బల బాంధవి

16 Nov, 2018 00:25 IST|Sakshi

అవగాహన

నిజామాబాద్‌కి చెందిన తోకల శ్రీదేవి. ఇంటర్మీడియెట్‌ వరకు చదువు కున్నారు. పాత కాలం నాటి పద్ధతులలో.. నాటి వంటకాల తయారీలో ప్రత్యేకతను నిలుపుకున్నారు. తక్కువ ధరకే బలవర్ధకమైన ఆహారాన్ని ఎలా తయారుచేసుకోవచ్చో పేద, మధ్యతరగతి కుటుంబాలకు తెలియజేస్తూ ‘బల బాంధవి’ అని పేరుతెచ్చుకున్నారు. ఇండియన్‌ డైటిక్‌ అసోసియేషన్‌ కార్యక్రమాల్లో ఆమె తయారు చేసిన పదార్థాలను పంపిణీ చేయడం విశేషం.

పౌష్టికాహారం డబ్బున్న వారికి అందుబాటులో ఉంటుంది. అవగాహనా ఉంటుంది. మరి రెక్కాడితేగానీ డొక్కాడని వ్యవసాయ కూలీలు., బీడీ కార్మికులు, పేద, మధ్య తరగతి వారి మాటేమిటి.? బీడీలు చుట్టే మహిళలు రోజుకు 12 గంటల పాటు కూర్చునే పని చేయాల్సి ఉంటుంది. ఆకులోని దుమ్ము, ధూళి., ఆరోగ్యానికి హానికరమైన పొగాకుతో గంటల తరబడి పనిచేస్తుంటారు. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుని వ్యవసాయ కూలీ పనిచేస్తే దక్కే కూలీ డబ్బులతో ఖరీదైన పౌష్టికాహారం ఎలా తినగలరు? ఇలాంటి సవాళ్లకు పరిష్కారం చూపుతున్నారు తోకల శ్రీదేవి. అతి తక్కువ ఖర్చుతో పాత తరహా వంటకాల్లో ఉండే పోషక విలువలు, వాటి తయారీ విధానంపై గ్రామీణ ప్రాంత మహిళల్లో అవగాహన పెంచేందుకు తన వంతు కృషి చేస్తున్నారు. 

ప్రాచీన వంటకాల ఆవశ్యకత
గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు, బిజీ జీవితాలు గడిపే పట్టణ, నగర వాసులు కూడా సరైన పౌష్టికాహారం తీసుకోవడం లేదు. రెడీ టు ఈట్‌.. ఫాస్ట్‌ ఫుడ్‌.. పేర్లు వేరైనా ఆరోగ్యానికి హాని చేసే ఆహారంతో బీపీ, షుగర్, మధుమేహం.. వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. వీరికి పౌష్టికాహారం విలువ గుర్తు చేస్తూ పాత తరహా వంటకాల ఆవశ్యకతను వివరిస్తున్నారు. ‘మంచి ఆహారంతోనే మంచి ఆరోగ్యం..’ అని ఆమె అంటున్నారు.

అందుబాటులో ఉండే పదార్థాలతో...
పేద మధ్య తరహా కుటుంబాలకు అందుబాటలో ఉండే దొడ్డుబియ్యం., కంది, పెసర, మినప వంటి పప్పుధాన్యాలు, రవ్వ, జీలకర్ర, ధనియాలు, రాగులు, జొన్నలు, బెల్లం, పల్లీలు వంటి చిరు ధాన్యాలు, తృణ ధాన్యాలతో ఎంతో బలవర్థకమైన ఆహారం ఎలా తయారు చేసుకోవచ్చనే అంశంపై అవగాహన కల్పిస్తున్నారు. వీటిని ఉపయోగించి చిన్న పిల్లలు, గర్భిణులు, బాలింతలు , మహిళలు, క్రీడాకారులు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, స్థూలకాయులు, ఉద్యోగులు, కౌమారదశలో ఉన్న బాలికలకు ఉపయోగపడే వంటకాల తయారీని వివరిస్తున్నారు. బీడీ కార్ఖానాలు, గ్రామాల్లో స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు, నగరంలో ఉండే గృహిణులకు వీటి ప్రాముఖ్యతను వివరిస్తున్నారు. నిజామాబాద్‌ నగరంతో పాటు, గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి అందుబాటులో ఉండే పౌష్టికాహారం ఆవశ్యకతను తెలియజేస్తున్నారు. కాలేజీలకు వెళ్లి విద్యార్థులకు వివరిస్తున్నారు. కొన్ని చోట్ల ఈ వంటలను తయారు చేసి చూపిస్తున్నారు.

రాష్ట్ర స్థాయిలో గుర్తింపు
పౌష్టికాహారం ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తున్న శ్రీదేవికి జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) నుంచి సక్సెస్‌ఫుల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌గా గుర్తింపు దక్కింది. ఇండియన్‌ డైటిక్‌ అసోసియేషన్,  నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రీషియన్‌ కాన్ఫరెన్స్‌లో  పాల్గొని ప్రసంగించారు. నాబార్డు, ఎఫ్‌సీఐ, ఎన్‌.ఐ.ఆర్‌.డి, ఐకేపీ, ఫెడరేషన్‌ ఆఫ్‌ ఏపీ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్, ఇండియన్‌ నీడికల్‌ అసోసియేషన్‌ వంటి సంస్థలు నిర్వహించిన కార్యక్రమాలలో, సెమినార్లలో శ్రీదేవి పాల్గొనడంతో పాటు తను ఏ విధంగా నాటి వంటకాలను బలవర్ధకంగా తయారుచేస్తుందో చేసి చూపించారు. పదేళ్లుగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్న శ్రీదేవికి రాష్ట్ర ప్రభుత్వ మహిళ, శిశు సంక్షేమశాఖ నుంచి, ఫ్యాప్సీ సంస్థల నుంచి ఉత్తమ ప్రతిభా పురస్కారాలు వచ్చాయి. స్థానిక స్వచ్ఛంద సంçస్థలు నవోజ్యమీ సక్సెస్‌ఫుల్‌ మెంటర్‌ అవార్డు అందిం చాయి. జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు కూడా  శ్రీదేవి సేవలను గుర్తించి జిల్లా స్థాయిలో సర్టిఫికేట్లు అందజేశారు.

అనారోగ్యం పాలు కావద్దనే..
పేద, మధ్య తరగతి వారికి పౌష్టికాహారంపై అవగాహన ఉండదు. తినే ఆహారంలో పోషకాల గురించి వారికి తెలియదు. అలాంటి వారికి అందుబాటులో ఉండే తృణ, చిరు ధాన్యాలతో తయారు చేసుకోగల వంటకాలను వివరిస్తున్నాను. ఈ అవగాహన వల్ల తక్కువ ఖర్చుతోనే పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోగలుగుతారు. దీంతో వారు వయస్సు పెరిగే కొద్దీ అనారోగ్యం పాలు కాకుండా ఉంటారు. సరైన ఆహారం లేక నిరుపేదలు అనేక అనారోగ్యాల పాలవుతున్నారు. వైద్యం కోసం చేసే ఖర్చు తగ్గుతుంది. సరైన పౌష్టికాహారం తీసుకుంటే ఏ దశలోనూ అనారోగ్యం సమస్య దరి చేరదు.
– టి.శ్రీదేవి
– పాత బాలప్రసాద్, సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ 

మరిన్ని వార్తలు