చతురంగ తరంగం

7 Dec, 2017 23:40 IST|Sakshi

మట్టిలో మాణిక్యం

చెస్‌లో రాణిస్తున్న సరయు 

జాతీయ స్థాయిలో రెండో స్థానం 

అంతర్జాతీయ స్థాయి(అండర్‌) పోటీలకు ఎంపిక

ఆడపిల్లలని వివక్ష చూపకుండా గోరంత ప్రోత్సాహమిస్తే, కొండంత ఉత్సాహం తెచ్చుకుని, పుట్టినింటి పేరునే కాదు, పుట్టిన దేశానికే ప్రపంచ స్థాయిలో పేరు ప్రతిష్ఠలు తెచ్చిపెట్టగలరు. రాష్ట్ర స్థాయి చెస్‌ చాంపియన్‌షిప్‌ ఐదుసార్లు సాధించిన ఈ చిచ్చర పిడుగే అందుకు నిదర్శనం. ఇటీవల జాతీయ స్థాయిలో ఓరుగల్లు కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన సరయు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి చాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొనడానికి పావులు కదుపుతోంది. గ్రాండ్‌మాస్టర్‌ కావడమే లక్ష్యమని చెబుతోంది చిన్నారి చతురంగ తరంగం...

వరంగల్‌ రూరల్‌ జిల్లా సంగెం మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన వేల్పుల రజిత–సంపత్‌ దంపతులకు సరయు, శరణ్య కవల పిల్లలు. 7వ తరగతి చదువుతున్న సరయు చదరంగంలో రాణిస్తుండగా శరణ్య క్లాసికల్‌ డాన్స్‌లో దిట్ట. తల్లి రజిత గృహిణి, తండ్రి సంపత్‌ ఆర్‌ఎంపీ. డాక్టర్‌గా మొండ్రాయి గ్రామంలో క్లినిక్‌ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.‘అప్పుడు సరయు 4వ తరగతి చదువుతోంది. ఒక రోజు తండ్రి సంపత్, మేనమామ రవి, బాబాయి సలెందర్‌ చదరంగం ఆడుతున్నారు. ఈ క్రమంలో వారి ఆటను గమనిస్తున్న సరయు ఓడిపోతున్న తండ్రిని తన ఎత్తులతో గెలిపించింది’.తర్వాత సరయును గొర్రెకుంటలోని విజ్ఞాన్‌స్కూల్‌లో చేర్పించారు. ప్రిన్సిపాల్‌ గిరిధర్, పీఈటీ సునీల్‌లకు తన కూతురుకు చెస్‌ అంటే ఇష్టమని చెప్పారు. దాంతో వారు చెస్‌టోర్నమెంట్‌లకు తరచూ తీసుకుని వెళ్తుండేవారు. ఆ తర్వాత తేజస్వీ హైస్కూల్‌లో చేర్పించారు. అక్కడ ప్రిన్సిపాల్‌ చంద్రశేఖర్‌రావు సరయు ప్రతిభను గుర్తించి ఉచిత విద్యనందించడంతోపాటు టోర్నీలకు అయ్యే ఖర్చులను భరిస్తూ ప్రోత్సహించారు. ఎలాంటి శిక్షణ లేకుండానే 2015 సంవత్సరం గోవాలో నిర్వహించిన చాంపియన్‌షిప్‌లో ప్రథమ స్థానంలో నిలిచింది. శిక్షణ ఇప్పిస్తే మరింత రాణిస్తుందని సంపత్‌ అనే కోచ్‌వద్ద శిక్షణ ఇప్పించారు. ప్రత్యర్థి ఎత్తుగడలను, ఆలోచనలు, ఊహలను ముందే పసిగడుతూ ఎత్తుకు పై ఎత్తు వేస్తూ చిచ్చర పిడుగు సరయూ చదరంగంలో రాణిస్తున్న సరయు అంతర్జాతీయ క్రీడాకారులు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, అర్జున్‌ల స్ఫూర్తితో జాతీయ స్థాయిలో రాణించి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. 2018 ఏప్రిల్‌లో ఏషియన్‌ స్థాయిలో థాయిలాండ్‌లో జరిగే అండర్‌ 12 విభాగం, 2018 నవంబర్‌లో గ్రీస్‌లో జరిగే అంతర్జాతీయ స్థాయి అండర్‌ 12 విభాగం పోటీల్లో సరయు పాల్గొననుంది.

రాష్ట్ర స్థాయిలో చాంపియన్‌...
2015లో వరంగల్‌లో జరిగిన అండర్‌–9 విభాగం పోటీల్లో, 2016 సంవత్సరం హైదరాబాద్‌లో జరిగిన అండర్‌–11 విభాగంలో చాంపియన్‌షిప్, 2017 సెప్టెంబర్‌ హైదరాబాద్‌లో అండర్‌విభాగంలో రెండో స్థానం, ఇదే నెలలో ఖమ్మంలో జరిగిన అండర్‌ 17 విభాగంలో చాంపియన్, అక్టోబర్‌లో వరంగల్‌లో జరిగిన రాష్ట్రస్థాయి అండర్‌11 విభాగంలో చాంపియన్, వరంగల్‌ రూరల్‌ జిల్లాలో జరిగిన ఎస్‌జీఎఫ్‌ అండర్‌–14 క్రీడా పోటీల్లో చాంపియన్‌గా నిలిచింది.
– గజ్జెల శ్రీనివాస్, సంగెం, సాక్షి వరంగల్‌ రూరల్‌

గ్రాండ్‌మాస్టర్‌అవుతాను    – సరయు
ఇప్పటివరకు రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో రాణించాను. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటి గ్రాండ్‌మాస్టర్‌ కావాలన్నది నా లక్ష్యం. పెద్దలెవరైనా అండదండలు అందిస్తే నా చదువును ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా లక్ష్యసాధనకు కృషి చేస్తాను.


జాతీయస్థాయి పోటీల్లో...
తొలిసారిగా 2015 గోవాలో జరిగిన అండర్‌–9 విభాగంలో పాల్గొంది.
2016 సంవత్సరం నాగపూర్‌లో జరిగిన అండర్‌–11 విభాగంలో పాల్గొంది. ఇదే సంవత్సరం మేలో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన అండర్‌–11 విభాగంలో పాల్గొంది.
2017 జనవరి మహారాష్ట్రలో జరిగిన అండర్‌–11 విభాగంలో 5వ స్థానంలో నిలిచింది. 2017 జూన్‌లో పంజాబ్‌లో జరిగిన అండర్‌–13 విభాగంలో పాల్గొంది.
2017 నవంబర్‌23–30 వరకు పుణేలో జరిగిన జాతీయ స్థాయి అండర్‌11 విభాగం చాంపియన్‌షిప్‌ పోటీల్లో ప్రతిభ కనబరిచి రెండోస్థానంలో నిలచి అంతర్జాతీయ చాంపియన్‌షిప్‌ పోటీలకు ఎంపికైంది.

అంతర్జాతీయ స్థాయి శిక్షణ ఇప్పించాలి
నా కూతురు సరయూకు చదరంగం అంటే ప్రాణం. ఆమె ఆసక్తిని గమనించి ప్రోత్సహించాను. నా శక్తిమేర మూడేళ్లుగా శిక్షణ ఇప్పిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలంటే ఉన్నతస్థాయిలో శిక్షణ అవరం. అందుకు లక్షల్లో ఖర్చవుతుంది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన నాకు ఇది శక్తికి మించిన పని. ప్రభుత్వం సరయూ ప్రతిభను గుర్తించి శిక్షణకు అయ్యే ఖర్చును భరించి అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణించేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
– వేల్పుల సంపత్, సరయు తండ్రి

మరిన్ని వార్తలు