వద్దంటే అక్షింతలు పడ్డాయి

25 Sep, 2013 01:10 IST|Sakshi
వద్దంటే అక్షింతలు పడ్డాయి

 ‘మరికొంత సమయం తీసుకుంటే తీస్కో...మరో సంబంధం మాత్రం చేసేది లేదు’.పెద్దల అల్టిమేటం!
 ‘చదువుకున్నవాడో, సాఫ్ట్‌వేర్ ఇంజినీరో అయితే స్వాతికి బాగుంటుంది కదా! నేనెందుకు?’ అని శ్రీనివాసరెడ్డి సమాధానం. పెద్దవాళ్లు ఊరుకోలేదు.‘ఎవరికి ఎవరు కరెక్టో మాకు తెలుసు’ అన్నారు. పెళ్లయిపోయింది!
 మేనమామ, మేనకోడలు భార్యాభర్తలయ్యారు.పైగా, పెద్దల మాటకు బుద్ధిగా తలవంచినందుకు
 వీళ్లకు లభించిన గిఫ్ట్ ఏమిటో తెలుసా?తమ దాంపత్యబంధానికో చక్కటి ‘ఆకృతి’!‘మనసే జతగా’ సాగుతున్న ఈ నావనుహైలెస్సా హైలెస్సా అంటూ...ఎన్ని అనుబంధాలు నడుపుతున్నాయో చూడండి.
 
 ‘‘జీవితం మన చేతుల్లో ఉందనుకుంటాం... కాని ముందే డిజైన్ చేసి పెట్టి ఉంటుంది. దానికి మన కష్టం జతగా చేరితే జీవితం గొప్పగా మారిపోతుంది’’ అన్నారు శ్రీనివాస్‌రెడ్డి. కమెడియన్‌గా టీవీ, సినీ రంగాలలో పేరుతెచ్చుకున్న శ్రీనివాస్‌రెడ్డి, ఆయన అర్ధాంగి స్వాతిని హైదరాబాద్ కల్యాణ్‌నగర్‌లోని వారి నివాసం లో పలకరించినప్పుడు ఈ విధంగా స్పందించారు.  
 
 బంగారమైన ఆలోచన...
 చిన్నప్పటి నుంచి ఇద్దరం ఒకరికొకరం తెలుసు. మామయ్య, మేనకోడలిగా ఇద్దరికీ పరిచయమే! డిగ్రీ చదివి, అప్పుడప్పుడే సినీరంగంలో ప్రవేశించి, తన దైన ముద్ర వేసుకోవడానికి కష్టపడుతున్న వ్యక్తి శ్రీనివాస్‌రెడ్డి. అతని అక్కకూతురు స్వాతి ఇంటర్మీడియెట్ చదువుతోంది. స్వాతి టెన్త్ పూర్తయినప్పటి నుంచే శ్రీనివాస్‌రెడ్డి చుట్టూ చేరి అమ్మ, అక్క, అన్న, నాన్న.. ఈ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టేవారు. అందుకు శ్రీనివాస్‌రెడ్డితో పాటు స్వాతి నిరాకరించారట. బాగా చదువుకున్నవాడికో, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కో ఇచ్చి చేద్దాం, స్వాతికేం బంగారం లాంటి అమ్మాయి అని శ్రీనివాస్‌రెడ్డి చెబుతూ ఉండేవారట. కాని పెద్దలు ‘నీకన్నా బంగారం ఎవరూ కాదు’ అన్నారట. స్వాతిని మేనమామకు ఇచ్చి చేస్తేనే తన జీవితం బాగుంటుందనుకున్నారు అంతా. కారణం... పుట్టుకతో హృద్రోగ సమస్య ఉన్న అమ్మాయి స్వాతి. భవిష్యత్తులో వాల్వ్స్ రీప్లెస్‌మెంట్ సర్జరీ అవసరం ఉందన్నారు వైద్యులు. ఏ ఇంట్లో ఇచ్చినా వాళ్లు అమ్మాయిని అంత అపురూపంగా చూసుకోకపోవచ్చు.
 
  ఏ మాత్రం కష్టపెట్టినా ఆ గుండె తట్టుకోకపోవచ్చు... ఇదీ పెద్దల ఆలోచన. అందుకే కుటుంబసభ్యులందరూ ఈ ఇద్దరినీ కూర్చోబెట్టారు. మంచీ చెడు చెప్పారు. అర్థం కాకపోతే మరికొంత సమయం తీసుకోమన్నారు. అంతేతప్ప మరో సంబంధం చేసేది లేదని కరాఖండిగా చెప్పారు. నాటి విషయాల గురించి శ్రీనివాస్‌రెడ్డి చెబుతూ - ‘‘అమ్మ, నాన్న, అక్కలు.. అంతా చెప్పింది సబబే అనిపించింది. తననో గాజుబొమ్మలా అత్యంత జాగ్ర త్తగా చూసుకోవాలి. కాని ‘స్వాతికి నచ్చితేనే పెళ్లి’ అని చెప్పాను. ఓ రోజు స్వాతి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ‘మార్చి పది మా పెళ్లి, మర్చిపోకుండా రండి’ అని శుభలేఖలు ప్రింట్ చేయించాం. నా జీవితం ఎలా ఉంటే బాగుంటుందో అమ్మనాన్నలకు తెలుసు. వారు ఒప్పుకున్న ఏ సంబంధమైనా సరే అనుకున్నాను. అలా స్వాతి తొమ్మిదేళ్ల క్రితం (2004)  నా ఇల్లాలైంది’’ అని వివరిస్తుంటే స్వాతి -‘‘అప్పటివరకు ఈ పెళ్లి వద్దని చెప్పినా ఆ తర్వాత ఆలోచించాను ‘నా బాగు గురించి ఇంతమంది చెబుతుంటే నేనెందుకు కాదనుకుంటున్నాను’ అని. ఈ రోజు నా జీవితం తరచి చూసుకుంటే ఇంత ఆనందంగా ఉంటాననే అప్పుడు ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు’’ అంటూ చిరునవ్వుతో తెలిపారామె!  
 పెద్దల ఆశీస్సులే అండ!
 అమ్మమ్మ, తాతయ్యలే అత్తమామలు. మేనమామ భర్త... చీకూచింత లేని కాపురంగా స్వాతి చెబుతుంటే, ‘‘ఇంటికి వస్తే బయట పడిన కష్టమంతా మర్చిపోతాను. వయసు తేడా వల్ల మా అన్యోన్యతలో తేడాలు ఇన్నేళ్లలో ఎప్పుడూ చూసింది లేదు. అందరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటే మేం పెళ్లి చేసుకున్నాక ప్రేమించుకున్నాం’’ అన్నారు శ్రీనివాస్‌రెడ్డి. దాంపత్య బంధం పిల్లలతోనే సంపూర్ణమవుతుంది అంటారు. కాని స్వాతికున్న హృద్రోగ సమస్య కారణంగా పిల్లలు వద్దనుకున్నారట ఈ జంట. ‘‘మా పెళ్లి పుస్తకం లో పిల్లల చాప్టర్ లేదు. ఎవరినైనా పెంచుకుందాం అనుకున్నాం. కాని మా అదృష్టంగా ఆకృతి పుట్టింది. తన పుట్టుక సందర్బంలో మా ఇద్దరి టెన్షన్ అంతా ఇంతా కాదు’’ అని స్వాతి వివరిస్తుంటే -‘‘మేనరికపు సంబంధం వల్ల పుట్టబోయే బిడ్డలకు వచ్చే సమస్యల గురించి అప్పటికే స్టేజీ షోలు ఇచ్చి ఉన్నాను. డెలివరీ సమయంలో ఈమె ఆరోగ్యం గురించి, పుట్టబోయే బిడ్డ గురించి పడిన టెన్షన్ అంతా ఇంతా కాదు. మొత్తానికి కుటుంబసభ్యుల ఆశీస్సులతో ఆకృతి పుట్టింది. పాప అల్లరి, ఆటపాటలతో ఇల్లంతా సందడిగా ఉంటుంది’’ అన్నారు శ్రీనివాస్‌రెడ్డి.
 కుటుంబం అంటే ఇద్దరు మాత్రమే కాదు...
 తమ మధ్య అన్యోనత గురించి స్వాతి చెబుతూ- ‘‘నేను చిన్నదాన్ననీ, బయటి విషయాలపట్ల అవగాహన అంతగా ఉండకపోవచ్చనీ ఎప్పుడూ ఆలోచించరు... మా మధ్య ఎలాంటి దాపరికాలు ఉండవు. ఇన్నేళ్లలో నా ఆరోగ్యరీత్యా టూర్స్‌కి వెళ్లిందే లేదు. ఇప్పటివరకు మా పిక్నిక్‌స్పాట్, టూర్ అంటే ఎల్.బి.నగర్‌లో ఉండే మా పిన్ని, చెల్లెలు వాళ్ల ఇల్లు. బంధువులందరం కలిస్తే అదే మాకు పెద్ద పిక్నిక్‌స్పాట్. అలా అని ఎక్కడా మిస్ అయింది లేదు. కుటుంబం అంటే మేమిద్దరమే అనుకోం. అమ్మవాళ్లు, అత్తయ్యవాళ్లు అందరూ కలిసిందే ఆనందం అనుకుంటాం. ఒకసారి నా బర్త్‌డేకి విజయవాడ కనకదుర్గ టెంపుల్‌కి వెళ్లాం. ప్రతియేడూ నా బర్త్‌డేకి అన్నదానం చేయడానికి టికెట్ తీసుకుని సర్‌ప్రైజ్ చేశారు..’’ అని స్వాతి చెబుతుంటే నా పుట్టినరోజు నాడు స్వాతి చేసిన హంగామా చూడాలి. అందరూ ఊరు వెళ్లిపోయి నాకు ట్రెజర్ హంట్ పెట్టారు. ఇంట్లో ఎక్కడో గిఫ్ట్ పెట్టి, అన్నీ చిట్టీలు రాసి, నా కానుక నేనే వెతుక్కునేలా చేశారు. ఇలాంటి సర్‌ప్రైజ్‌లు తరచూ ఇవ్వడం స్వాతి స్పెషల్’’ అంటూ తనదైన కామెడీతో నవ్వులు పండించారు శ్రీనివాస్‌రెడ్డి.
 ప్రేమ వివాహాల పట్ల చాలామంది మక్కువ చూపుతారు. అదీ కాదంటే తమకు అన్నివిధాల సమంగా ఉండే జీవితభాగస్వామి రావాలని కోరుకుంటారు. కాని పెళ్లి విషయంలో పెద్దలదే సరైన నిర్ణయమని తెలిపిన వీరి దాంపత్యం నిండా వారికి ఇచ్చిన గౌరవమే కనిపించింది. కోపం, అసహనాలు ఎవరి జీవితంలోనైనా చోటుచేసుకుంటాయి. అవి ఎదుటివారిని నొప్పించకుండా ఓర్పుతో జీవితాన్ని మార్చుకుంటూ ఆనందమయం చేసుకోవడంలోనే ఉంది దాంపత్యపు అసలు కిటుకు’’ అని చెప్పిన వీరి మాటలు ఎవరినైనా ఆలోచింపజేసేవే అనిపించింది.
 - నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
 
 

మరిన్ని వార్తలు