దొరకునా ఇటువంటి సేవ

28 Aug, 2019 08:10 IST|Sakshi

కళారాధకుడు

వృత్తి పరంగా విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌లో సీనియర్‌ మెకానికల్‌ ఫోర్‌మన్‌. ప్రవృత్తిపరంగా చూసుకుంటే మాత్రం ఆయన ఓ దర్శకుడు, పౌరాణిక డ్రామా పాత్రధారి, న్యాయనిర్ణేత, సమాజ సేవకుడు, రచయిత. ఇలా అనేకరకాలైన విధులు నిర్వర్తిస్తున్నారాయన. వృత్తికీ, ప్రవృత్తికీ ఏమాత్రం పొంతన లేదనిపిస్తోంది కదూ... అసలు అతను ఒకప్పుడు పశువుల కాపరి అంటే చిత్రంగా కూడా అనిపిస్తుంది. ఆయనే రమేష్‌ కుమార్‌ శీపాన.. కళా పుష్పాలన్నీ ఒకే మాలగా ధరించిన బహుముఖ ప్రజ్ఞాశాలి.

రమేష్‌కుమార్‌ది శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం, రేగుపాడు. తలిదండ్రులు అప్పలనాయుడు, అనసూయమ్మ. ఐదేళ్ల వయసులో పశువుల కాపరిగా ఉన్న రమేష్‌ కుమార్‌ గొల్లపల్లి గోవిందరావుగారి ద్వారా బాల మార్కండేయుడిగా మొదటిసారి స్టేజీపై నాటకం వేసే అవకాశం పొందారు. దీంతో ఏదైనా విషయం నేర్చుకోవాలన్న కోరిక, ఆసక్తి పెరిగి అతని దగ్గరే హార్మోనియం నేర్చుకుని సంగీతంలో శిక్షణ పొందారు. ఒక్క సంవత్సరంలోనే ఐదో తరగతి వరకు పూర్తి చేశారు. అలా ఏడో తరగతి నుంచి హరికథలు, బుర్రకథలు వేస్తూ వందకు పైగా నాటకాలు వేశారు. 1992లో అరుణ కుమారిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం.

రాష్ట్రంలోనే మొదటిసారి...
విశాఖపట్నంలో కొంతమంది కళాకారులతో కలిసి ‘శ్రీ బాల భారతి భజన మండలి’ స్థాపించి అప్పటి వరకు హార్మోనియంతో సాగుతున్న భజనలను రాష్ట్రంలోనో  మొదటిసారి ఎలక్ట్రానిక్‌ కీ బోర్డు సహాయంతో సాధన చేశారు. అలా ప్రముఖ దేవాలయాల్లో నిర్వహించిన భజన కార్యక్రమాలలో 50కి పైగా బహుమతులు సాధించడం విశేషం. ఉత్తరాంధ్రతో పాటు, తూర్పుగోదావరి జిల్లాలోనూ అనేక కార్యక్రమాలు నిర్వహించి తాను స్వరపరిచిన ‘భక్తి గీతాంజలి పుస్తకం ద్వారా అందరికీ సుపరిచితులయ్యారు. ఇప్పుడు ఒక్క గాజువాకలోనే 30కి నాటక బృందాలు ఏర్పడ్డాయంటే దానివెనక ఆయన కృషి చెప్పలేనిది. ఏడాదిలో సుమారు 80 నుంచి 100 వరకు సంగీత విభావరులు నిర్వహిస్తుంటారు. ఉక్కునగరంలో ఉచితంగా సంగీతం, కీబోర్డు వాయిద్యంపై శిక్షణ ఇస్తున్నారు.

స్వీయరచనలు
2010 ఆగస్టు 29న 500 భక్తి గీతాలతో ‘భక్తి గీతాంజలి’ విడుదల చేశారు ∙2014 నవంబర్‌ 23 న భగవాన్‌ సత్యసాయి జయంతి సందర్భంగా– ‘నీ ఘన సృష్టి నా చిరుదృష్టి’ అనే భక్తి సంకలనాన్ని రచించి, స్వరపరిచిన ఆల్బమ్‌ను పదిమంది సినీ నేపథ్యం ఉన్న ప్రముఖ గాయకుల సమక్షంలో విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి ఆవిష్కరించారు  ‘ధర్మ బాట’ అను శతకాన్ని 2019 ఏప్రిల్‌లో ఆవిష్కరించారు  ‘సుగణ’ అనే కంద పద్యాల శతకం ఆవిష్కరణకు సిద్ధంగా ఉంది ∙స్వర్గీయ అనుపోజు లక్ష్మణరావు రాసిన 18 భక్తి గీతాలను ఆల్బమ్‌ చేశారు ∙గన్నంరాజు సుబ్బారావు రాసిన పాటలను స్వరపరిచారు.

సేవా కార్యక్రమాలు
2007 అక్టోబర్‌13 నుంచి తండ్రి శీపాన అప్పనాయుడు పేరుతో చారిటబుల్‌ ట్రస్ట్‌ ఏర్పాటుచేసి సేవలందిస్తున్నారు ∙25 మందికి ప్రతి నెలా పింఛన్‌ అందజేస్తూ, పదిమందికి నిత్యావసరాలు అందజేస్తున్నారు పాఠశాలలకు బెంచీలు, బీరువాలో, పేద విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ ∙70 ఏళ్లు నిండిన రైతులకు సత్కారాలు, ఆర్థిక సాయం
ఏ పని చేయడానికీ ఆ మాటకొస్తే ఇంటిలో పనులు చూసుకోవడానికి కూడా టైమ్‌ లేదు అని హడావుడి పడేవారు దేనిమీదనైనా సరే ఆసక్తి, చేయాలన్న తపన, పట్టుదల ఉంటే ఏదీ అసాధ్యం కాదని నిరూపించిన రమేశ్‌ కుమార్‌ను ఆదర్శంగా తీసుకోవాలి మరి.– అమ్మోజీ బమ్మిడి, సాక్షి విశాఖపట్నం

మరిన్ని వార్తలు