ఉత్సవ మూర్తులు

22 Sep, 2019 05:54 IST|Sakshi

ఆలయం ఆగమం

ఆలయం గర్భగుడిలో మూలవిరాట్టు దగ్గర మనకు కొన్ని లోహవిగ్రహాలు కనిపిస్తాయి. వాటిని ఉత్సవమూర్తులు అంటారు. ఉత్సవాల్లో భాగంగా ఊరేగే విగ్రహాలవి. మూలమూర్తి స్థిరంగా గర్భగుడిలో కొలువుతీరితే ఉత్సవాల సందర్భంగా దేవుడికి ప్రతినిధిగా భక్తుల మధ్యకు వచ్చి, ఆలయానికి రాలేని వారికి కూడా దర్శనమిచ్చి అనుగ్రహించేది ఈ ఉత్సవమూర్తులే. వీటిని ఆగమ, శిల్పశాస్త్ర పరిభాషలో బేరం అంటారు. సలక్షణంగా శాస్త్రం ప్రకారం చేయబడిన విగ్రహాన్ని బేరం అంటారని విమానార్చనాకల్పం చెప్పింది. వైష్ణవ ఆలయాల్లో మనకు పంచబేరాలు కనిపిస్తాయి. అవి 1.ధృవబేరం, 2.అర్చాబేరం, 3.కౌతుకబేరం 4.స్నపనబేరం,5.బలిబేరం. పంచభూతాలకు ప్రతీకలుగా పంచమూర్తి తత్త్వంతో ఆలయంలో ఈ పంచబేరాలు చెప్పబడుతున్నాయి.

వీటిలో మొదటిది ధృవబేరం. ఇది మూలమూర్తి. స్థిరంగా ప్రతిష్ఠించబడిన మూర్తి. మిగిలిన నాలుగు బేరాలలోకి ఈ మూలమూర్తి శక్తిని ఆవాహన చేస్తారు. ఉత్సవాది కార్యాలు పూర్తయ్యాక ఆ శక్తిని మరలా మూలమూర్తిలోనికే లీనం చేస్తారు. అందువల్ల ప్రధానమైన, అత్యంత శక్తివంతమైన మూర్తి ఈ ధృవబేరం. ఇక రెండవది అర్చాబేరం మూలమూర్తి ఎలా ఉంటుందో అలాగే చిన్నగా ఉంటుంది. దీనినే కర్మార్చ, ధృవార్చ అని కూడా అంటారు. దీనికి నిత్యపూజలు చేస్తారు. ఈయన సకలసేవలు అందుకుంటాడు కనుక భోగమూర్తి అనే పేరుతో కూడా పిలుస్తారు. మూడవది ఉత్సవబేరం. ఉత్సవార్చ, ఉత్సవవర్లు అని కూడా పిలుస్తారు. ఆలయంలో జరిగే ఉత్సవాలలో ఈ విగ్రహాలను ఉపయోగిస్తారు. వీటికే కళ్యాణోత్సవం కూడా నిర్వహిస్తారు కనుక కౌతుకబేరం అని కూడా వీటిని పిలుస్తారు.

నాల్గవది స్నపనబేరం. ఆలయంలో విశేషంగా జరిగే అభిషేకం, తిరుమంజనం మొదలైనవి ఈ విగ్రహాలకే నిర్వహిస్తారు. బలిబేరం ఐదవది. ఉత్సవాల్లో బలి మొదలైనవి సమర్పించే సమయంలో ఈ విగ్రహాలు వేంచేస్తాయి. ఇవి ప్రధానమైనవి. ఇవి కాక వైష్ణవాగమాల్లో మూలమూర్తి కాకుండా ఆరు బేరాలను చెప్పడం జరిగింది. వాటిలో నిత్యం రాత్రి కాలంలో స్వామికి చేసే శయనోత్సవంలో శయనబేరాలకు పూజాదికాలు జరుపుతారు. వీటినే శయనార్చ అని అంటారు. తీర్థార్చ అనే మరో బేరం (విగ్రహం) ఉంది. తీర్థవారి మొదలైన ఉత్సవాలకు ఈ విగ్రహాన్ని ఉపయోగిస్తారు. మహోత్సవాల సమయంలో అర్చనలందుకునే విగ్రహాలను మహోత్సవార్చ అంటారు. ఇలా ప్రతి ఆలయంలో ఒకే మూర్తిలోని విశిష్టశక్తి ఉత్సవమూర్తుల పేరిట విరాజిల్లుతోంది. ఏ ఉత్సవమూర్తికి నమస్కరించినా గర్భగుడిలో ప్రధానదైవానికి చేస్తే ఎంత ఫలితముంటుందో, అంతటి అమేయమైన ఫలితం భక్తులకు కలుగుతుంది.
– కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య
ఆగమ, శిల్పశాస్త్ర పండితులు

మరిన్ని వార్తలు