వెన్నెట్లో కళ్యాణం...

12 Apr, 2016 23:19 IST|Sakshi
వెన్నెట్లో కళ్యాణం...

రాముడు పాదం మెట్టిన తావు ఒంటిమిట్ట. సీతమ్మకు దప్పిక తీర్చిన తీర్థం ఒంటిమిట్ట. వైఎస్‌ఆర్ కడపజిల్లాలో ఉన్న ఈ ఆలయం అందుకే తెలుగువారి అత్యంత ప్రాచీనమైన ఆలయాల్లో ఒకటిగా పేరు పొందింది. రాష్ట్ర విభజన తర్వాత శ్రీరామ నవమికి ప్రభుత్వ లాంఛనాల హోదా లభించింది. శ్రీ సీతారామ కళ్యాణాన్ని శ్రీరామ నవమి నాడు పగలు దేశమంతటా రామభక్తులు నిర్వహిస్తారు. కానీ కేవలం ఒంటిమిట్ట క్షేత్రంలో మాత్రమే రాత్రి పూట నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈనెల శ్రీరామనవమి నుంచి ఈ క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు. 24వ తేదీ వరకు జరగనున్న ఈ ఉత్సవాలలో కళ్యాణోత్సవానికి అత్యంత ప్రాధాన్యత ఉంది.

 

రామ‘చంద్రుడు’

ఈ క్షేత్రపురాణం ఇలా ఉంది. శ్రీరాముని జన్మఘట్టాన్ని చూసే భాగ్యానికి నోచుకోలేకపోయానని, కనీసం మంగళకరమైన కళ్యాణమైనా చూసే అదృష్టం కల్పించమని చంద్రుడు బ్రహ్మదేవుడిని కోరాడట. ఆయన సమ్మతించి చంద్రుని కోసమే స్వామి కళ్యాణాన్ని ఏదో ఒకచోట రాత్రిపూట జరిగేలా చూస్తానని మాట ఇచ్చాడట. ఆ చోటు ఒంటిమిట్ట అయ్యిందని ఒక కథనం. వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీ సీతారామ కళ్యాణం ఉత్తర ఫల్గుణినక్షత్రంలో జరిగింది. విజయనగర సామ్రాజ్య వ్యవస్థాపకుల్లో ఒకరైన బుక్కరాయలు ఒంటిమిట్ట క్షేత్రంలో బ్రహ్మోత్సవాలను నిర్వహించదలచి నప్పుడు ఈ నక్షత్రానికే సీతారామ కళ్యాణాన్ని నిర్వహించాలని తలపెట్టగా నాడు ఆ లగ్నం రాత్రి పూట రావడంతో ఆనాటి నుంచి ఒంటిమిట్టలో స్వామి కళ్యాణాన్ని రాత్రిపూటే నిర్వహించడం సంప్రదాయంగా మారింది. ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. బుక్కరాయలు చంద్రవంశీయులు. తన వంశ మూల పురుషుడైన చంద్రునికి ప్రీతి కలిగించినట్లు కూడా ఉంటుందని రాత్రి లగ్నంలోనే స్వామి కళ్యాణం జరిపించేవాడు. అప్పటి నుంచి ఒంటిమిట్ట క్షేత్రంలో మాత్రం స్వామి కళ్యాణాన్ని రాత్రి పూటే నిర్వహిస్తున్నారు.

 

ఒంటడు, మిట్టడు

కడపజిల్లా గెజిటీర్, కైఫీయత్తుల ప్రకారం క్రీ.శ. 1336 ప్రాంతంలో విజయనగర సామ్రాజ్యంలో ఉదయగిరి ఓ చిన్న రాష్ట్రంగా ఉండేది. దాని పాలకుడు కంపరాయులు ఓమారు ఒంటిమిట్ట ప్రాంతాన్ని పరిశీలించగా ఒంటడు, మిట్టడు అనే బోయ వీరులు ఆ ప్రాంత రక్షకులుగా ఉండటం చూశాడు. రాజు, ఆయన పరివారానికి దాహం వేయడంతో ఒంటడు అక్కడి ఓ నీటి బుగ్గను చూపి వారి దాహార్తిని తీర్చాడు.  శ్రీ సీతారాములు ఈ ప్రాంతంలో పర్యటించినపుడు సీతమ్మకు దాహం వేయగా రాముడు బాణాన్ని భూమిలోకి సంధించాడని, ఆ ప్రాంతంలో నీటి ఊట ఏర్పడి చిన్న కొలనుగా మారిందని తెలిపాడు (ప్రస్తుతం రామతీర్థంగా ఆ కొలను వాడుకలో ఉంది). దగ్గరలోని గుట్టపైని శిథిలావస్థలో ఉన్న గుడిని దర్శించిన కంపరాయలు కొత్త విగ్రహాలను ఏర్పాటు చేసి ఆలయాన్ని నిర్మిస్తానని మాట ఇచ్చాడు. ఆ బాధ్యతను బోయ పాలకులైన ఒంటడు, మిట్టడుకే అప్పగించి అవసరమైన వనరులు ఏర్పాటు చేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత 1355-56 ప్రాంతంలో విజయనగర పాలకుడైన బుక్కరాయలు కాశీ యాత్ర చేసి తిరుగు ప్రయాణంలో గోదావరి నది ఒడ్డున ఇసుకపల్లె ప్రాంతం నుంచి ప్రత్యేకంగా తెచ్చిన ఏకశిలపై రూపొందించిన శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరాముడి విగ్రహాలను ఒంటిమిట్టలో ప్రతిష్ఠించాడు. ఆ స్వామికి రఘునాయకులని పేరు పెట్టుకుని ఆరాధించారు. కాగా కోదండ రామాలయంలో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరాముడు ఏకశిలపై ఉండడంతో ఒంటిమిట్టకు ఏకశిలా నగరం అని పేరు వచ్చింది.

 

పోతన భాగవతం

భక్తపోతన పెద్దలు తెలంగాణ ప్రాంతం నుంచి ఆయన బాల్యంలో ఈ ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారని ఒక పరిశీలన. ఆయన మహా భాగవతం రాసింది ఒంటిమిట్ట శ్రీరాముని సన్నిధిలోనే అని తెలుస్తోంది. ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా భాగవత కావ్యాన్ని ఆయన రాజులకుగాక శ్రీరామచంద్రునికే అంకితమిచ్చాడు.

 

ఈ ఆలయం అపురూప శిల్పకళా సంపదకు నిలయంగా ఉంది. రంగ మండపంలో 32 స్తంభాలు, 16 యాళి స్తంభాలు అద్భుతంగా ఉండి కనువిందు చేస్తున్నాయి. ఆంజనేయుడు లేని రామాలయంగా కూడా ఈ క్షేత్రానికి విశిష్టత ఉంది. ఈ ఆలయం నిర్మించిన నాటికి శ్రీరామునికి హనుమంతుడు పరిచయం కాలేదని, అందుకే స్వామి సన్నిధిలో ఆయన లేడని చెబుతారు. రాజగోపురం ఎదురుగా సంజీవరాయుడి పేరిట హనుమంతుని ఆలయాన్ని బుక్కరాయుల కాలంలో నిర్మించినట్లు తెలుస్తోంది.

 
వాసుదాసు భక్తి

భద్రాచలానికి రామదాసు ఎంతో, ఒంటిమిట్టకు వాసుదాసు అంతటి వాడు. ఆయన అసలు పేరు వావిలికొలను సుబ్బారావు. 1863లో జమ్మలమడుగులో జన్మించిన ఆయన ఎన్నో భక్తికావ్యాలు రచించారు. ఆయనకు స్వప్నంలో ఓ వ్యక్తి కనిపించి ఒంటిమిట్ట ఆలయ అభివృద్ధ్దికి కృషి చేయాలని కోరినట్లు తోచింది. నాటి నుంచి ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడే ఆయనకు ఆరాధ్యదైవమయ్యారు. తన ఆస్తిపాస్తులన్నీ ఆ రాముడికే సమర్పించారు. అంతేగాక కౌపీనం (గోచి) పెట్టుకుని టెంకాయ చిప్ప చేతబట్టి ఊరూరా భిక్షమెత్తి ఆ మొత్తాలను సైతం రాముడికే భక్తి పూర్వకంగా సమర్పించాడు. జీవితాంతం ఒంటిమిట్ట రామయ్య సేవలోనే తరించాడు.

 

మత సామరస్యం

ఒంటిమిట్ట ఆలయానికి మత సామరస్యం రీత్యా కూడా విశిష్టత ఉంది. 1790లో ఈ ప్రాంతం కర్ణాటక నవాబు టిప్పు సుల్తాన్ అధీనంలోకి రాగా, ఒంటిమిట్ట పాలన స్థానిక ప్రముఖుడు ఇమాంబేగ్ చేతుల్లోకి వచ్చింది. ఓమారు తీవ్రమైన కరువు ఏర్పడినప్పుడు ఇమాం బేగ్ ముందుకొచ్చి రాజగోపురం ఎదురుగా మెట్లకు దక్షిణం వైపున బావి తవ్వించాడు. రామకార్యానికి ఆ జలాన్ని ఉపయోగించడంతోపాటు గ్రామ ప్రజలకు కూడా ఆ బావి ఎంతో ఆదరువుగా ఉండేది. ఇమాంబేగ్ ఔదార్యానికి, మత సామరస్యతకి, మానవత్వానికి సాక్ష్యంగా ఈ బావిని నేటికీ చూడవచ్చు.

 - మోపూరి బాలకృష్ణారెడ్డి, సాక్షి ప్రతినిధి, కడప

 

 

 ఇక్కడికి ఇలా సులువు
కడప నుంచి ఒంటిమిట్ట 25కిలోమీటర్లు దూరంలో ఉంది. కడప-రాజంపేట మార్గంలో ఉన్న ఈ క్షేత్రానికి విస్తృతంగా బస్సులున్నాయి. విమానాల్లో వచ్చే భక్తులు అటు రేణిగుంట, ఇటు కడప విమానాశ్రయాల ద్వారా చేరుకోవచ్చు. శుక్ర, శని, ఆది, సోమవారాలల్లో హైదరాబాద్ నుంచి కడపకు విమాన సౌకర్యం ఉంది. రేణిగుంట నుంచి వచ్చే భక్తులు ఒంటిమిట్టకు 110 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఎటు చూసినా కడప నుంచి ఒంటిమిట్ట చేరుకోవడమే సునాయాసం.

 

మరిన్ని వార్తలు