ఎత్తు పెరగడం ఆగిందా?

6 Mar, 2017 23:38 IST|Sakshi
ఎత్తు పెరగడం ఆగిందా?

పిల్లల్లో ఏదైనా వైద్యపరమైన సమస్య తర్వాత
హోమియో కౌన్సెలింగ్‌


మా బాబు వయసు ఎనిమిదేళ్లు. బరువు పెరగడం లేదు. అలాగే ఎత్తు కూడా పెరగడం లేదు. వాడి వయసులో ఉన్న తోటి పిల్లలతో పోలిస్తే వాడి ఎత్తు చాలా తక్కువ. డాక్టర్‌ సలహా మేరకు ఎక్స్‌–రే, స్కల్, చేతుల పొడవు, థైరాయిడ్‌ పరీక్షలు చేయించాం. అన్నీ నార్మల్‌గా ఉన్నాయి. ఎత్తు పెరగకపోవడానికి కారణం ఏమిటి? హోమియోలో ఎత్తు పెంచే మందులు ఉన్నాయా? – సుధాకర్‌రావు, కోదాడ
ఒక వ్యక్తి తాను ఉండాల్సిన ఎత్తు కంటే తక్కువ ఎత్తు ఉండటాన్ని ‘షార్ట్‌ సాచ్యుర్‌’ కండిషన్‌ అంటారు. ఈ సమస్యతో పిల్లలు, యుక్తవయసులో ఉన్నవారు ఎక్కువగా బాధపడుతుంటారు. తల్లిదండ్రుల జన్యువుల ప్రకారం ఆరోగ్యకరమైన ఎదుగుదల కలిగి ఉండి, వారు తమ తోటి పిల్లల కంటే తక్కువ ఎత్తు కలిగి ఉంటే అది వారి సాధారణ ఎత్తుగానే భావించాలి. అయితే ఒకవేళ ఏదైనా ఆరోగ్య సమస్య కారణంగా ఎదగాల్సిన ఎత్తుకు పెరగకపోవడం అన్న విషయాన్ని సమస్యగా పరిగణించాలి.

కారణాలు
►పుట్టుకతో సంభవించే గుండెవ్యాధులు, మూత్రపిండాల వ్యాధులు, ఆస్తమా, యుక్తవయసులో వచ్చే కీళ్లనొప్పులు, దీర్ఘకాలిక వ్యాధులు.
►పెరుగుదల నెమ్మదిగా ఉండటం
►యుక్తవయసు (ప్యూబర్టీ) నెమ్మదిగా రావడం.
► ౖహె పోథైరాయిడ్‌ సమస్య పుట్టుకకు ముందు నుంచే ఉండటం
► పౌష్టికాహారలోపం
► పెరుగుదలకు కారణమయ్యే హార్మోన్‌ స్రావం తగ్గడం

జాగ్రత్తలు
► సాధారణంగానే తల్లిదండ్రుల ఎత్తు మామూలు ఎత్తు కంటే తక్కువగా ఉండే, వారి జన్యువుల ప్రకారం పిల్లల ఎత్తు కూడా తక్కువగానే ఉంటే దాన్ని సాధారణ ఎత్తుగానే పరిగణించాలి. వారి విషయంలో ఎలాంటి ప్రత్యేకమైన జాగ్రత్త తీసుకోనవసరం లేదు. అలా కాకుండా...
► పిల్లలు తమ వయసులో ఉన్న ఇతరుల కంటే తక్కువ ఎత్తులో ఉన్నా లేదా పెరగడం ఆగిపోయినా డాక్టర్‌ను సంప్రదించాలి.
►పిల్లల ఎత్తు, బరువు, కాళ్లు, చేతుల నిడివి వంటి కొలతలతో ఏదైనా తేడా ఉండటం, వాటిలో పెరుగుదల సరిగా లేకపోవడం వంటివి జరిగాయని అనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాలి.
నిర్ధారణ పరీక్షలు
ఎక్స్‌–రే, సీబీపీ – రక్తపరీక్ష, ఎలక్ట్రొలైట్‌ లెవెల్స్, ఎత్తుకు తగ్గ బరువు ఉన్నారా అని పరిశీలించాల్సి ఉంటుంది.

చికిత్స
ఈ సమస్యకు హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. పిల్లల ఎత్తును, బరువును పరిశీలిస్తే బెరైటా కార్బానికా, తుజా ఆక్సిడెంటాలిస్, కాల్కేరియా ఫాస్ఫారికా మొదలైన మందులు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వీటిని అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణ లో ఈ మందులు వాడాల్సి ఉంటుంది.
డాక్టర్‌ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో)
స్టార్‌ హోమియోపతి హైదరాబాద్‌

ఇంప్లాంట్‌ను తొలగించాల్సిందే..!
అర్థోపెడిక్‌ కౌన్సెలింగ్‌

నా వయసు 29 ఏళ్లు. ఇటీవల జరిగిన ఒక యాక్సిడెంట్‌లో నేను బైక్‌పై నుంచి కింద పడ్డాను. అప్పుడు నా మోకాలు కొద్దిగా వాచింది. చాలా నొప్పిగా ఉంది. ఆ కాలిపై ఎంతమాత్రమూ భారం వేయలేకపోతున్నాను. డాక్టర్‌గారికి చూపిస్తే ఎక్స్‌రే తీశారు. ఫ్రాక్చర్‌ కాలేదని చెప్పారు. అయినప్పటికీ నొప్పి మాత్రం తగ్గడం లేదు. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. – సుకుమార్, విజయవాడ
ఫ్రాక్చర్‌ లేనప్పటికీ నొప్పి తగ్గలేదంటున్నారు, అంటే... మీకు బహుశా మోకాలిలో ఉన్న కీలకమైన లిగమెంట్లు చీరుకుపోయి ఉండవచ్చు. ఇలాంటి గాయాలు బైక్‌ యాక్సిడెంట్లలో చాలా సాధారణంగా జరుగుతుంటాయి. లిగమెంట్లు చీరుకుపోవడం వంటి గాయాలు కొన్నిసార్లు ఎక్స్‌–రేలో కనిపించకపోవచ్చు. దీనికోసం ఎమ్మారై స్కాన్‌ అవసరం. ఇలాంటి గాయాలకు చాలా త్వరగా చికిత్స అందించాలి. ఉద్దేశపూర్వకంగా కాకపోయినా... ఎలాంటి ఫ్రాక్చర్‌ లేదనే అపోహతో చికిత్స ఆలస్యం చేసినట్లయితే మీలాంటి యువకుల్లో  భవిష్యత్తులో అది మరింత సమస్యాత్మకంగా పరిణమించవచ్చు.  వీలైనంత త్వరగా ఆర్థోపెడిక్‌ సర్జన్‌ను సంప్రదించండి.

నా వయసు 24. కుడి ముంజేయి రెండేళ్ల క్రితం విరిగింది. అప్పుడు శస్త్రచికిత్స చేసి మెటల్‌ ప్లేట్లు వేసి, స్క్రూలు బిగించారు. ఇప్పుడు మళ్లీ ఇంకో సర్జరీ చేసి లోపల బిగించి ఉన్నవాటిని తొలగించాలని విన్నాను. ఇలా మరో శస్త్రచికిత్స చేయడం తప్పదా? ఆ మెటల్‌ స్క్రూలను అలాగే ఉంచేసుకుంటే భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా? ఎందుకంటే మళ్లీ ఆపరేషన్‌ అంటే భయంగా ఉంది. – నవీన్‌కుమార్, నిజామాబాద్‌
మీలాంటి ఫ్రాక్చర్‌ కేసులలో ఇలా రెండు ఆపరేషన్లు చేయక తప్పదు. లోపల అమర్చి ఉన్న లోహపు ప్లేట్లు, స్క్రూలను అలాగే వదిలేస్తే దీర్ఘకాలంలో అవి మరికొన్ని ఇతర సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి వాటిని శస్త్రచికిత్స చేసి తొలగించడమే మేలు. ఇది చాలా సాధారణంగా జరిగే ప్రక్రియే. వృద్ధులలో... ‘శస్త్రచికిత్స వల్ల ఇతరత్రా దుష్పరిణామాలు కలిగే అవకాశం ఉండవచ్చు’ అనిపించినప్పుడు మాత్రమే మొదటి ఆపరేషన్‌లో అమర్చిన మెటల్‌ భాగాలను అలాగే వదిలేస్తాం. ఇలాంటి పరిస్థితి అతి కొద్దిమందిలో మాత్రమే ఎదురవుతుంటుంది. ఇక యువకులలో చేతుల పైభాగపు ఎముకల విషయంలో తీవ్రంగా నొప్పి కలిగిస్తుంటే వాటిని అలాగే వదిలేయాల్సి ఉంటుంది. మీరు ముంజేయి అంటున్నారు... కాబట్టి లోపల అమర్చిన ఇంప్లాంట్‌ను తొలగించడమే మంచిది. అలా తొలగించకపోతే వాస్తవ ఎముక మరింత బలహీనపడుతుంది. ఆ స్థితిలో ఆ చేతి మీద ఏ మాత్రం బరువు పడినా విరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు ప్లేటును తొలగిస్తారనే శస్త్రచికిత్స విషయంలో ఆందోళన చెందకండి. ధైర్యంగా సర్జరీకి సిద్ధంకండి.

డాక్టర్‌ కె.సుధీర్‌రెడ్డి చీఫ్‌ ఆర్థోపెడిక్‌ సర్జన్
ల్యాండ్‌మార్క్‌ హాస్పిటల్స్, హైదరాబాద్‌
 

మరిన్ని వార్తలు