శ్రీవారి సేవలో... అలుపెరగని పాదచారి

24 Feb, 2020 07:42 IST|Sakshi
రికార్డు నమోదైన ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డు, బుక్‌తో శ్రీనివాసరావు,తిరుపతి నుంచి కాలినడకన తిరుమల వెళ్తున్న శ్రీనివాసరావు( ఫైల్‌ఫొటోలు)

శ్రీనివాసుని మాలధారణ చేస్తూ గోవింద నామం జపిస్తూ ఏడుకొండల్లో నడుచుకుంటూ వెళ్తూ.. మనసంతా స్వామి ధ్యానంలో నిమగ్నం చేస్తే అదొక అనుభూతి అని భక్తులు చెబుతుంటారు. ఏడుకొండల్లో మెట్ల మార్గం ద్వారా నడుచుకుంటూ వెళ్తున్న వారు అనేక మంది ఉన్నారు. కానీ 258 సార్లు వెళ్లిన మహంతి శ్రీనివాసరావు ప్రత్యేక వ్యక్తిగా నిలిచారు. శ్రీకాకుళం అంబేడ్కర్‌ కూడలి సమీపంలో ఆయుర్వేద దుకాణం ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న శ్రీనివాసరావు 1996 ఆగస్టులో తిరుమల తిరుపతిలో శ్రీవారి దర్శనానికి శ్రీకారం చుట్టారు. అప్పటినుండి అలిపిరి మార్గం, శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కొండెక్కి స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా మారింది. అవకాశం లభించినప్పుడల్లా ఒంటరిగానో, కుటుంబ సమేతంగానో అలిపిరి, శ్రీవారి మెట్లమార్గంలో తిరుమలకు చేరుకుని స్వామిని సేవించుకుంటున్నారు. ఆయన పాదయాత్ర రెండు దశాబ్ధాలకు పైగా కొనసాగుతూనే ఉంది. మొదట్లో తిరుపతి నుంచి అలిపిరి మీదుగా మెట్లమార్గంలో రోజుకు ఒకసారి వెళ్లగలిగేవారు. తర్వాత శ్రీవారి మెట్లమార్గంలో వెళ్తున్నారు.

జిల్లా నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంలో జేఈవోగా పనిచేసిన విశ్రాంత అధికారి రుంకు అప్పారావు 108 సార్లు తిరుమల కొండను కాలి నడకన ఎక్కారు. గతంలో ఇది జిల్లాలో ఎందరికో స్పూర్తిగా నిలిచారు. అదే స్పూర్తితో మహంతి శ్రీనివాసరావు కాలినడకన ఏడుకొండలు ఎక్కి శ్రీవారి దర్శనం చేసుకుంటున్నారు.. 3,550 మెట్లతో ఉండే అలిపిరి కాలినడక మార్గంలో (సుమారు 9కిలోమీటర్ల దూరం, 4గంటలు సమయం) 85సార్లు...  2388మెట్లతో రెండున్నర కిలోమీటర్ల దూరం (రెండు గంటల సమయం) ఉండే శ్రీవారి మెట్లమార్గంలో 173 సార్లు  తిరుమల కొండను చేరి స్వామి దర్శనం చేసుకున్నారు.

ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డుకెక్కిన శ్రీనివాసరావు
అరుదైన ఘనత సాధించిన వాళ్లను ఇండియా బుక్‌ రికార్డులో ఎక్కిస్తారని తెలుసుకుని 205వ సారి పూర్తి చేసుకున్నప్పుడు శ్రీనివాసరావు దరఖాస్తు చేశారు. 223వసారి కొండ ఎక్కిన సందర్భంలో ఇండియా బుక్‌ రికార్డులో స్థానం సంపాదించారు. 50, 51సంవత్సరాల వయస్సులో  2017లో 50పర్యాయాలు, 2018లో 71 పర్యాయాలు కాలినడకన తిరుమల ఎక్కినందుకు ఈ ఘనత సాధించారు. 2019మార్చి 5న ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డు సర్టిఫికేట్‌ స్వీకరించారు. తాజాగా ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డు పుస్తకాన్ని కూడా అందుకున్నారు.

భక్తులకు మార్గదర్శిగా జిల్లా నుండి తిరుమల తిరుపతికి వెళ్లే భక్తులకు శ్రీనివాసరావు గైడ్‌గా మారారు. తిరుమలలో వసతి, సేవలు,  క్షేత్రమహిమలు, ఇతర సమాచారాన్ని ఎప్పటికప్పుడు భక్తులకు వివరిస్తూ ఆధ్యాత్మిక ప్రబోధం చేస్తూ స్వామి వారి సేవలో తరిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని టీటీడీ కౌంటర్లలో స్వచ్ఛందంగా సేవలందిస్తూ స్వామి వారిపై తన అచంచలమైన భక్తి, విశ్వాసాలను ఆయన చాటుకుంటున్నారు.
తన వెంటే కుటుంబంశ్రీనివాసరావే కాదు, ఆయన భార్య సరస్వతి కూడా విష్ణు లలితా సహస్ర నామ పారాయణం, కోలాటం బృందాలతో పలుమార్లు తిరుమలకు వెళ్లారు. ఇప్పటివరకు ఆమె 53 సార్లు తిరుపతి నుంచి కాలినడకన తిరుమల వెళ్లారు. 2002 నుంచి ప్రతీ ఏటా వెళ్తూనే ఉన్నారు. రికార్డుస్థాయిలో తిరుమల ప్రయాణం చేసి శ్రీవారి భక్తుల్లో ఆధ్మాత్మిక చింతనను పెంపొందించడంతో పాటు వారిలో స్పూర్తిని, సరికొత్త ఉత్తేజాన్ని నింపుతున్నారు శ్రీనివాసరావు.

శక్తి ఉన్నంతవరకు నడిచే వెళ్తా
నైతిక విలువలతో, అత్యంత పవిత్రతతో తిరుమలకు అనేకమార్లు ఆధ్యాత్మికయాత్ర చేపట్టడటం తన లక్ష్యమని చెబుతున్నారు. కలియుగ ప్రత్యక్షదైవం విశిష్టతను దశదిశలా చాటుతూ స్వామివారి సేవలో మమేకం కావడం తన జీవితంలో అంతర్భాగంగా మారిపోయిందని అంటున్నారు. శక్తి ఉన్నంతవరకు కాలినడకనే తిరుమల వెళ్తానని శ్రీనివాసరావు చెబుతున్నారు. ఎన్ని సార్లు వెళ్తానన్నది ఇప్పుడే చెప్పలేను.
– కందుల శివశంకర్, సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళంఫొటోలు : కె.జయశంకర్, శ్రీకాకుళం

మరిన్ని వార్తలు