అరటి పువ్వులా ఉండ కూడదు!

28 Oct, 2018 01:12 IST|Sakshi

దేవదత్తుడు ఒక యువరాజు. చిన్ననాటినుంచి బుద్ధుని పట్ల దేవదత్తుడు శత్రుభావంతో ఉండేవాడు. చిన్నప్పుడు బాణాలతో దేవదత్తుడు హంసను కొడితే, దాన్ని బుద్ధుడు సంరక్షించి, ప్రాణం కాపాడాడు. ఆ హంస నాదంటే నాదని దేవదత్తుడు సిద్ధార్థునితో వాగ్వివాదానికి దిగాడు. ‘ప్రాణం తీసిన వానిది కాదు. ప్రాణం పోసిన వానిదే హంస’ అని, ఆ హంసను తీసుకుని, గాయాలు మానేలా చేసి, తిరిగి ఆకాశంలోనికి వదిలి పెట్టాడు సిద్ధార్థుడు.

వారు పెరిగి పెద్దవారయ్యాక, బుద్ధుడు బౌద్ధసంఘాన్ని స్థాపించి విశేష గౌరవ సత్కారాలు పొందడం చూసి తానూ బౌద్ధసంఘంలో చేరాడు దేవదత్తుడు. కొన్నాళ్లకి బౌద్ధసంఘంలో తనకే అగ్రస్థానం లభించాలని, తానో నాయకుణ్ణి కావాలని పట్టుబట్టాడు దేవదత్తుడు. సంఘం అంగీకరించక పోవడంతో మగధ యువరాజు అజాత శతృపంచన చేరి ‘నీవు నీ తండ్రిని చంపి రాజువుకా. నేను బుద్ధుణ్ణి చంపి బౌద్ధసంఘం నాయకుణ్ణవుతాను’ అని నూరిపోస్తాడు.

అజాతశతృ దేవదత్తుని మాటలు నమ్మి, అతణ్ణి ఆదరిస్తాడు. ఈ విషయం శిష్యులు బుద్ధునితో చెబుతారు. అప్పుడు బుద్ధుడు –‘భిక్షువులారా! దుష్టునికి దక్కే గౌరవ సత్కారాలు అరటిచెట్టు పువ్వు లాంటివి. వెదురుచెట్టు పుష్పం లాంటివి. ఎండ్రకాయ గర్భం లాంటివి. ఒక్కపువ్వుతోనే అరటిచెట్టు అంతరిస్తోంది. తన నాశనాన్ని తాను తెచ్చుకుంటుంది. పీతకి గర్భమే దాని చావుని ప్రసాదిస్తుంది’ అని చెప్పాడు.

‘‘నిజమే, మామిడిచెట్టు పుష్పించి, ఫలాలనిస్తుంది కానీ అంతరించదు. మరలా చిగురించి, మరలా ఫలాలను ఇస్తూనే ఉంటుంది. అది ఎప్పుడూ గౌరవ సత్కారాలు పొందుతూనే ఉంటుంది. కానీ అరటిచెట్టు పుష్పించి, గెలవేసి అంతరిస్తుంది. ఒక్కకాపుతోనే దాన్ని నరికేస్తారు. దుశ్శలుడు పొందే గౌరవ సత్కారాలు ఇలాటివే కదా!’’ అనుకున్నారు అతిథులు.
బుద్ధుడు చెప్పినట్టే, ఆ తర్వాత అజాత శతృవుకి దూరమై, ఒంటరిగా మిగిలి దైన్యంగా ప్రాణాలు పోగొట్టుకున్నాడు దేవదత్తుడు.

– డా. బొర్రా గోవర్ధన్‌

మరిన్ని వార్తలు