ఆడవలసింది!

15 Jun, 2018 02:10 IST|Sakshi
సౌమ్య స్వామినాథన్‌

భారతీయ ఉమన్‌ గ్రాండ్‌ మాస్టర్‌ సౌమ్య స్వామినాథన్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. అయితే ఆ జల్లులు ‘ఆడబోవడం లేదు’ అని ఆమె ప్రకటించినందుకు కాకుండా, ఆడి ఏదైనా సాధించినందుకు కురుస్తున్నట్లయితే మరింత బాగుండేది.

జూలై 26 నుంచి ఆగస్టు 4 వరకు ఇరాన్‌లోని హమదాన్‌లో ఏషియన్‌ టీమ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు జరుగుతున్నాయి. అక్కడ చాంపియన్‌గా నిలిచిన టీమ్‌ ‘వరల్డ్‌ టీమ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు అర్హత సంపాదిస్తుంది. అయితే భారతీయ ఉమన్‌ గ్రాండ్‌మాస్టర్, ఒకప్పటి వరల్డ్‌ జూనియర్‌ గర్ల్స్‌ చాంపియన్‌ సౌమ్య స్వామినాథన్‌ ఆకస్మిక నిర్ణయంగా తన ఇరాన్‌ ప్రయాణాన్ని మానుకున్నారు!

ఇరాన్‌ సంప్రదాయం ప్రకారం క్రీడాకారిణులు తప్పనిసరిగా తలగుడ్డను (హెడ్‌ స్కార్ఫ్‌) ధరించి ఆటలో కూర్చోవాలన్న నిబంధన తన వ్యక్తిగత స్వేచ్ఛను హరించే విధంగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సౌమ్య ఫేస్‌బుక్‌లో ప్రకటించారు. భారత జట్టు సభ్యురాలిగా సౌమ్య మొదట ఈ పోటీలకు ఆమోదం తెలిపినప్పుడు అవి బంగ్లాదేశ్‌లో జరుగుతున్నట్లు ఆలిండియా చెస్‌ ఫెడరేషన్‌ ఆమెకు తెలిపింది. ఈవెంట్‌ ఇరాక్‌కు మారిందని తెలిసిన వెంటనే సౌమ్య కేవలం ఈ ఒక్క హెడ్‌ స్కార్ఫ్‌ నిబంధన కారణంగానే ఈ పోటీల నుంచి తప్పుకుంటున్నానని తన పోస్ట్‌లో వెల్లడించారు.

సౌమ్య (29) పుణె యువతి. ఇండియాలో నెం.5, వరల్డ్‌లో నెం.95 ర్యాంకు ఉన్న చెస్‌ ప్లేయర్‌. దేశానికే ప్రతిష్ట. అలాంటి అమ్మాయి తన వ్యక్తిస్వేచ్ఛకు చెక్‌ చెప్పుకోలేనని చెప్పి, దేశ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యక్తిగత నిర్ణయం తీసుకోవడంపై భారతీయులు ఇప్పుడేమీ రెండు జట్లుగా విడిపోలేదు! సౌమ్య రైట్‌ అని అంతా ఒక జట్టుగా ఉండి, ఆమెను అభినందిస్తున్నారు.

‘‘నిర్బంధంగా నేను స్కార్ఫ్‌ ధరించలేను. ఇష్టం లేని పని చెయ్యడం అంటే నన్ను నేను అగౌరవ పరచుకోవడం. మనిషిగా నా హక్కును నేనే ఉల్లంఘించుకోవడం. నా గొంతును నేనే నొక్కేసుకోవడం. నా ఆలోచనల్ని నేనే మింగేసుకోవడం. నా మనస్సాక్షిని నేనే మోసం చేసుకోవడం. నా మతాన్ని నేనే తక్కువ చేసుకోవడం. ఇరాన్‌ వెళ్లి ఆడి.. నాకు నేను లేకుండా పోవడం కన్నా, వెళ్లకుండా నాకు నేను మిగిలిపోవడం ముఖ్యం అనుకున్నాను’ అనే అర్థంలో సౌమ్య తన మనోభావాలను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు.

ఏ దేశపు వస్త్ర సంప్రదాయాలు ఆ దేశానికి ఉంటాయి. బయటి నుంచి వచ్చినవారు తమ సంప్రదాయాలను అనుసరించాలని ఆ దేశాలు ఆకాంక్షించడం సహజమే. ఆకాంక్ష వరకైతే ఇబ్బంది లేదు. పట్టింపయితేనే అసౌకర్యంగా అనిపిస్తుంది. ఇరాన్‌లో స్కార్ఫ్‌పై పట్టింపు ఉంది. ఆ దేశ మహిళలు, బయటి దేశాల నుంచి వచ్చిన మహిళలు తప్పనిసరిగా తలను, రెండు చెవుల్నీ కప్పుతూ చున్నీ లాంటి వస్త్రాన్ని చుట్టుకోవాలి.

రోమ్‌లో ఉన్నప్పుడు రోమన్‌లా ఉండాలనే లౌక్యం లాంటిది కాదది. సంప్రదాయానికి వాళ్లు ఇచ్చుకుంటున్న గౌరవం, మర్యాద. విదేశీయుల్ని కూడా వాటిని ఇచ్చిపుచ్చుకోమంటున్నారు. అయితే వ్యక్తికి ఉండవలసిన గౌరవ మర్యాదల మాటేమిటన్నది సౌమ్యలాంటి క్రీడాకారిణుల ప్రశ్న. ‘క్రీడా వేదికను మార్చడంపై ఆలిండియా చెస్‌ ఫెడరేషన్‌ కూడా తన అభ్యంతరాన్ని వ్యక్తం చేసి ఉండవలసిందా?’ అని అమిత్‌ కర్మాకర్‌ అనే మీడియా ప్రతినిధి అడిగినప్పుడు.. ‘ప్రతి ఒక్కరూ నాలాగే అనుకోవాలని నేనెందుకు భావిస్తాను?’ అన్నారు సౌమ్య.


                (నాజీ పైకిడ్జే, మరియా మఝిచెక్, అన్నా మఝిచెక్‌ : హెడ్‌స్కార్ప్‌తో ఆడేందుకు నిరాకరించినవారు )

 


(పద్మినీ రౌత్, హారిక : హెడ్‌స్కార్ఫ్‌తో ఆడివచ్చినవారు)

హెడ్‌స్కార్ఫ్‌ ధరించడం ఇష్టం లేకనే గత ఏడాది టెహ్రాన్‌లో జరిగిన వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో అమెరికన్‌ చెస్‌ క్రీడాకారిణి నాజీ పైకిడ్జే కూడా ఆట నుంచి తప్పుకున్నారు. (అదే ఆటకు మన దేశం నుండి వెళ్లిన హారిక, పద్మినీ రౌత్‌ చక్కగా తల చుట్టూ వస్త్రాన్ని కప్పుకుని చెస్‌ బోర్డు ముందు కూర్చున్నారు). సౌదీ అరేబియాలో జరిగిన ప్రీమియర్‌ టోర్నమెంట్‌కు ఉబ్జెకిస్తాన్‌ నుంచి ఎంపికైన ఇద్దరు అక్కచెల్లెళ్లు అన్నా మఝిచెక్, మరియా ముఝిచెక్‌ కూడా స్కార్ఫ్‌తో ఆడేది లేదని ఆట నుంచి నిష్క్రమించారు.

‘‘టీమ్‌ డ్రెస్, ఫార్మల్స్, స్పోర్ట్స్‌ డ్రెస్‌ వీటిని ధరించాలని చాంపియన్‌షిప్‌ నిర్వాహకులు అనడంలో అర్థం ఉంది. కానీ మతపరమైన వస్త్రధారణను నిబంధనగా పెట్టడం ఏమిటి?!’ అని సౌమ్య ఆవేదన. ఈ ఆవేదన అసంబద్ధమని ఎక్కడా ఒక్క కామెంట్‌ కూడా రాలేదు. మతాలకు, జాతీయతలకు అతీతులైన ఒకరిద్దరు శుద్ధ సంప్రదాయవాదులు మాత్రం ‘స్కార్ఫ్‌ కట్టుకుని ఆడితే ఏం పోయిందీ పిల్లకు!’ అని ఆశ్చర్యపోయారు. స్పోర్టివ్‌గా తీసుకోవడం అది.

సౌమ్య కూడా హెడ్‌స్కార్ఫ్‌ నిబంధనను తేలిగ్గా తీసుకుని (స్పోర్టివ్‌గా)  ఆడి రావచ్చు. లౌకిక భాషలో ఈ స్పోర్టివ్‌నెస్‌కు అర్థం ‘పర మత సహనం’. మతపరమైన దేశంలో మతానికి ప్రాధాన్యం ఉన్నట్లే.. లౌకికరాజ్యంలో పర మత సహనం ఉంటుంది. దేశంలో ఉన్నవాళ్లతో కలిసి ఉండడం మాత్రమే కాదు, దేశం వెళ్లినప్పుడు అక్కడివాళ్లతో కలిసిపోవడం కూడా పర మత సహనమే. కాబట్టి ఒక లౌకికరాజ్య పౌరురాలిగా సౌమ్య హెడ్‌స్కార్ఫ్‌ కట్టుకుని ఆడి వస్తే తప్పేం అవదు. ఆటల్ని, మతాన్ని కలిపిచూడ్డం సరికాదని సౌమ్య అంటున్నారు. రైట్, ఆ దేశం కలిపి చూసింది. ఒక క్రీడాకారిణిగా తను చేసిందీ అదే! మతం నుంచి ఆటను వేరు చేసి చూడలేకపోవడం. అందువల్లనే కదా తను ఆట నుంచి విరమించుకున్నారు!!

- మాధవ్‌ శింగరాజు

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు