వీస్వావా షింబోర్‌స్కా (గ్రేట్‌ రైటర్‌)

20 May, 2019 00:28 IST|Sakshi

 

సామాన్యమైన రోజువారీ విషయాల ఊతంతోనే చరిత్రను చెప్పడం వీస్వావా షింబోర్‌స్కా(1923–2012) ధోరణి. తెలియకుండానే మన జీవితాలు రాజకీయాలతో ఒరుసుకుపోతాయనీ, అయినా తనవి రాజకీయ కవితలు కావనీ, వ్యక్తులూ జీవితం గురించేనని అంటారు. ఈ పోలండ్‌ కవయిత్రి నిండా 350కి మించని కవితలతోనే ప్రపంచాన్ని ఆకర్షించారు. ‘పీపుల్‌ ఆన్‌ ఎ బ్రిడ్జ్‌’, ‘వ్యూ విత్‌ ఎ గ్రెయిన్‌ ఆఫ్‌ సాండ్‌’, ‘మిరకిల్‌ ఫెయిర్‌’, ‘మోనోలోగ్‌ ఆఫ్‌ ఎ డాగ్‌ ’, ‘ఇనఫ్‌’ ఆమె కవితాసంపుటాల్లో కొన్ని. వెయ్యిమందిలో ఇద్దరికి కూడా పట్టని కళ అని ఆమె కవిత్వం గురించి వాపోయినా ఆమె పుస్తకాలు బాగానే అమ్ముడుపోయేవి. 1949లో ఆమె తొలి పుస్తకం సామ్యవాద ప్రమాణాలను అందుకోని కారణంగా ప్రచురణకు నోచుకోలేదు. తొలుత కమ్యూనిస్టుగా ఉన్న వీస్వావా క్రమంగా ఆ పార్టీకి దూరం జరిగారు. సంపాదకురాలిగా పనిచేశారు. అనువాదకురాలు కూడా. భర్త(కవి ఆదం వోదెక్‌)తో విడిపోయినా ఆయన మరణించేంతవరకూ స్నేహంగానే ఉన్నారు. పిల్లలు లేరు. కవినని బడాయి పోవడం గానీ, కవిత్వం గురించి మాట్లాడటం గానీ ఆమెకు చేతనయ్యేది కాదు. అందుకే ఆమెకు 1996లో నోబెల్‌ బహుమతి ప్రకటించగానే ఆమె స్నేహితులు ‘స్టాక్‌హోమ్‌ ట్రాజెడీ’ అని జోక్‌ చేశారు; ఆమె జీవితకాలం మొత్తంలో ఇవ్వనన్ని ఇంటర్వ్యూలు ఆ ఒక్క నెలలోనే ఇవ్వాల్సి వస్తున్నందుకు.

మరిన్ని వార్తలు