మొక్క నాటే యంత్రం!

22 Oct, 2019 20:35 IST|Sakshi
యంత్రంతో పొగ మొక్కలను నాటుతున్న కూలీలు

వర్జీనియా పొగాకు సాగు అధిక పెట్టుబడితో కూడిన వ్యవహారం. కూలీలతో మొక్కేత వేయిస్తే ఎకరానికి ఎనిమిది మంది వరకు కూలీలు అవసరం. అచ్చు, సాలు, ఇరువాలు, కాలువలు తీయించడం.. అన్నిటికీ కలిపి ఎకరానికి రూ.5 వేల నుంచి రూ. 6 వేల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తున్నది. పైగా కూలీల కొరత నేపథ్యంలో నాట్లు పూర్తి కావడానికి చాలా రోజులు పడుతోంది. 

ఈ నేపథ్యంలో ఐటీసీ, మహీంద్రా కంపెనీలు పొగ మొక్కలు నాటే యంత్రాన్ని రైతులకు అందుబాటులోకి తెచ్చాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం ఊట్లపల్లి సమీపంలోగల తిమ్మాపురం వద్ద ఉన్న కొడవాటి వాసు రైతు పొలంలో ఇటీవల మొక్కలు నాటి, ఈ విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. దీనిద్వారా మొక్కేత ఖర్చు తక్కువ. సమయాన్ని కూడా ఆదా చేసుకోవచ్చు. ట్రాక్టర్‌ వెనుక అమర్చిన ఈ యంత్రం ద్వారా ట్రే పద్ధతిలో పెంచిన పొగాకు మొక్కలను రోజుకు 5 ఎకరాల్లో నాట్లు వేసుకోవచ్చు.

యంత్రంతో నాటిన పొగ మొక్కలు 

ఈ యంత్రం ద్వారా మొక్క నాటడం, మొక్క మొదలు దగ్గరకు మట్టిని ఎగదోసి వత్తడంతోపాటు ప్రతి మొక్కకు 300 మిల్లీ లీటర్ల నీటిని అప్పటికప్పుడే పోయవచ్చు. ఈ యంత్రాన్ని నడిపేందుకు ట్రాక్టర్‌ డ్రై వర్‌తోపాటు నలుగురు కూలీలు ఉంటే చాలు. గంటకు 1,500 మొక్కల చొప్పున రోజుకు ఐదెకరాల్లో మొక్కలు నాటుకోవచ్చు. ఈ యంత్ర సాయంతో నాటేసేందుకు పొలంలో దుక్కి, అచ్చు ఇరువాలు, కాలువ తీయాల్సిన అవసరం లేదు. అలాగే కలుపు తీసే పని కుడా ఉండదు. కూలీల ఖర్చు, సమయాలతోపాటు సాగు నీటిని కూడా ఆదా చేసుకోవచ్చు. దాంతో వర్జీనియా పొగాకు రైతులు ఈ యంత్రంపై ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఖరీదైన ఈ యంత్రాన్ని రైతులు కొనుగొలు చేయాలంటే కష్టం. మండలానికో యంత్రాన్ని ఐటీసీ ద్వారా ఉచితంగా అందుబాటులో ఉంచితే మేలని రైతులు కోరుతున్నారు. 
– ఎం.డి. ముజాఫర్‌ ఖాన్, సాక్షి,అశ్వారావుపేట రూరల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

మరిన్ని వార్తలు