అదిగో... దక్షిణ కైలాసం

31 Jan, 2017 23:44 IST|Sakshi
అదిగో... దక్షిణ కైలాసం

పుణ్యతీర్థం :: శ్రీకాళహస్తి

దాదాపు 17 ఏళ్ల తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి 2వతేదీ నుంచి 8వ తేదీ వరకు వైభవంగా శ్రీకాళహస్తీశ్వరాలయ మహా కుంభాభిషేకం నిర్వహించేందుకు ఆలయాధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. దక్షణ æకైలాసంగా పేరొంది కోట్లాదిమంది భక్తులను పునీతులను చేసే దివ్యక్షేత్రం శ్రీకాళహస్తి. ఇక్కడి అమ్మవారు జ్ఞానప్రసూనాంబ. క్రీ.శ.12వ శతాబ్దంలో చోళుల కాలంలో రాజేంద్రచోళుడిచే పవిత్ర స్వర్ణముఖీ నదీతీరాన నిర్మించబడిన ఈ ఆలయం విజయనగర పాలకుల కాలంలో ప్రాచుర్యం పొంది ప్రఖ్యాత శైవక్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడ స్వయంభువుగా వెలసిన శ్రీకాళహస్తీశ్వరుడు వాయులింగేశ్వరునిగా పూజలందుకుంటున్నాడు. ఈ వాయులింగేశ్వరునికి ప్రతి పుష్కరానికి ఒకసారి మహాకుంభాభిషేక మహోత్సవం నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచారం.

శ్రీ–కాళ–హస్తి పేరొచ్చిందిలా...
శ్రీకాళహస్తీశ్వరుణ్ణి నిష్టతో పూజించిన మూడు మూగజీవాల సమ్మేళనంతో శ్రీ–కాళ–హస్తి పేరు వచ్చిందని ప్రచారంలో ఉన్న కథలను బట్టి తెలుస్తోంది.

శ్రీ(సాలీడు): పూర్వం ఊర్థ్వనాధుడనే దివ్యలోక శిల్పి ఏదో తప్పిదం చేయగా అతనిని భూలోకంలో సాలీడుగా జన్మించమని బ్రహ్మ శాపమిచ్చాడు. దాంతో ఊర్థ్వనాధుడు సాలీడుగా జన్మించి దక్షిణకైలాసం అంటే ప్రస్తుత కాళహస్తి ప్రాంతంలోని మారేడువనంలో గూడు కట్టుకుని జీవిస్తూ అక్కడ వెలసిన శివలింగాన్ని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తూ శివలింగం చుట్టూ శరీర దారాలతో ప్రాకారాలను నిర్మించేవాడు.అతడి భక్తిని పరీక్షించదలచిన పరమశివుడు ఒకరోజు ఆ దారాల ప్రాకారాలని అఖండదీపంతో దహింపజేశాడు. దానిని చూసి చలించిపోయిన సాలీడు శివుని పై భక్తితో ఆ దీపాన్నే మింగబోతూ తనను తాను ఆత్మార్పణ చేసుకోబోయింది. దీంతో ముగ్ధుడైన పరమేశ్వరుడు సాలీడుని కటాక్షించాడు. ఏం వరం కావాలో కోరుకోమనగా దక్షిణకైలాస పురానికి ముందు ‘శ్రీ’ అనే అక్షరం ఉండేలా వరం పొంది సాలీడు రూపంలో ఉన్న ఊర్థ్వనాథుడు శివైక్యం చెందాడు.

కాళ (సర్పము): ఈ కాళం(సర్పం) పూర్వజన్మలో బ్రాహ్మణుడు. ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి వేదవిద్యలను అభ్యసించి హిమాలయ పర్వతగుహల్లో నివసిస్తుండేవాడు. అయితే రత్నాలచే శివుని పూజించిన వారు సర్వపాపాల నుంచి విముక్తి పొందుతారని ఒక గంధర్వుడు చెప్పడంతో తక్షణమే శరీరం వదలి నాగుపాముగా జన్మించి దక్షిణ కైలాసానికి చేరి అక్కడున్న వాయులింగాన్ని ప్రాతఃకాలంలో మణులతో పూజించడం ప్రారంభించాడు.

హస్తి(ఏనుగు): హస్తి(ఏనుగు) కూడా పూర్వజన్మలో మలయపర్వత ప్రాంతంలో శోత్రీయ కుటుంబంలో జన్మించినవాడు. వేదాలను అభ్యసించే సమయాన వ్యాధిపీడితుడు కావడంతో శివరాత్రి పర్వదినాన ఉపవాస దీక్షను ఆచరించి జాగరణ చేసిన భక్తుడు. ఇతడు కొంతకాలానికి మరణించి ఏనుగుగా జన్మించి దక్షిణ కైలాసానికి చేరి శివలింగానికి తొండంతో తెచ్చిన నీటితో అభిషేకించి కమల పుష్పాలతో పూజించడం మొదలుపెట్టాడు. సర్పం శివలింగంపై అభిషేకించిన మణులను మధ్యాహ్న సమయంలో ఏనుగు తొలగించి నీటితో అభిషేకించి కమలార్చన చేసేది. మరునాడు ప్రాతఃకాలంలో పూజకు వచ్చిన సర్పం పువ్వులను తొలగించి మణులతో అభిషేకించేది. అయితే ఎవరో పూజాభంగం చేస్తున్నారని భావించిన సర్పం ఓ దినాన శివలింగానికి వెనుక భాగాన దాక్కుని గమనిస్తుండగా ఏనుగు వచ్చి మణులను తొలగించడం గమనించింది. వెంటనే కోపంతో అది ఏనుగు తొండంలోకి ప్రవేశించింది. బాధ భరించలేక హస్తి తన తొండాన్ని మోదుకుంది. దాంతో రెండూ శివైక్యం చెందింది. వీరి భక్తికి మెచ్చిన శివుడు వారిరువురిని వరం కోరుకోమనగా వాయులింగంతో పాటు తాము ప్రసిద్ధి చెందాలని కోరుకున్నాయి. అప్పటి నుంచి సాలీడు పేరున శ్రీ, సర్పం పేరున కాళ, ఏనుగు పేరున హస్తి కలిసి ‘శ్రీ–కాళ–హస్తి’ పేరిట శైవక్షేత్రం వెలసింది.

తొలిపూజను అందుకునే భక్త కన్నప్ప వృత్తాంతమిదీ...
పూర్వం కణ్ణడు అనే కోయవాడు దివ్య కైలాస శిఖరారణ్యంలో తిరుగుతూ వాయులింగాన్ని ప్రతిరోజూ బిల్వదళాలతో పూజించి జంతువులను వేటాడి తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా సమర్పించేవాడు. ఒకరోజు అతడి భక్తికి పరీక్ష పెట్టిన పరమశివుడు కణ్ణడు పుక్కిట జలంతో అభిషేకిస్తున్న సమయంలో శివలింగం కంటి నుంచి నీరు కారేవిధంగా చేశాడు. శివుని కంట నీరు కారడం గమనించిన కణ్ణడు తన తప్పిదం వల్లే ఇలా జరిగిందని భావించి తన కన్నును అమ్ములపొదిలోని బాణంలో తీసి శివుని కన్నుగా అమర్చాడు. దీంతో నీరు కారడం ఆగిపోయి మరో కంటినుంచి కారడం ఆరంభం కావడంతో మరో కన్నును కూడా బాణంతో తీయబోతుండగా కణ్ణడి పరమ భక్తికి పరవశించిపోయిన శివుడు ప్రత్యక్షమై, కన్నప్పకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అంతేకాదు, భక్త కన్నప్పను దర్శించినా, చరిత్ర వినినా, పఠించినా సర్వపాపాలు తొలగి అంత్యకాలంలో కైలాసప్రాప్తి పొందుతారని పలికి పరమశివుడు అంతర్థానమవుతాడు. ఆనాటి నుంచి పరమశివుని తొలిభక్తుడైన భక్తకన్నప్పకు స్వామివారి కన్నా ముందే తొలిపూజ చేయడం ఆచారంగా వస్తోంది. ప్రతియేటా స్వామివారి బ్రహ్మోత్సవాల సమయంలోనూ భక్తకన్నప్ప కొండపై తొలుత ధ్వజారోహణం చేసిన తర్వాత మరుసటి రోజు స్వామివారి ధ్వజారోహణం చేసి బ్రహ్మోత్సవాలను ప్రారంభిస్తారు.

కుంభాభిషేకం విశిష్టత ఇదీ
ప్రతి పుష్కర కాలానికి (12సంవత్సరాలు) ఒకసారి శ్రీకాళహస్తి క్షేత్రంలో కుంభాభిషేకం చేయడం ద్వారా ఆలయ కట్టడాలకు బలం చేకూరడంతోపాటు దేవతామూర్తుల శక్తి పునరుత్తేజింపబడుతుందని విశ్వాసం. ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయాల్లో కాలానుగుణంగా చిన్నపాటి శిథిలాలు ఏర్పడినా, దేవతామూర్తుల ఆకారాల్లో పగుళ్లు ఏర్పడినా వాటి స్థానంలో బాలాలయాలను ఏర్పాటు చేసి జీర్ణోద్ధరణ పనులను పూర్తి చేసి కుంభాభిషేకాన్ని శాస్త్రోక్తంగా చేస్తారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో 1901లో రామానందం చెట్టియార్‌ వంశీకులు ఆలయ జీర్ణోద్ధరణ పనులు చేపట్టి 1912లో ఆలయ మహాకుంభాభిషేకాన్ని నిర్వహించినట్లు ఆలయ రికార్డులు తెలుపుతున్నాయి. అప్పటినుంచి ప్రతి 12 ఏళ్లకు ఒకసారి మహాకుంభాభిషేకం నిర్వహించాల్సి ఉన్నా, ఆ పని సజావుగా జరగలేదు. 1912 తర్వాత 1969లో ఒకసారి, 1974లో మరోసారి, 2000వ సంవత్సరంలో ఇంకోసారీ కుంభాభిషేకం నిర్వహించారు. దాదాపు 17 ఏళ్ల తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి 1వతేదీ నుంచి 8వ తేదీ వరకు వైభవంగా శ్రీకాళహస్తీశ్వరాలయ మహా కుంభాభిషేకం నిర్వహించేందుకు ఆలయాధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఆలయ రాజగోపురం విశిష్టత
శ్రీకాళహస్తి దేవస్థానానికి ఈశాన్యదిక్కున స్వర్ణముఖీ నది తీరాన క్రీ.శ. 1516లో శ్రీకృష్ణదేవరాయలు  దక్షిణభారతదేశ దండయాత్రలో విజయానికి చిహ్నంగా వేలాది మంది కూలీల సాయంతో మూడేళ్ల కఠోర శ్రమతో రాజగోపురాన్ని నిర్మించాడు. అప్పటి కళాఖండాలను మేళవించి హిందూ సంస్కృతి, సాంప్రదాయం, ప్రజల జీవనశైలి ప్రతిబింబించేలా గోపుర నిర్మాణం చేశాడు. ఇటుకలు లేకుండా సున్నం, బెల్లం, కరక్కాయ, కోడిగుడ్ల సొనతో అద్భుత రీతిలో రాజగోపురాన్ని నిర్మింపచేశాడు. ఏడు అంతస్తులుగా 136 అడుగుల ఎత్తుతో ఈ  గాలిగోపురం శ్రీకాళహస్తికి మకుటంగా దర్శనమిస్తూ వచ్చింది. కాలక్రమేణా ఈ గోపురం ఎండకు ఎండుతూ, వానాలకు తడుస్తూ పగుళ్ల ధాటికి తట్టుకోలేక 2010 మేనెల 26వ తేదిన కూలిపోయింది. అయితే నవయుగ సంస్థకు చెందిన చింతా విశ్వేశ్వరరావు ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి దీని నిర్మాణం చేపట్టి 144 అడుగుల ఎల్తైన గోపురాన్ని పూర్తి చేయడంతో మళ్లీ దివ్యతేజస్సుతో దర్శనమిస్తోంది. నిర్మాణకర్తలు జనవరి 19వ తేదీ నుంచి 29వ తేదీ వరకు 11 రోజులపాటు అత్యంత వైభవోపేతంగా విశ్వకల్యాణ శాంతి మహాయజ్ఞం పూర్తి చేశారు. ఫిబ్రవరి ఒకటిన శ్రీకాళహస్తీశ్వరాలయ మహాకుంభాభిషేక మహోత్సవాన్ని శోభాయమానంగా జరపడానికి ఆలయానికి చెందిన ఉత్సవ నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

– ఉప్పరపల్లి చెంచురెడ్డి, శ్రీకాళహస్తి
కుంభాభిషేకం  క్రమమిది...

కంచికామకోటి పీఠాధీశులు శ్రీ జయేంద్ర సరస్వతీ, శ్రీవిజయేంద్ర సరస్వతీ వారి నేతృత్వంలో మహాకుంభాభిషేకం నిర్వహించనున్నారు. వారితోపాటు వారి శిష్యబృందం ఎనిమిది రోజుల పాటు శ్రీకాళహస్తి దేవస్థానం ప్రాంగణంలోని బ్రహ్మగుడి ప్రాంతంలోనే నివాసం ఉంటారు. మహాకుంభాభిషేకానికి లక్షమందికి పైగా భక్తులు వస్తారని ఆలయాధికారుల అంచనా. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు, అర్చనలు తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు.భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. భక్తులకు ఆలయ అన్నదాన మండపంలో భోజన వసతులు కల్పించనున్నారు.

నేటి నుంచి ప్రధానంగా జరిగే కార్యక్రమాలు
ఫిబ్రవరి 1, బుధవారం గాలిగోపురానికి కుంభాభిషేకం
2న గణపతి హోమం, వాస్తుశాంతి
3న గోపూజ, ధనపూజ, మత్స్యగ్రహణం
4న యాగప్రవేశం కుంభ స్థాపన
5న పరివార దేవతల గోపురాలకు కంచుగడప గోపురానికి స్వర్ణ కలశ స్థాపన
6న యాత్రదానం, యాగపూజ, కుంభోద్వాసన
7న స్వామి, అమ్మవార్లు, నటరాజస్వామి వార్ల విమాన గోపురాలకు స్వర్ణ కలశస్థాపన, 8న స్వామి, అమ్మవార్లు, నటరాజస్వామికి కుంభాభిషేకం

మాటలు తెచ్చే తీర్థం
దేవస్థానంలో స్వామి, అమ్మవార్లతోపాటు అనేక అద్భుత దర్శనీయాలు భక్తులకు ఆధ్యాత్మిక  పర్యాటక ప్రదేశాలుగా వెలుగొందుతున్నాయి. శ్రీకాళహస్తి దేవస్థానంలోని కంచుగడప సమీపంలో పురుషామృగంను వీక్షిస్తే  మోక్షం లభిస్తోందని శాస్త్రం చెబుతుంది. ఇక్కడి సరస్వతి తీర్థాన్ని సేవిస్తే చెవిటి, మూగ వారు వ్యాధి విముక్తులవుతారని భక్తుల్లో విశ్వాసం. ఇక బంగారుబల్లిని తాకితే శరీరంపై బల్లి పడితే వచ్చే దోషాలు హరించకుపోతాయని నమ్మకం. అదేవిధంగా దేవస్థానంలో శనీశ్వరస్వామి, ఆదిశంకరాచార్యులు ప్రతిష్టంచిన స్పటింకలింగం, గురుదక్షిణామూర్తి, పాతాళ వినాయకుడు, భరద్వాజతీర్థం, పొగడచెట్టు వంటి వాటిని దర్శంచుకోవచ్చు. అంతేకాకుండా శ్రీకాళహస్తి పట్టణంలో దేవస్థానానికి అనుబంధంగా ఉన్న ముత్యాలమ్మ ఆలయం, ప్రసన్న వరదరాజస్వామి ఆలయం, కనకదుర్గమ్మ ఆలయాలను కూడా దర్శించుకోవచ్చు.

మరిన్ని వార్తలు