ఆ గౌరవం... అనుభవానికే!

26 Aug, 2018 01:19 IST|Sakshi

ఒక అడవిలో ఏనుగు, కోతి, తిత్తిరి పిట్ట స్నేహంగా జీవిస్తున్నాయి. ప్రతిరోజూ మూడూ ఒకచోట చేరి సాధక బాధలు చెప్పుకునేవి. తాము గడించిన అనుభవాలు పంచుకునేవి. ఒకరోజున వాటికి ఒక ఆలోచన వచ్చింది. మన ముగ్గురిలో జ్ఞానులు ఎవరు? పెద్ద ఎవరు? పెద్దవారు ఎవరైతే వారికి మిగిలిన ఇద్దరూ నమస్కరించాలి. గౌరవించాలి’’ అని అనుకున్నాయి. అప్పుడు ఏనుగు– ‘‘మీ ఇద్దరికంటే నేనే పెద్దను. గౌరవనీయుడను. ఎందుకంటే ఇదిగో ఈ మర్రిచెట్టు ఇప్పుడు మహావృక్షంగా ఉంది. కానీ ఈ చెట్టు చిన్న మొక్కగా ఉన్నప్పుడే నాకు తెలుసు. నేను ఆ మొక్క మీదినుండి నడిచిపోయేవాణ్ణి. అప్పుడు దాని చివరి కొమ్మలు నా పొట్టకు తాకుతూ ఉండేవి’’అని చెప్పింది.

ఆ మాటలు విన్న కోతి –‘‘ఓ! మిత్రమా! అలాగా! ఐతే విను. ఈ చెట్టు చిన్న మొక్కగా ఉన్నప్పటినుంచే నాకు తెలుసు. నేను కూర్చొని దీని చిగుర్లు తినేదాన్ని. కాబట్టి నేనే పెద్దను. నన్నే గౌరవించాలి’’అంది. ఆ రెండింటి మాటలు విన్న తిత్తిరి పిట్ట నవ్వుతూ –‘‘మిత్రులారా! ఈ చెట్టుకు తల్లి వృక్షం నదీతీరం ఆవల గట్టున ఉంది. దాని కాయలు తిని, ఇటుగా వచ్చి ఇక్కడ రెట్ట వేశాను. అందులోని విత్తనమే ఈ చెట్టుగా మొలిచింది’’అంది.

మిగిలిన రెండూ ఆశ్చర్యపడి– మిత్రమా! మా ఇద్దరికీ ఈ ఒక్క చెట్టే తెలుసు. నీకు ఈ చెట్టు, దాని ముందరి తరం చెట్టూ కూడా తెలుసు. తరతరాల అనుభవం నీది. కాబట్టి నీవే గౌరవనీయుడవు’’అని తిత్తిరికి నమస్కరించాయి. బుద్ధుడీ కథ చెప్పి– ‘‘భిక్షువులారా! పెద్దల్ని మనం అందుకే గౌరవించాలి. మనం వారికి ఇచ్చే గౌరవం వారి వయస్సుకే కాదు, అనుభవానికి’’ అని చెప్పాడు.

– డా. బొర్రా గోవర్ధన్‌

మరిన్ని వార్తలు