
మినప్పప్పు - టీ స్పూను; పల్లీలు - టేబుల్ స్పూను; సెనగపప్పు - టేబుల్‌స్పూను; ఎండుమిర్చి - 5; నువ్వుపప్పు - 2 టేబుల్ స్పూన్లు; పుట్నాల పప్పు - టేబుల్ స్పూను; జీడిపప్పు - 10
 
 తయారీ:  
 ముందుగా పొడికి కావలసిన పదార్థాలను నూనె లేకుండా వేయించి చల్లారాక పొడి చేసి పక్కన ఉంచుకోవాలి  
 
 బియ్యానికి మూడు కప్పుల నీరు జత చేసి ఉడికించాలి  
 
 బాణలిలో నూనె కాగాక ఇంగువ, పోపు సామాను వేసి వేయించాలి
 
 చింతపండు రసం, ఉప్పు, పసుపు జత చేసి ఉడికించి దింపేయాలి
 
 ఒక పెద్ద పళ్లెంలో అన్నం విడివిడిలాడేలా వేయాలి  
 
 పోపు వేసి బాగా కలపాలి
 
 పొడి వేసి కలిపి వడ్డించాలి.
 
 కొబ్బరిపాల పరమాన్నం
 
 కావలసినవి:

 బియ్యం - కప్పు; కొబ్బరి పాలు - కప్పు; నెయ్యి - అర కప్పు; చిక్కటి పాలు - కప్పు; బెల్లం తురుము - కప్పు; కిస్‌మిస్ - 10; జీడిపప్పు - 10; ఏలకుల పొడి - టీ స్పూను; పచ్చ కర్పూరం - కొంచెం
 
 తయారీ:  

 ముందుగా బియ్యంలో మామూలు పాలు, నీళ్లు కలిపి కుకర్‌లో ఉంచి ఉడికించాలి  అన్నంలో కొబ్బరిపాలు కలిపి స్టౌ మీద ఉంచి కొద్దిగా ఉడికించాలి
 
 బెల్లం తురుము వేసి కలిపి చిన్న మంటపై ఉడికించాలి  
 బాణలిలో నెయ్యి వేడి చేసి జీడిపప్పు, కిస్‌మిస్ వేసి వేయించి, ఉడుకుతున్న పరమాన్నంలో వేయాలి  
 
 ఏలకుల పొడి, పచ్చకర్పూరం జత చేయాలి.
 
 పంచామృతం
 
 కావలసినవి:
 పెరుగు - అర కప్పు; పాలు - అర కప్పు; తేనె - 2 టేబుల్ స్పూన్లు; నెయ్యి - టీ స్పూను; పంచదార - 2 టీస్పూన్లు; అరటిపండు - ఒకటి; కొబ్బరినీళ్లు - టేబుల్ స్పూను (అరటిపండ్లు, కొబ్బరినీళ్లను రుచి కోసం వాడుకోవచ్చు. ఇవి పంచామృతాలలో ఉండే ఐదు పదార్థాలలోకి  చేరవు)
 
 తయారీ:  
 అరటిపండు ముక్కలు చేసి పక్కన ఉంచాలి  
 
 ఒక పాత్రలో పెరుగు, పాలు, కొబ్బరినీళ్లు, తేనె, నెయ్యి, పంచదార వేసి బాగా కలపాలి  
 
 అరటిపండు ముక్కలు జత చేయాలి
 
 దేవుడికి నైవేద్యం పెట్టి ప్రసాదం స్వీకరించాలి.
 
 పోపు సెనగలు
 
 కావలసినవి:
 సెనగలు - కప్పు; కొబ్బరితురుము - 3 టేబుల్ స్పూన్లు; ఆవాలు - అర టీ స్పూను; మినప్పప్పు - అర టీ స్పూను; ఎండుమిర్చి - 2; కరివేపాకు - 2 రెమ్మలు; నూనె - 2 టీ స్పూన్లు; ఇంగువ - చిటికెడు; పసుపు - చిటికెడు, ఉప్పు - తగినంత
 
 తయారీ:      
 సెనగలను సుమారు ఆరు గంటల సేపు నానబెట్టాలి
 
 నీరు వడపోసి కుకర్‌లో ఉంచి నాలుగు విజిల్స్ వచ్చాక దించేయాలి  
 
 బాణలిలో నూనె కాగాక ఆవాలు, మినప్పప్పు వేసి వేయించాలి  
 
 కరివేపాకు, ఎండుమిర్చి ముక్కలు, ఇంగువ జత చేయాలి  
 
 ఉడికించుకున్న సెనగలు వేసి వేయించాలి  
 
 పసుపు, కొబ్బరితురుము వేసి కలిపి దించేయాలి
 
 వేడివేడిగా వడ్డించాలి.
 
 వడపప్పు
 
 కావలసినవి:
 పెసరపప్పు - కప్పు; పచ్చికొబ్బరి తురుము - పావుకప్పు; మామిడికాయ తురుము - పావు కప్పు; పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను; ఉప్పు - తగినంత; క్యారట్ తురుము - పావుకప్పు
 
 తయారీ:
 పెసరపప్పును తగినంత నీటిలో సుమారు రెండు గంటలసేపు నానబెట్టాలి
 
 నీరంతా వడక ట్టేయాలి
 
 ఒక పాత్రలో నానిన పెసరపప్పు, పచ్చికొబ్బరి తురుము, మామిడికాయ తురుము, క్యారట్ తురుము, ఉప్పు, పచ్చిమిర్చి తరుగు వేసి కలపాలి.
 
 పానకం
 
 కావలసినవి:
 బెల్లం తురుము - 2 కప్పులు
 నీళ్లు - 5 కప్పులు
 ఏలకులపొడి - టీ స్పూను
 మిరియాలపొడి - 2 టీ స్పూన్లు
 
 తయారీ:
 ఒక పాత్రలో నీళ్లు, బెల్లం తురుము వేసి బాగా కలపాలి
 
 ఏలకుల పొడి, మిరియాల పొడి జత చేసి గ్లాసులలో పోసి అందించాలి.
 
 కర్టెసీ:


 హరిచందన, హైదరాబాద్
 www.blendwithspices.com
 సేకరణ: డా. వైజయంతి
 

మరిన్ని వార్తలు