అక్కమహాదేవి వచనములు

17 Jun, 2019 00:29 IST|Sakshi

ప్రతిధ్వనించే పుస్తకం

గాలిలో సువాసన యుండగ
పూలచింత ఇంకెందు కయ్యా?
క్షమ దయ శాంతి ఓర్పులున్న
సమాధి చింత ఇంకెందుకయ్యా!
లోకమే తానైన పిదప
ఏకాంతపుచింత ఇంకెందుకయ్యా!
చెన్నమల్లి కార్జునయ్యా!

బసవేశ్వరుని వీరశైవ బోధనలు మారుమోగుతున్న 12వ శతాబ్దంలో జన్మించింది అక్కమహాదేవి. పుట్టిల్లు కర్ణాటక. మెట్టినిల్లు శ్రీశైలం. చెన్నమల్లికార్జునుడినే తన భర్తగా భావించుకుని, కుటుంబ బంధాలన్నీ త్యజించి, శ్రీశైలం వచ్చి కొండగుహలో తపస్సు చేసుకుంటూ గడిపింది. 

మాకు మా లింగము చింత
మాకు మా భక్తుల చింత
మాకు మా ఆద్యుల చింత
మాకు మా చెన్నమల్లికార్జునుని చింత
లోకులచింత మాకెందు కన్నా
అక్కడే తన అంతరంగంలోంచి పొంగిపొరలిన వచనాలను పలికింది. అటు గద్యము ఇటు పద్యముగాని భావ గీతాలు ఈ వచనాలు. వీటిల్లో ఆత్మ విశ్లేషణ ఎక్కువ. వేదన, నివేదన వీటిల్లోని ప్రధాన గుణాలు. కన్నడంలోని ఆ వచనాలను రేకళిగె మఠం వీరయ్య తెలుగులోకి అనువదించారు. 1982 వచ్చిన ఆ పుస్తకాన్ని తెలంగాణ సాహిత్య అకాడమి ఇటీవల పునర్ముద్రించింది. 

తెలియనివారితో చెలిమ చేసిన
రాళ్లను గొట్టి మిరుగుళ్లను తీసి నట్టులయ్యా!
తెలిసినవారితో చెలిమి చేసిన
చల్లను చిలికి వెన్నను దీసినట్టులయ్యా!
చెన్నమల్లికార్జునా మీ శరణులతో చెలిమి
కర్పూరము గిరిని జ్వాలలు మ్రింగి నట్టులయ్యా!

ఇందులో 343 వచనాలున్నాయి. వెల: 100. ప్రతులకు: తెలంగాణ సాహిత్య అకాడమి, రవీంద్రభారతి ప్రాంగణం, హైదరాబాద్‌–4. ఫోన్‌: 040–29703142

మరిన్ని వార్తలు