జయహో రామాయణమ్‌

2 Apr, 2020 08:11 IST|Sakshi

వాల్మీకి రామాయణం ఇరవై నాలుగువేల శ్లోకాల గ్రంథం. ఆ మహర్షి ఇందులో కనీసం ఒక్క వాక్యాన్ని కానీ, పదాన్ని కానీ వ్యర్థంగా వాడలేదు. ఎవరి మెప్పుకోసమో రాయలేదు. ధర్మానికి, అధర్మానికి గల వ్యత్యాసాన్ని వర్ణించాడు. కుటుంబ విలువల ఔన్నత్యాన్ని, ఆవశ్యకతను గురించి వివరించాడు. ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటే మానవుడైనా, మహనీయుడిగా మన్ననలందుకుంటాడో అనేదానికి ఉదాహరణగా ఆ మర్యాదా పురుషోత్తముడైన రాముని గురించి రమణీయ వర్ణన చేశాడు. అయోధ్యా నగరం గురించి గొప్పగా చెప్పినట్లే, లంకానగర వైభోగం గురించీ అంతే అందంగా చెప్పాడు. కాకపోతే అయోధ్యానగర రాజుల పరిపాలన ఎంత ధర్మబద్ధంగా ఉంటుందో, అక్కడి ఇళ్లు, వాకిళ్లు ఎంత పరిశుభ్రంగా ఉంటాయో, ప్రజలు అతి కాముకత్వం, అధర్మం, లోభం, అవిద్య వంటి వాటికి దూరంగా ఎంత సుఖ సంతోషాలతో జీవిస్తారో చెబితే, లంకానగరంలో వీధులు ఎంత సువిశాలమైనవో, సౌధాలు ఏవిధంగా సువర్ణశోభితాలుగా ఉన్నాయో వివరించాడు. అయోధ్యానగర వాసుల ధర్మబద్ధ జీవన విధానం గురించి, లంకానగర వాసుల విచ్చలవిడితనాన్ని గురించీ వర్ణించాడు. ఇక్కడే మనకు వాల్మీకి మహర్షి రచనా చాతుర్యం కనిపిస్తుంది.

తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టడం కోసం రాముడు ఎంత కష్ట పడ్డాడో, ఆ రాముడి మార్గంలో నడవడానికి సీతాలక్ష్మణులు ఎంత ఇష్టపడ్డారో, పుత్ర వియోగాన్ని తాళలేక దశరథుడు ఎలా కుప్పకూలిపోయి మరణించాడో, నాటి ఆచారం ప్రకారం తమ పతిదేవుడితో పాటు సహగమనానికి సిద్ధపడిన కౌసల్యాదేవిని పద్నాలుగేళ్ల అరణ్యవాసానంతరం నీ కుమారుడు రాముడిని రాజుగా చూసుకోవడానికైనా ప్రాణాలతో నిలిచి ఉండాలంటూ మునులు, దేవతలు మంచి మాటలు చెప్పి, ఆమెలో ఆశలు నూరిపోసి ఆమె ప్రయత్నాన్ని నివారించడంలోనే వాల్మీకి అభ్యుదయ భావనలను అర్థం చేసుకోవచ్చు.

అడవులకు వెళ్లేటప్పుడు కూడా ఆయుధాలను విడనాడని రామునితో ఆ విషయాన్ని నేరుగా కాకుండా ఆయుధాలను కలిగి ఉండటం వల్ల సాధుజీవులలో సైతం హింసాత్మక భావనలు కలగడాన్ని గురించి కథ రూపంలో సీతమ్మ చెప్పడం, ఆమె మాటలను మెచ్చుకుంటూనే తాను ఆయుధాలను ఎందుకు కలిగి ఉండాలో రాముడు  వివరించడం భార్యాభర్తల మధ్య ఉండవలసిన అవగాహనను తెలియజేస్తుంది. అతిబలవంతుడైన అన్న వాలికి జడిసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్న సుగ్రీవుడికి ఆయన సచివుడు, సలహాదారు అయిన హనుమ– కాసేపటిలో చక్రవర్తి కావలసి ఉండీ, పితృవాక్పాలన కోసం రాజ్యాన్ని తృణప్రాయంగా త్యజించి, అడవులలో తిరుగుతూ ఉండగా... ప్రాణానికి ప్రాణమైన భార్యను ఎవరు అపహరించారో తెలియక తల్లడిల్లిపోతున్న రామునికీ మైత్రి కుదిర్చి రాముడి కోసం సముద్ర లంఘనం చేసి మరీ సీతాన్వేషణ చేసి, ఆమె క్షేమసమాచారాలను రామునికి చేరవేసిన హనుమ నిస్వార్థం, త్యాగశీలత, సముద్రానికి ఓర్పుతో, నేర్పుతో సమయస్ఫూర్తితో వారధి కట్టి లంకను చేరి,  అపారమైన సైన్యసంపదతో, శౌర్యపరాక్రమాలు కలిగిన పుత్ర భ్రాతృ బలగంతో వరబలం గల రాక్షస రావణుడి పదితలలనూ అతి సామాన్యుడైన మానవుడు తెగటార్చాడంటే అందుకు రాముని ధర్మానువర్తనమే కారణం.
రామాయణ పఠనమంటే మనలోని దుర్లక్షణాలను దునుమాడటం, మంచి లక్షణాలను, త్యాగబుద్ధిని, సహన శీలతనూ, ధార్మిక, యుక్తాయుక్త వివేచననూ పెంపొందించుకోవడమే.

ప్రస్తుతం అందరకూ సెలవులు కాబట్టి అందుబాటులో ఉన్న వివిధ మాధ్యమాల ద్వారా ఉషశ్రీ, శ్రీరమణ, ఉప్పలూరి కామేశ్వరరావు వంటి వారు సరళంగా రచించిన రామాయణమనే చెరకుగడను నమిలి అందులోని మాధుర్యాన్ని మనం అనుభవించి, మన వారసులకు ఆ తీపిని చవిచూపించేందుకు ప్రయత్నిద్దాం.

ప్రతి సంవత్సరం భద్రాద్రిలోనూ, దేశమంతటా అంగరంగవైభవంగా శ్రీరామ నవమి సంబరాలు, సీతారామ కల్యాణ ఉత్సవాలు జరిపించడం ఆనవాయితీ. లక్షలాది మంది స్వయంగా వీక్షించి తరించేవారు. దురదృష్టవశాత్తూ ఈ సంవత్సరం అటువంటి అవకాశం లేనప్పటికీ, అర్చకులు కల్యాణ క్రతువును నిర్వహించడంలో లోటేమీ ఉండదు కాకపోతే మన మనో నేత్రాలతో బుల్లితెరల ముందు కూర్చుని ఆ వేడుకలను స్వయంగా తిలకించడంతో సరిపెట్టుకుందాం.

ఈ క్లిష్ట పరిస్థితులలో పండుగ ఎలా జరుపుకోవాలి?
పొద్దున్నే నిద్రలేచి తలస్నానం చేసి, ఇంట్లో సీతారాముల వారిని భక్తి, శ్రద్ధలతో పూజించచడం, వడపప్పు, పానకం, పాయసంలాంటి పదార్ధాలను నివేదించిశ్రీరామ నామం స్మరిస్తూ ఉండడం, శక్తి కొలది దాన ధర్మాలు చేయడం.  –  డి.వి.ఆర్‌. భాస్కర్‌

మరిన్ని వార్తలు