డోరిస్‌ లెస్సింగ్‌

3 Jun, 2019 00:08 IST|Sakshi

నోబెల్‌ పురస్కారం పొందిన అత్యంత పెద్దవయసు రచయిత డోరిస్‌ లెస్సింగ్‌ (1919–2013). 2007లో ఈ గౌరవం దక్కినప్పుడు ఆమె వయసు 88 ఏళ్లు. ఆమె రచనా ప్రస్థానం కూడా అంతే సుదీర్ఘమైనది. జీవితకాలంలో సుమారు 30 నవలలూ, 20 కథా సంకలనాలూ, రెండు కవితా సంపుటాలూ వెలువరించారు. ద గ్రాస్‌ ఈజ్‌ సింగింగ్, ద గోల్డెన్‌ నోట్‌బుక్, ద గుడ్‌ టెర్రరిస్ట్‌ ఆమె నవలల్లో కొన్ని. ఐదు భాగాల సైన్స్‌ ఫిక్షన్‌ నవలల సిరీస్‌ కెనోపాస్‌ ఇన్‌ ఆర్గోస్‌ పేరుతో రాశారు. చిల్డ్రెన్‌ ఆఫ్‌ వయొలెన్స్‌ పేరుతో ఐదు నవలల అర్ధ ఆత్మకథాత్మక సిరీస్‌ రాశారు.

యుద్ధానంతరం ఇంగ్లండ్‌లో ఊపిరాడక వాళ్ల నాన్న ఇరాన్‌ వెళ్లిపోయాడు. అక్కడే జన్మించింది డోరిస్‌. తర్వాత ఆయన జింబాబ్వేకు పోయి అక్కడ వ్యవసాయం చేశాడు. పదమూడేళ్ల తర్వాత బడికి పోవడం మానేసి తనే సొంతంగా చదువుకోవడం మొదలుపెట్టింది డోరిస్‌. పదిహేనేళ్లనుంచే నర్సు, టెలిఫోన్‌ ఆపరేటర్‌ లాంటి చిన్న పనులు చేస్తూ రాయడం ప్రారంభించింది. వర్ణ వివక్షకు వ్యతిరేకంగా నిలబడటంతో ఆమె పుస్తకాలు జింబాబ్వేలో నిషేధానికి గురైనాయి. తర్వాత డోరిస్‌ బ్రిటన్‌లో స్థిరపడింది. కమ్యూనిస్టూ, వర్ణ వివక్ష వ్యతిరేకీ అయినందున ఆమె మీద బ్రిటన్‌ గూఢచారుల నిరంతర నిఘా ఉండేది. అణ్వాయుధాల వ్యతిరేకి. హంగెరీ మీద సోవియట్‌ రష్యా దురాక్రమణ తర్వాత కమ్యూనిస్టు పార్టీకి దూరం జరిగింది. 

ఓ సందర్భంలో– కొత్త రచయితలు ప్రచురణకు ఎదుర్కొనే ఇబ్బందులను ప్రత్యక్షంగా చూపడానికి ఆమె తన రెండు కొత్త నవలలను జేన్‌ సోమర్స్‌ కలంపేరుతో ప్రచురణకర్తలకు పంపారు. ఊహించినట్టుగానే అవి ముందు తిరస్కరణకు గురయ్యాయి.

>
మరిన్ని వార్తలు