రుచించని పేరు

29 Jan, 2019 00:16 IST|Sakshi

కష్టారెంట్‌

మంచి ఉద్దేశంతోనే ఆమె తన హోటల్‌కి ఆ పేరు పెట్టుకున్నారు. అయితే హోటల్‌లోని పదార్థాలను ఇష్టపడినంతగా ఆ హోటల్‌ పేరును స్థానికులు ఆస్వాదించలేకపోయారు.

కరెలీన్‌ కెర్‌కు కష్టకాలం మొదలైంది! పాపం ఆవిడ, చక్కగా నడుస్తున్న తన రెస్టారెంట్‌ను విధిలేని పరిస్థితుల్లో వచ్చేవారం మూసి వేయవలసి వస్తోంది. గత రెండేళ్లుగా ఆమె తన రెస్టారెంట్‌లో చక్కగా వేయించిన రుచికరమైన చేపముక్కల్ని, కరకరలాడే బంగాళా దుంపల చిప్స్‌ని కస్టమర్స్‌కి సర్వ్‌ చేస్తూ, పేరుతోపాటు డబ్బునూ గడించారు. ఇప్పుడిక బోర్డు తిప్పేయడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. మహిళా హక్కుల సంఘాలవారు కరెలీన్‌ ఆ రెస్టారెంట్‌ను పెట్టినప్పటి నుంచి, మరీ ముఖ్యంగా గత మూడు నెలల నుంచి ఆ రెస్టారెంట్‌ పేరుకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. చివరికి వారి పోరాటం ఫలించి, వెంటనే బోర్డును తొలగించి, వేరే పేరు పెట్టుకోవాలని కోర్టు ఆమెను ఆదేశించింది. దాంతో ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో ఉన్న ఆ రెస్టారెంట్‌ ప్రపంచవ్యాప్తం విశేషం అయింది. కరెలీన్‌ రెస్టారెంట్‌ పేరు ‘బ్యాటర్డ్‌ వైఫ్‌’. ‘తన్నులు తింటుండే భార్య’ అని ఈ మాటకు అర్థం. రోజూ ఇంట్లో చావుదెబ్బలు తినే ఆడవాళ్లను ఈ బోర్డు పరిహసించేలా ఉందని హక్కుల సంఘాల వాదన. అయితే, ‘‘భర్తల్లో ఆలోచన రేకెత్తించి, వారిలో పరివర్తన తెచ్చేందుకే ఈ పేరు పెట్టాను తప్ప వేరే ఉద్దేశం లేదని’’ కరెలీన్‌ చెబుతూ వస్తున్నారు.

ఈ నేపథ్యంలో గృహ హింసపై మూడు నెలల క్రితం విడుదలైన ఒక నివేదిక మహిళా కార్యకర్తల వాదనకు బలం చేకూర్చింది. ఆస్ట్రేలియాలోని ప్రతి ఆరుగురు మహిళల్లో ఒకరు గృహ హింసకు గురవుతున్నారని నివేదిక సారాంశం. ఇంత జరుగుతుంటే ఒక హోటల్‌కు ఇలాంటి పేరేమిటని మహిళా హక్కుల ఉద్యమకారులతో పాటు, వారి వల్ల ప్రభావితం అయిన నాయకులూ కరెలీన్‌కు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిపారు. చివరికి అనుకున్నది సాధించారు. వారం లోపు రెస్టారెంట్‌ పేరు మార్చాలని స్థానిక కోర్టు ఒకటి జారీ చేసిన ఉత్తర్వులు కరెలీన్‌కు గత మంగళవారం అందాయి. ‘‘నేనెంత దుఃఖంలో ఉన్నానో చెప్పలేను. నా రెస్టారెంట్‌ పేరును వెంటనే మార్చడం కుదరదు కనుక రెస్టారెంట్‌నే మూసి వేస్తున్నాను. ఇందుకు నన్ను నా కస్టమర్‌లు క్షమించాలి’’ అని కరెలీన్‌ సోషల్‌ మీడియాలో ఒక పోస్ట్‌ కూడా పెట్టారు. మన ఉద్దేశం మంచిదే అయి ఉండొచ్చు. ఆ ఉద్దేశానికి విరుద్ధమైన అర్థం వస్తుంటే కనుక తప్పు మనదే అవుతుంది.  

మరిన్ని వార్తలు