స్టార్‌ పంచాంగం

18 Mar, 2018 03:05 IST|Sakshi

విళంబిలో వెయిటింగ్‌ ఉన్నా హీరోల వెయిట్‌ ఏ మాత్రం తగ్గదని ఈ సంవత్సరం ఉగాది ఫలితాలు హర్షణీయంగా తెలియచేస్తూ ఆ విధంగా ముందుకు పోతున్నాయి. స్టార్లు సూపర్‌స్టార్లుగా సూపర్‌లు మెగాలుగా మెగాలు గిగాలుగా ప్రమోట్‌ కాబోతున్నారని ఆ మేరకు వారికి ధన కనక వస్తు వాహనాలతోపాటు ఫామ్‌ హౌస్‌లు సిద్ధించనున్నాయని విళంబి రాశి ఫలాలు నిలకడగా నినదిస్తున్నాయి.

సినిమా ఇండస్ట్రీ మూడు ఫ్లవర్స్‌ ఆరు ఫ్రూట్స్‌గా కళకళలాడనున్నదని చేదు అనే మాటే లేకుండా అంతా పుల్లారెడ్డే ఉండి, స్వీటెస్ట్‌ రిజల్ట్స్‌ దక్కుతాయని పంచాంగం పేజీలు పెద్ద పెద్ద ఫాంట్‌లతో రూఢీ పరుస్తున్నాయి. కేరెక్టర్‌ ఆర్టిస్టులలో తెలుగువారికి ఎక్కువ అవకాశాలు రానున్నాయని, పరాయి భాషల నుంచి వచ్చి పాడే గాయనీ గాయకులు ‘ళ’ని ‘ళ’గానే పలుకుతారని ‘కళ్లు’ను ‘కల్లు’ అనరని ‘ఆశ’ను ‘ఆస’ అనరని కూడా ఈ ఫలితాలు తెలుగు భాషాభిమానులకు ధైర్యం చెబుతున్నాయి. ఇండస్ట్రీ అంటే హీరో... హీరో అంటే ఇండస్ట్రీ కనుక ఈ విళంబి హీరోలందరినీ చల్లటి చూపులతో పరికించనుందని మరో భోగట్టా.ఈ సందర్భంగా హీరోల రాశీఫలాలు ఎలా ఉన్నాయో సరదాగా పరికిద్దాం.


చిరంజీవి
కొణిదెల ప్రొడక్షన్స్‌ కోడిరామ్మూర్తి కంటే బలమైన ప్రొడక్షన్‌ హౌస్‌గా మారనున్నదనేది మెగా ఫ్యామిలీకి ఈ విళంబి అందించనున్న మంచి వార్త. ఈ సంవత్సరం ‘సైరా’ ‘సైసై’గా షూటింగ్‌ జరుపుకుని అభిమానుల కోసం అన్ని హంగులతో సిద్ధమవుతుందనడంలో ఎటువంటీ సందేహం అక్కర్లేదని గ్రహాలు ఘోషిస్తున్నాయి.

‘ఖైదీ’ నాటి ఫైట్లతో ఖైదు చేసి, ‘కొండవీటి దొంగ’నాటి స్టెప్పులతో ప్రేక్షకుల మనసులను దోచుకెళ్లి, ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’ వలే బాక్సాఫీసుకు మొగుడుగా మరోసారి మెగాస్టార్‌ మెగా రిజల్ట్‌ సాధించనున్నారని ఫోర్‌కాస్ట్‌. కొడుకు రామ్‌చరణ్‌ ‘రంగస్థలం’ మీద దుమ్ము దులపనున్నాడని, చిన్నల్లుడు కల్యాణ్‌ పెద్ద హిట్‌ కొట్టనున్నాడని కూడా తెలుస్తోంది.

మెగా కుటుంబంలోని హీరోలు ఒక అడుగు వెనకేసినా రెండడుగులు ముందుకే లంఘిస్తారని కలెక్షన్ల కోకిలలు కొమ్మెక్కి మరీ కూస్తున్నాయి. ఈ విరాట్‌ ఆంజనేయుని నీడలో వారంతా ఆడుతూ పాడుతూ బతికేస్తారని శుక్రవారం పూట రిలీజయ్యే ప్రతి సినిమాతో శుక్రమహాదశ అనుభవిస్తారని విళంబి విస్పష్టంగా సుస్పష్టంగా ప్రకటిస్తున్నది.

మహేశ్‌బాబు
ఈ ఘట్టమనేని వంశోద్ధారకుడికి ఈ సంవత్సరం ‘భరత్‌ అను నేను’తో అసెంబ్లీ యోగం పట్టనున్నదని, సి.ఎం కాన్వాయ్‌ ప్రాప్తించనున్నదని ఇంటెలిజెన్స్‌ రిపోర్ట్‌ అందిస్తోంది కిళాంబి. ఎలక్షన్లలో విజయదుందుభి మోగించి విలన్‌ల వీపులు కూడా మోగించనున్నాడని నైజాం–సీడెడ్‌ గ్రూప్‌ సంస్థలు చేపట్టిన సర్వేలు చెబుతున్నాయి. స్పీచ్‌లు రాసిచ్చిన కొరటాల శివ  ఇందుకు ప్రతిఫలంగా ‘సక్సెస్‌ శాఖ’కు మంత్రిగా బాధ్యతలు స్వీరించునున్నారని కూడా తెలుస్తోంది.

ఎటువంటి కుల, మత, వర్గ భేదాలు లేకుండా ఈ సూపర్‌స్టార్‌ ‘భరత్‌ అను నేను’తో సకల ప్రేక్షకులను అలరించనున్నాడని స్ట్రాంగ్‌ రిపోర్ట్‌. ఫైనల్‌ కాపీ చూసుకుని, భార్య నమ్రత చేసిన మహరాష్ట్ర ఉగాది పచ్చడి చప్పరించి ఈ హీరో లెగ్‌ మీద లెగ్‌ వేసుకొని రిలాక్స్‌ అవుతున్నాడని కూడా రాశులు రాశుల కొద్దీ సమాచారాన్ని ఇస్తున్నాయి. తర్వాతి ప్రాజెక్ట్‌ వంశీ పైడిపల్లి స్వీకరించి పసిడి ఫలితాలకు ఈ విళంబిలోనే అంకురార్పణ చేస్తారన్న సంగతి తెలిసిందే.

ప్రభాస్‌
మహాష్మతి, దాంతో పాటు బాక్సాఫీసు ఉలిక్కిపడి చాలా కాలం అయ్యింది కనుక ప్రభాస్‌ తన తర్వాతి సినిమా కోసం ప్రేక్షకులను మరింత ఎదురు చూసేలా చేయవద్దని విళంబి హెచ్చరిస్తోంది. ‘సాహో’ను ‘ఓహో’ అనిపించేలా తీసి తర్వాత తెర మీదకు రావాలని అది సూచిస్తోంది. అది ఆలస్యమైతే మధ్యలో మరో సినిమా తీసి జనానికి ఇవ్వడం హితమైన పనే అని అది హితవు పలుకుతోంది.

ఈ విళంబి ముగిసే లోపు నుదుటిన బాసికం కట్టడం ఖాయమని కర్కాటక రాశి వాక్రుచ్చగా ఆ నవవధువు తుళు ప్రాంతం నుంచా తెలుగు ప్రాంతం నుంచే తేల్చుకోలేకపోతున్నానని ధునూరాశి తల పట్టుకుంది. క్షత్రియ ధర్మం ప్రకారం వీరుడు వనితను వరించడం తప్పనిసరి అని కనుక ఈ సంవత్సరం అందుకుగాను కర్తవ్యోన్ముఖం కావాలని మామిడి తోరణం తగు రీతిలో వార్నింగ్‌ ఇస్తోంది. గ్రహాలు హటం చేయకముందే ఈ హీరోకి పెళ్లి మీద అనుగ్రహం కలగాలనేదే విళంబి కామన. శుభకామన.


రామ్‌చరణ్‌
‘రంగస్థలం’లో చెవిటివాడిగా చేసినా కలెక్షన్ల విషయంలో బాక్సాఫీసు గూబ గుయ్‌మనిపించనున్నాడని విళంబి నొక్కి వక్కాణిస్తుండటం ఈ చిరు తనయుని అభిమానులకు బంగారు కొడిపెట్టలాంటి వార్త. సుకుమార్, సమంత తోడు ఉండటం వల్ల సక్సెస్‌ కూడా జోడు కట్టనుందని కథనాలు వెలువడుతున్నాయి. ‘లచ్‌మి’ని పొగుడుతూ పాడిన పాట లక్ష్మిని బిందెలతో కుమ్మరించనున్నదనే పుకారు హోరెత్తుతోంది.

హిట్టయిన ఆడియో వీడియోని క్లిక్‌ చేయనుందని పంచాంగం పంచాయితీ తీర్పు. తర్వాతి ప్రాజెక్ట్‌ కోసం బోయపాటి శ్రీను అద్దిరిపోయే ఫైట్స్‌ను ఇప్పటికే డిజైన్‌ చేశాడని మధ్య కథ పెట్టడమే తరువాయి అని కొన్ని గ్రహాల ద్వారా తెలుస్తున్న సమాచారం. ఆ తర్వాతి సినిమారాజమౌళి దర్శకత్వంలో ఉన్నది కనుక ‘ఒక్క సీన్‌ కాదు రాజమౌళీ ఖాన్‌... వంద సీన్లు రాయండి. చేయకపోతే చూడండి’ అని ఈ మగధీరుడు సవాలు విసురుతున్నట్టు కూడా పంచాంగం పేజీలలో పబ్లిష్‌ అయి ఉంది.

అల్లు అర్జున్‌
 ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ షూటింగ్‌ మిలట్రీ వంటలతో చేవ చచ్చిన ఈ స్టయిలిస్ట్‌ స్టార్‌ నాలుకకు సినిమా విడుదల సమయాన ప్రేక్షకులు కలెక్షన్లతో షడ్రసోపేతమైన బ్రహ్మాండమైన భోజనం పెట్టనున్నారన్న వార్త విళంబి కన్ఫర్మ్‌ చేస్తోంది. సన్నాఫ్‌ సత్యమూర్తి అయిన ఈ జులాయి డిజెగా చేసిన అసైన్‌మెంట్‌ పూర్తిగా సంతృప్తినివ్వక ఈసారి ఏకంగా దేశ సరిహద్దులో శతృవు తూటాకు ఛాతీని అడ్డుపెట్టే స్థాయికి ఎదగడం అభిలషణీయమని కూడా విళంబి హర్షం వ్యక్తం చేస్తోంది.

కన్యారాశిలో పుట్టిన హీరోయిన్లందరూ ఇతని పక్కన నటించడానికి ఉవ్విళ్లూరుతారని కాని గాసిప్‌ మకరానికి చిక్కకుండా జాగ్రత్త పడాలని పంచాంగం హెచ్చరిస్తోంది. అయితే ఈ సినిమా రిలీజ్‌ అయ్యే సమయంలో గట్టి పోటీ ఒకటి ఎదురు కానున్నదని అయితే వీరయ్య వీరయ్యే సూరయ్య సూరయ్యే అన్నట్టుగా రెండు ఫలితాలు పోటాపోటీగా ఉంటాయని కూడా విళంబి తను అంచనాలతో ఖరారు చేస్తోంది.

నాని
ఇంతింతై వటుడింతై నాని అంతై అన్నట్టుగా ఈ నాచురల్‌ స్టార్‌ నేచర్‌ ఇచ్చే హిట్స్‌తో మరింత ఎదిగిపోతాడని గ్రహఫలాలు గర్వంగా చెబుతున్నాయి. ఇతడు అజాత శత్రువుగా అందరి ఆదరణ పొందుతాడని ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు ఇతడి పక్షంలో శాశ్వత సభ్యత్వం తీసుకుంటారని విళంబి విలాసంగా చెబుతున్నది.

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో విడుదల కానున్న ‘కృష్ణార్జున యుద్ధం’ సక్సెస్‌ బాణాన్ని సూటిగా కొట్టనుందని విళంబి ఇస్తున్న ప్రధాన సంకేతం. చిత్తూరు యాస ప్రేక్షకుల మనసుల్ని చిత్తుచిత్తుగా గెలుచుకుంటుందని కూడా బజ్‌ అందుతోంది. తెలుగు ప్రాంతాన్ని జయించిన ఈ హీరో త్వరలో తమిళంలో కూడా మరోసారి జెండాను పాతుతాడని ఉగాది పచ్చడి మెచ్చి చెబుతున్న జోస్యం.

ఎన్టీఆర్‌
ఈ బిగ్‌బాస్‌ మీద ప్రేక్షకులు వేయి కెమెరాలతో నిఘా పెట్టి ఉన్నారని, తర్వాతి సినిమా విశేషాల కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారని మేషం మిథునంతో చెప్పగా తెలుస్తూ ఉంది. కొత్త లుక్కుతో, డైలాగ్‌ కిక్కుతో ఈ యంగ్‌ టైగర్‌ తెర మీద గర్జించనున్నారని వృషభం రంకె వేసి మరీ చెబుతోంది. ఈ హీరో కోసం త్రివిక్రమ్‌ కొత్త పిందెలు, కొత్త పూతలు, సరికొత్త పెన్నులూ వెతుక్కుంటూ అన్వేషణ సాగిస్తున్నాడని కూడా తులా తెచ్చిన తాజా సమాచారం.

తంతే గారెల బుట్టలో పడటం ఆనవాయితీయే అయినా ఈ హీరో ఈసారి రెండు గారెల బుట్టల్లో పడ్డాడని త్రివిక్రమ్‌ తర్వాత రాజమౌళి సినిమాలో నటించబోవడం చిల్లి గారెతో చికెను నంచుకు తిన్నంత మంచి వార్తగా అభిమానులు భావించనున్నారని కూడా ఫలితాలు వెల్లడి చేస్తున్నాయి. ఆరోహణే తప్ప అవరోహణ లేనట్టుగా విళంబి ఈ నందమూరి అందగాణ్ణి అందలం ఎక్కించనున్నదనే వార్త అభిమానులకు నూతన ఉత్సాహం ఇస్తోంది.

మరిన్ని వార్తలు