తగిన యుక్తి

29 Jan, 2019 00:20 IST|Sakshi

చెట్టు నీడ

ఇశ్రాయేలీయులను పరిపాలించిన కనాను రాజు సేనాధిపతి సీసెర చాలా క్రూరుడు. ఇశ్రాయేలీయులను బహుగా హింసించేవాడు. ఒకసారి యుద్ధం జరిగినప్పుడు ఈ సీసెర ఇనుప రథాలతో ఇశ్రాయేలీయులను, వారి పక్షంగా యుద్ధం చేసే బారాకుని చంపాలని బయలుదేరాడు. అయితే ఎంతటి సేనాధిపతి అయినా అవతలి వ్యక్తి బలాన్ని తక్కువ అంచనా వేస్తే ఓడిపోక తప్పదు కదా. సీసెర విషయంలో కూడా ఇదే జరిగింది. తన సైన్యాన్నంతా కోల్పోయి తన రథాలను విడిచి బారాకు తరుముతున్నప్పుడు కాలినడకన అక్కడినుండి పారిపోవడం మొదలు పెట్టాడు. అలా వెళ్లిన సీసేరాకు ఒక స్త్రీ కనిపించింది. స్త్రీనే కదా, తనకు ఇక ప్రాణహాని ఉండదు.. నిశ్చింతగా ఉండొచ్చు అనుకుని దాహం ఇమ్మని ఆ స్త్రీని ఆజ్ఞాపించాడు. అప్పుడు ఆ స్త్రీ నీళ్లకు బదులుగా పాలిచ్చి అతడిని నమ్మించింది. ఇక ఈ స్త్రీ వల్ల తనకు హాని లేదని అనుకుని ఆ స్త్రీని గుడారానికి కాపలాగా ఉంచి ‘‘ద్వారంలో నిలిచి ఎవరైనా వచ్చి అడిగితే ఎవరూ లేరని చెప్పు’’ అని ఆదేశించి, తాను లోపల పడుకున్నాడు. ఇశ్రాయేలీయులను హింసిస్తున్న సీసెర మీద కోపంతో ఉన్న ఈ స్త్రీ ఈ అవకాశాన్ని వదులుకోవాలని అనుకోలేదు. పాలు తాగి గాఢ నిద్రలో ఉన్న సీసెరాని గుడారపు మేకుతో సుత్తి చేత పట్టుకుని పొడిచి చంపేసింది. సీసెరా పీడ నుండి ఇశ్రాయేలీయులను విడిపించింది. ఎంతో గర్వంగా ప్రవర్తించిన ఒక రాజ్య సేనాధిపతి దారుణంగా చనిపోయాడు. 

ఇక్కడ ఈ స్త్రీ గొప్పతనాన్ని గురించి మనం చెప్పుకోవాలి. అవకాశం దొరకగానే చాలా తెలివిగా ప్రవర్తించి నీళ్లడిగితే పాలిచ్చి అతడిని గాఢ నిద్రలోనికి జారుకునేటట్లు చేసింది. అతడి బలాన్ని చూసి భయపడకుండా అతడు పడుకోగానే ఎవరికైనా చెబుదామని వెళ్లలేదు. తాను వెళితే అతడు లేస్తే మళ్లీ బలం తెచ్చుకుంటాడేమోనని ఆలోచించింది. తన ప్రాణానికి తెగించి అతడిని మట్టు్టబెట్టింది, చాలా యుక్తిగా, తెలివిగా ప్రవర్తించి తన జాతిని ఆ క్రూరుడి నుండి రక్షించింది. ఇలాంటి స్త్రీలు చరిత్రలో ఎంతో మంది ఉన్నారు.  
– రవికాంత్‌ బెల్లంకొండ  

మరిన్ని వార్తలు