సూర్యాపేట శర్మగారు

1 Jun, 2020 00:55 IST|Sakshi
గుండేపూడి హనుమత్‌ విశ్వనాథ∙శర్మ 

స్మరణ

సూర్యాపేట ప్రత్యేకత ఏమంటే ఇది నైజామాంధ్ర– బ్రిటిషాంధ్రులను కలిపే సాంస్కృతిక వారధి. అందుకే ఎందరెందరో ఇక్కడ స్థిరపడ్డారు. ఆ పరంపరలోనే 1939లో సూర్యాపేట వచ్చారు శర్మ. ఆంధ్రప్రాంతంలో జరిగిన హైదరాబాద్‌ విమోచనోద్యమంలో ఆనాటి ప్రభుత్వం దేశబహిష్కరణకు గురి చేస్తే, అయ్యదేవర కాళేశ్వరరావు వంటి నాయకుల సలహాతో సూర్యాపేట వచ్చి స్థిరపడ్డారు. మునగాల–జగ్గయ్యపేట కాంగ్రెసు శిబిరాలలో పాత్ర వహించిన శర్మ పూర్తి పేరు గుండేపూడి హనుమత్‌ విశ్వనాథ శర్మ(1914–1992). అభిజనం ఏలూరు.

భానుపుర సాహితీ సమితికి మూడు దశాబ్దాల పాటు ఆయన అధ్యక్షులుగా పనిచేశారు. దీనికి తేజోప్రభ సంపాదకులైన దేవులపల్లి ప్రభాకరరావు కార్యదర్శి. ఇరువురూ ఎన్నో కార్యక్రమాలను జనరంజకంగా నిర్వహించారు. నల్లగొండ జిల్లా గ్రంథాలయ సంస్థకు ఆయన ఆదర్శవంతమైన పనులు చేసిన విషయం మాదిరాజు రామకోటీశ్వరరావు జీవిత చరిత్రలో గమనించవచ్చు. జిల్లా గ్రంథాలయ చరిత్రలో మొట్టమొదటి అధ్యక్షులైనారు. సూర్యాపేట తాలూకా రేపాలలో ఏర్పాటైన ‘జనతా కళామండలి’లో చాలా నాటకాల్లో వివిధ పాత్రలు పోషించి స్థానం నరసింహారావు, జగ్గయ్య వంటివారి ప్రశంసలు పొందారు. స్థానికంగా గాంధీపార్కు ప్రాంగణంలో జరిగే త్యాగరాయ గానసభ వారోత్సవాలను ఘనంగా నిర్వహించేవారు. భువనవిజయాలు, సాంఘిక పౌరాణిక గద్య పద్య నాటకాలు, బుర్ర కథలు, సంగీత కచేరీలు, సాహిత్య సభలు అస్మాదృశులకిప్పటికీ గింగురుమంటున్నాయి. వీటికి స్థానిక వైశ్య సంఘం, యువజనులు తోడ్పడేవారు. ఆ కార్యక్రమాల్లో విశ్వనాథ, ఎన్టీఆర్, కాంతారావు, జమున, భానుమతి వంటి నటులు కూడా పాల్గొన్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మంచి వక్త అయిన శర్మగారు దివాకర్ల, పీవీ నరసింహారావు వంటివారి ప్రశంసలు పొందారు. నాటకాలు, గేయాలు స్వయంగా రచించిడంతో పాటు విశ్వనాథ ‘బద్దన్న సేనాని’, ‘కడిమిచెట్టు’, ‘వీరవల్లడు’ నవలలను ఆంగ్లంలోకి అనువదించారు. అయితే ఇవేవీ మనకు లభించడం లేదు. పరపతి సంఘం అనే వీరి హాస్య వ్యంగ్య కథ ఒకటి తేజోప్రభలో వస్తే అది తనను గూర్చి వ్రాసిందే అని ఆనాటి శాసనసభ్యుడు అల్లరి చేస్తే శర్మగారు ఇంకోరకంగా సర్దిచెప్పినారు.

ఆయన మంచి హస్తవాసి గల వైద్యుడు కూడా. గట్టుసింగారం గ్రామ దేశ్‌ముఖ్‌ గాదె రామచంద్రారావు వ్రణబాధను పక్షం రోజుల్లో నిర్మూలించడాన్ని గురించి అందరూ చెప్పుకునేవారు. సూర్యాపేటలో ఏర్పడిన మొట్టమొదటి పురపాలక సంఘానికి కర్పూరం శ్రీనివాస స్వామి అధ్యక్షులు కాగా, శర్మగారు ఉపాధ్యక్షులుగా పనిచేశారు. రాజకీయాల్లో శర్మ, స్వామి గ్రూపులున్నా అవి ఎవరినీ బాధించలేదు. సూర్యాపేట అభివృద్ధికే కృషి చేసినవి. 

ఆంధ్రా నుండి హైదరాబాద్‌ వచ్చే ఎందరికో పూలసెంటర్‌ వద్దనున్న ఆయన ఇల్లు ఒక విశ్రాంతి గృహం. సాహితీయులు, స్థానికులతో నిండుగా ఉండేది. ఆనాడు మేము చూచిన ఒక సాహిత్యకుటీరం, హనుమన్నిలయం, విశ్వనాథ మందిరం ఈనాడు గుండెలు చెదిరేటట్టు మాయమైంది. భానుపుర సాహితీ సమితిలోని ప్రముఖుల గురించి ఊరె వెంకట నరసింహారావు చెప్పిన సీసమాలికలోని– ‘స్థిరుగుండెపుడి శర్మ చిత్ర విచిత్ర వా/ క్చాతుర్యమయ కథా సంచయంబు’ మననం చేసుకుందాం.
- శ్రీరంగాచార్య

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా