అహాన్ని వదిలేయాలి

1 Nov, 2018 00:25 IST|Sakshi

చెట్టు నీడ

అతను ఓ గొప్ప ధనవంతుడు. ఎందుకనో క్రమంగా అతని మనసులో ఏదో అసంతృప్తి ఆవరించింది. . దాంతో మనశ్శాంతికోసం రకరకాల గురువుల వద్దకు వెళ్లడం మొదలు పెట్టాడు. కానీ, వారు ఏదైనా చెప్పడం మొదలు పెట్టగానే ఇది తనకు తెలిసిందేగా, ఇందులో తెలుసుకోవలసింది ఏముంది? అనుకుంటూ ఏదో అత్యవసరమైన పని ఉన్నట్లు బయటకు వచ్చేసేవాడు. అయితే, మనశ్శాంతి లేక చివరకు ఓ గురువును కలిశాడు. తనలో తలెత్తిన అసంతృప్తి గురించి చెప్పి, తనకు సరైన మార్గం చూపెట్టమన్నాడు. అతని మాటలు విన్న ఆ గురువు ‘మీకు నేను పాఠాలు చెప్పేముందు మీరు వెళ్లి మూత్రవిసర్జన చేసిరండి’ అని చెప్పాడు.ఆయన మాట విన్న ధనవంతుడు ‘ఏమిటీయన ఇలా చెబుతాడు? బుద్ధుందా అసలు’ అని అనుకుంటూనే బయటకు వెళ్ళాడు.

కాసేపటి తర్వాత మళ్ళీ లోపలికొచ్చి గురువుగారి ముందు కూర్చున్నాడు.‘ఏంటీ అర్థమైందా?’ అని అడిగారు గురువు.‘‘నాకేమీ అర్థం కాలేదు..’’ అన్నాడతను కాస్త వ్యంగ్యంగా.. దానికాయన ‘ఎంత పెద్ద ధనికుడైనా, గొప్పవాడైనా కావచ్చు లేదా వారి దగ్గర పని చేస్తున్న వారో లేదా పేదవాడు కావచ్చు. అందరూ కూడా ఇప్పుడు నువ్వు చేసొచ్చిన పనిని ఎవరికి వారు చేయాల్సిందే తప్ప ఒకరి తరఫున మరొకరు వెళ్ళి చేసొచ్చేది కాదు. అంతేకాదు, ఎవరి వద్దనైనా ఏమైనా తెలుసుకోవాలని అనుకునేముందు నీలో ఉన్న వ్యర్థాలను, నాకే తెలుసుననే అహంకారాన్ని విసర్జించాలి. తెలియని విషయాన్ని ఎంత చిన్నవారు చెప్పినా వినాలి. అడ్డుపడకూడదు’ అని అన్నారు. తనకు విషయం అర్థమైందన్నట్లుగా తలూపి, ఆయనకు నమస్కరించి, అక్కడినుంచి సంతృప్తితో బయటపడ్డాడా ధనవంతుడు.  

>
మరిన్ని వార్తలు