మహాత్ముడిని మలిచిందెవరు?

2 Oct, 2019 05:27 IST|Sakshi

గాంధీజీని తమ వ్యక్తిత్వం చేత, ఆలోచనల చేత ప్రభావితం చేసిన వ్యక్తులు కొందరున్నారు. అందులో రాయచంద్‌ ఒకరు. మహాత్ముడి ఆత్మకథలో రాయచంద్‌ పేరుతో ఒక ప్రకరణం ఉంటుంది. ఇంగ్లండులో బారిస్టర్‌ చదువు పూర్తి చేసుకుని భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు కలిశారతన్ని. అప్పటికి రాయచంద్‌కి పాతికేళ్లు. గాంధీ కంటే సుమారు రెండేళ్లు పెద్ద. కవి. శతావధాని కూడానట. అతని ధారణ, అవధాన ప్రజ్ఞలు విశేషమైనవి. కానీ గాంధీని ఎక్కువగా ఆకట్టుకున్నవి మాత్రం అతని విశాల శాస్త్ర జ్ఞానం, నిర్మల ప్రవర్తన, ఆత్మజ్ఞానంపై అతనికున్న తీవ్రమైన తపన. రాయచంద్‌ రత్నాల వ్యాపారి. దుకాణంలో వ్యాపారం సాగుతూ ఉండగా అతను ధ్యాననిమగ్నుడై ఉండడం అనేకసార్లు చూశానని రాశారు గాంధీ. మన లౌకిక కార్యకలాపాలకు ఆధ్యాత్మిక సాధనకు మధ్య ఘర్షణ ఉండాల్సిన పని లేదనీ రెండింటినీ ఏక కాలంలో నడిపించుకోవచ్చుననీ, పైపెచ్చు ఆధ్యాత్మిక సాధనవల్ల లౌకిక కార్యక్రమాల నిర్వహణ సులువౌతుందని రాయచంద్‌ వల్ల గాంధీకి తట్టి ఉండొచ్చు.

అందరినీ సమదృష్టితో చూసే అతని వైఖరి కూడా గాంధీకి ఒక ప్రేరణగా పనిచేసి ఉండొచ్చు. భగవంతుణ్ణి గురించి తెలిసీ తెలియక కొట్టుమిట్టాడుతున్నప్పుడు తనకు రాయచంద్‌ అండగా కనిపించే వాడన్నారు గాంధీ. ప్రత్యక్ష సాంగత్యంవల్ల మనస్సులో నాటుకుపోయిన వ్యక్తి అతను. గాంధీని ప్రభావితం చేసిన మరొక వ్యక్తి గోపాలకృష్ణ గోఖలే. స్ఫటికమంత స్వచ్ఛత, గొర్రెపిల్లంత సాత్వికత, సింహమంత ధైర్యం కల వ్యక్తి అన్నారు ఆయన గురించి చెబుతూ. దక్షిణాఫ్రికా నుంచి గాంధీని భారత రాజకీయ రంగంలోకి రప్పించింది గోఖలేనే. రాజకీయరంగంలో ‘అత్యంత పరిపూర్ణుడై’న మనిషిగా ఆయనను గుర్తించి తన రాజకీయ గురువుగా స్వీకరించారు గాంధీ. గాంధీజీపై ఎనలేని ప్రభావాన్ని చూపించిన పుస్తకం భగవద్గీత. చిత్రంగా దాన్ని ఆయన మొదట చదివింది ఇంగ్లండులో. ఇంగ్లి్లషులో. లా కోర్సు రెండవ సంవత్సరంలో ఉండగా ఎడ్విన్‌ ఆర్నాల్డ్‌ గీతకు రాసిన ఆంగ్లాను వాదం ‘ది సాంగ్‌ సెలెస్టియల్‌’ని చదివారు. తర్వాత దాన్ని జీవితాంతం విడిచిపెట్టలేదు.

చదవడమే కాదు సంçస్కృతం నుంచి గుజరాతీ భాషలోకి అనువదించి తన వ్యాఖ్యలు జోడించుకుంటూ వెళ్లారు. యంగ్‌ ఇండియా పత్రికలో 1925లో ఒకసారి భగవద్గీతకు తనకు ఉన్న సంబంధాన్ని ఇలా చెప్పారు. ‘సందేహాలు నన్ను వెంటాడినప్పుడు, నిరాశ అలముకుని ఎక్కడా ఆశా కిరణం అన్నది కానరానప్పుడు నేను గీతను ఆశ్రయిస్తాను. ఒక శ్లోకం ఏదో కనిపిస్తుంది. నన్ను స్వస్థ పరుస్తుంది. ముంచెత్తే దుఃఖం మధ్య నాకు చిరునవ్వు మొలుస్తుంది. నా జీవితం నిండా ఎన్ని విషాద ఘట్టాలున్నాయో! అవి నన్ను ఏమీ చెయ్యలేకపోయాయంటే భగవద్గీత బోధ కారణం దానికి’ అన్నారు.  గాంధీ కర్మయోగి. సంఘ సంస్కరణ నుంచి, రాజకీయ పోరాటం నుంచి, జాతీయ ఉజ్జీవన ఉద్యమం నుంచి ఎన్నడూ వైదొలగలేదు. ఏ బయటిప్రభావాలూ తనని అంటనివ్వ లేదు. ఏ ప్రలోభానికీ తగ్గలేదు. ‘కాంక్షా రాహిత్యం’అని తన భాషలో చెప్పిన గీతాసారానికి కట్టుబడి ఉన్నారు. ప్రేమతో కూడిన పోరాటాన్ని, ద్వేషంలేని యుద్ధాన్ని కొనసాగించారు.

తమ రచనల ద్వారా గాంధీజీని ప్రభావితం చేసిన వ్యక్తులు కొందరున్నారు. వాళ్లలో ముఖ్యులు ముగ్గురు.హెన్రీ డేవిడ్‌ థోరో, టాల్‌స్టాయ్, రస్కిన్‌. థోరో (1817–1862) అమెరికన్‌. కవి, వ్యాసకర్త, ప్రధానంగా తాత్వికుడు. ఆయన రాసిన ‘వాల్డెన్‌’గ్రంథం, ‘రెసిస్టెన్స్‌ టు సివిల్‌ గవర్నమెంట్‌’అనే వ్యాసం గాంధీజీని బాగా ప్రభావితుణ్ణి చేశాయి. థోరో వాదనా పటిమ పదునైనది, అది మనల్ని నిరుత్తరుల్ని చేస్తుంది అంటారు గాంధీ. థోరో నైతికతకి ఆయన ముగ్ధులైపోయారు. 1906లో ఆయన ‘వాల్డెన్‌’ చదివారు. దాని నుంచి కొన్ని సూత్రాలను గ్రహించి, అమలు పరిచాను అని చెప్పారు. తన సహచరులచేత ఆ పుస్తకాన్ని చదివించారు కూడా. పన్నుల నిరాకరణను, సహాయ నిరాకరణను, ప్రకృతి ఒడిలో నిరాడంబర జీవితాన్ని, పర్యావరణ స్పృహని, ప్రత్యక్ష కార్యాచరణని, అంతరాత్మ ప్రబోధానుసరణ ఆవశ్యకతని బోధించాడు థోరో. వీటినన్నింటినీ మనం గాంధీ జీవితంలో చూస్తాం. గాంధీని బలంగా ప్రభావితం చేసిన మరో వ్యక్తి టాల్‌స్టాయ్‌ (1828–1910). ప్రపంచ ప్రఖ్యాత రచయిత.

సంపన్న గృహస్థుడు. 57వ ఏట సంపదను వదులుకుని నిరాడంబర జీవితం గడిపాడు. గాంధీ జైలు నిర్బంధానికి గురైన సందర్భంగా వాటిని తీరిగ్గా చదవడం తటస్థించింది. ‘ది కింగ్‌డవ్‌ు ఆఫ్‌ గాడ్‌ ఈజ్‌ వితిన్‌ యు’ అనే పుస్తకం, ‘క్రిస్టియానిటీ పేట్రియాటిజం’అనే వ్యాసం గాంధీని బాగా ఆలోచింపజేశాయి. ఎంతగా ప్రభావితుడయ్యారంటే టాల్‌స్టాయ్‌ ఆశ్రమం అనే పేరుతో దక్షిణాఫ్రికాలో ఉండగా ఒక ఆశ్రమాన్ని నెలకొల్పారు. ఇద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి కూడా. నేను మీ అనుచరుణ్ణి అని వినయ పూర్వకంగా రాశారు ఒక ఉత్తరంలో టాల్‌స్టాయ్‌కి. శారీరక శ్రమ, కనీస వసతులతో జీవించడం, ఆస్తిని కూడబెట్టకపోవడం, జీవహింసా వైముఖ్యం ఇవి టాల్‌స్టాయ్‌ ఆదర్శాలు. ఇవన్నీ గాంధీ ఆశ్రమంలో ఆచరణలు. జాన్‌ రస్కిన్‌ (1819–1900) రచన ‘అన్‌ టు ది లాస్ట్‌’.. పారిశ్రామికీకరణ నేపథ్యంలో శ్రామిక వర్గ దుస్థితిపై చేసిన రచన. గాంధీ దక్షిణాఫ్రికాలో ఉండగా పొలాక్‌ అనే స్నేహితుడు రైలు స్టేషనులో ఆయనకు ఈ పుస్తకాన్ని ఇచ్చాడు.

రైలులోనే దాన్ని చదివేశారు గాంధీ. ఒక్కసారిగా నా జీవితాన్ని మార్చివేసిన పుస్తకం అన్నారు. రక్తంతో కన్నీళ్లతో రాయబడ్డ పుస్తకం ఇది అన్నారు. గుజరాతీ భాషలోకి సర్వోదయ పేరుతో అనువదించారు. గాంధీ సర్వోదయ సిద్ధాంతానికి తల్లివేరు రస్కిన్‌ రచనే. ఇటువంటి వ్యాసాలు చదువుతున్నప్పుడు గాంధీ తత్వం సర్వం ఇతరుల నుంచి గ్రహించబడినదే అనీ, ఆయన స్వయంగా రూపొందించినది ఏమీ లేదనీ అనిపించే అవకాశం ఉంది. కానీ అది నిజం కాదు. దేన్నయినా ఎవరు చెప్పినా సొంత వడపోతకు గురిచేసి కానీ మహాత్మాగాంధీ స్వీకరించరనేది ఆయన జీవితం నిరూపించే సత్యం. కొన్ని రచనలు, కొందరు వ్యక్తులు మనకు కొత్త ఆలోచనా బీజాలను అందిస్తారు. కొందరు అప్పటికే బీజ ప్రాయంగా ఉన్న మన ఆలోచనలకు స్పష్టతను, బలాన్ని సమకూరుస్తారు. మరిచిపోకూడని విషయం ఏమిటంటే మనం కాని దానిని మనకు ఎవరూ చేర్చలేరు.
– డా.రెంటాల శ్రీవెంకటేశ్వర రావు

డిఫరెంట్‌ క్లిక్స్‌
ఇందిరా.. గాంధీ : గాంధీజీతో ఎవరనుకున్నారు.. దేశ ఉక్కు మహిళ ఇందిర..

►ఎండ దెబ్బకు తలగడ వైద్యం..  1940లో ఓ ఎండాకాలం రోజున వేడిని తాళలేక తలగడ నెత్తిన పెట్టుకుని వెళ్తున్న బాపూ

►స్వచ్ఛ భారత్‌.. పితామహుడు.. శుభ్రత పరిశుభ్రత విషయంలో గాంధీజీ ముందుంటారు. దానికి నిదర్శనమే ఈ చిత్రం

బ్రిటీషర్లపై హెవీ వెయిట్‌
గాంధీజీ మామూలుగా అయితే లైట్‌ వెయిట్‌.. మరి బ్రిటిషర్లకు హెవీ వెయిటేగా.. బిర్లా హౌస్‌లో బరువు చూసుకుంటున్నప్పుడు తీసినదీ చిత్రం
 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు