వాణిగా వచ్చి.. వీణగా మారి..!

11 Nov, 2018 00:33 IST|Sakshi

అతి చిన్న వీణ మీద సంగీతం పలికించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు శ్రీవాణి. వీణను అందరికీ చేరువ చేయాలనే లక్ష్యంతో పలు భారతీయ భాషలలోని పాటలతో పాటు పాశ్చాత్య సంగీతాన్ని సైతం వీణ మీద ఒలికిస్తున్నారు. తాజాగా శ్రీవాణి.. ‘బ్రీత్‌లెస్‌’ (శంకర్‌మహదేవన్‌) సాంగ్‌కు తన వేళ్లతో పునఃప్రతిష్ఠ చెయ్యడం సంచలనం అయింది. ఆమెపై ప్రశంసలు కురిపిస్తోంది.


ప్రపంచ ప్రసిద్ధి చెందిన వీణ చిట్టిబాబుగారి శిష్యురాలు పిచిక సీతామహాలక్ష్మి గారి దగ్గర.. చిన్నతనంలోనే శ్రీవాణి వీణకు అంకురార్పణ జరిగింది. శ్రీవాణి స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా నందంపూడి. ‘‘మా అమ్మగారికి సంగీతం మీద ఉన్న శ్రద్ధ, అభిలాష కారణంగా నాకు వీణ నేర్పించారు. నా అసలు పేరు సత్య వాణి. సరస్వతీ కటాక్షంతో వీణ నేర్చుకున్నాక నా పేరు శ్రీవాణిగా మార్చుకున్నాన’’ని చెప్పారు శ్రీవాణి.

వీణలో డిప్లొమా పూర్తి చేశారు శ్రీవాణి. ఆ తరవాత హైదరాబాద్‌ అబ్బాయి వేణుతో ఆమె వివాహం జరిగింది. స్కూల్‌లో చదువుకునే రోజుల్లోనే శ్రీవాణి ఆర్‌ఆర్‌బీ పరీక్ష రాశారు. రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించారు. రెండు సంవత్సరాలు శిక్షణ పొందాక, ఉద్యోగం మానేసి, సంగీతం మీదే దృష్టి సారించారు. పదహారేళ్ల పాటు టీవీలో యాంకరింగ్‌ చేసి మానేశారు. అందుకు కారణాలు, అనంతర పరిణామాలు శ్రీవాణి మాటల్లోనే విందాం.

ఎప్పుడు ఆపేస్తానా అని చూశారు!
‘ఈ పని నువ్వు చేయలేవు’ అంటే, పట్టుదలతో సాధించడం నా లక్షణం. 2014లో రెండు మూడు సంఘటనలు నా జీవితంలో నేను నిర్ణయాలు తీసుకునేలా చేశాయి. ఒక గెట్‌టుగెదర్‌లో అందరూ రకరకాల యాక్టివిటీస్‌ చేశాక, నేను వీణ వాయిస్తుంటే, అందరూ ‘ఎప్పుడు ఆపేస్తానా’ అన్నట్లు చూశారు. అది నా మనసుకి బాధ కలిగించింది.

ఒకసారి ఒక చోట వీణ కచేరీ చేసి, చేతితో వీణ పట్టుకుని ఇంటికి వస్తుంటే, డిగ్రీ చదువుతున్న ఒక అబ్బాయి ‘ఇది గిటారేనా’ అని అడిగాడు. తెలుగునాట వీణ కనుమరుగైపోతుందేమో అనిపించింది. అమెరికాలో ఉండే మా మేనల్లుడు... లెర్నింగ్‌ స్టేజ్‌లో ఉన్న ఒక అమ్మాయి వాయించిన పాటను నాకు పంపి, ‘నువ్వు కూడా ఇలా వాయించాలి’ అన్నాడు. నాకు కోపం వచ్చింది. ఈ మూడు సంఘటనలు నాకు నిద్ర లేకుండా చేశాయి. ఎలాగైనా ఏదో ఒకటి సాధించాలనే పట్టుదలను పెంచాయి.  

కొత్త జీవితం ప్రారంభం
మొట్టమొదటగా దళపతి చిత్రంలోని ‘సింగారాల... ’ పాటను వీణ మీద వాయించి, అప్‌లోడ్‌ చేసిన రెండు రోజులకే లక్షలలో వ్యూస్‌ వచ్చేశాయి. ఆ ఉత్సాహంతో చంద్రముఖి చిత్రంలోని ‘వారాయ్‌.. ’,  ‘కత్తుల బల్లెము చేతబట్టి..’  అనే పెద్దపులి జానపద పాట వాయించి అప్‌లోడ్‌ చేశాను. పెద్దపులి పాట బాగా సెన్సేషన్‌ అయ్యింది. లక్షలలో వ్యూస్‌ వస్తుండటంతో తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లిషు, మలయాళం.. అన్ని భాషలలోని పాపులర్‌ పాటలను అభిమానుల కోరిక మీద వాయించడం ప్రారంభించాను.

ప్రపంచ రికార్డు
కినాకు అనే వీణ తయారీదారుడు చిన్న వీణ చేసి ఇచ్చి, దాని మీద వాయించమని కోరారు. సాధన ప్రారంభించాను. వీణను శృతి చేసేటప్పుడు చేతి వేళ్లు బొబ్బలెక్కాయి. పావు గంట వాయించేటప్పటికి ముక్కోటి దేవతలు కనిపించారు. మహాగణపతిం, తందనానా (సెమీ క్లాసికల్‌), మాయదారి మైసమ్మ (మాస్‌)... వంటివి వాయించి ప్రపంచ రికార్డు సాధించాను. ఇటీవలే శంకర్‌ మహదేవన్‌ గాత్రంలో ప్రసిద్ధి చెందిన ‘బ్రెత్‌లెస్‌’ను వీణ మీద పలికించి ప్రశంసలు అందుకున్నాను. నేనేమీ విద్వాంసురాలిని కాను, చాలా చిన్న కళాకారిణిని, వీణ అంతరించిపోకూడదనే లక్ష్యంతోనే ఈ కొత్త పొంతలోనే ముందుకు వెళ్తున్నాను. పెద్ద విద్వాంసుల ముందు నేను అణుమాత్రురాలిని మాత్రమే’’ అని అన్నారు శ్రీవాణి.

అంతా మంచే జరిగింది
జీ బంగ్లా వారు చూపిన ఆదరణ నేటికీ మరచిపోలేను. నేను రెండోసారి ‘జీ’కి వెళ్లినప్పుడు ఆనందంగా అనిపించింది. సుకుమార్‌ గారి కోరిక మేరకు ‘రంగస్థలం’ చిత్రంలోని పాట వాయించాను. రామ్‌చరణ్‌ నా పాటలు షేర్‌ చేస్తున్నారు. అమెరికన్‌ వెబ్‌ సైట్ల వాళ్లు, నేను వాయించిన టైటానిక్‌ మ్యూజిక్‌ని విని నన్ను ‘క్వీన్‌ ఆఫ్‌ ద ఈస్ట్‌’ అన్నారు. 

నా స్థాయికి నా పేరు ఖండాంతరాలు దాటడం ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. కొన్ని కొన్ని సినిమాలకు పనిచేశాను. మణిశర్మ, ఆర్‌పి పట్నాయక్‌లకు ఆర్సెస్ట్రాలో వాయించాను. ప్రపంచ ప్రఖ్యాత ఘట వాద్య కళాకారుడు విక్కువినాయక్‌రామ్‌ చేతుల మీదుగా వీణ లెజెండ్‌ పురస్కారం అందుకున్నాను. ఈ మాత్రమైనా సాధించానంటే మా వారు వేణు అందిస్తున్న సహకారమే. మాకు ఒక పాప. పుష్కరిణి. – శ్రీవాణి, వీణ కళాకారిణి, హైదరాబాద్‌


– సంభాషణ: వైజయంతి పురాణపండ

మరిన్ని వార్తలు