మనోసాధన

23 Sep, 2018 01:42 IST|Sakshi

మనిషి చేసే కర్మలన్నింటికీ కారకం, ప్రేరకం మనస్సే. అయితే, అది అతి చంచలం. దాన్ని అదుపు చేయడానికి, పొదుపుగా వాడుకోవడానికి, మంచిగా తీర్చిదిద్దుకోవడానికి చాలా సాధన కావాలి. ఆ సాధనే బౌద్ధంలోని అష్టాంగమార్గం. మనస్సుకు ఎలా సాధన ఇవ్వాలి? అని బుద్ధుని అడిగాడు కేశి అనే వ్యక్తి. కేశి మంచి గుర్రపు రౌతు. అప్పుడు బుద్ధుడు ‘‘కేశీ! నీవు మంచి గుర్రపు రౌతువు కదా! నీవు నీ గుర్రాన్ని ఎలా మచ్చిక చేస్తావు?’’ అని అడిగాడు. ‘‘భగవాన్‌! నేను ముందు చాలా మృదువుగా శిక్షణ ఇస్తాను’’ అన్నాడు కేశి.

‘‘మరి ఎన్నిసార్లు మృదువుగా చెప్పినప్పటికీ వినకపోతే ఏం చేస్తావు?’’ ‘‘భగవాన్‌! అప్పుడు కఠినంగానే శిక్షణ  ఇస్తాను. మళ్లీ మళ్లీ చేయిస్తాను’’ ‘‘నీవు ఎంత శిక్షణ ఇచ్చినా అది నీ దారికి రాకపోతే ఏం చేస్తావు?’’ ‘‘భగవాన్‌! చంపి వంటశాలకు పంపుతాను’’ ‘‘కేశీ! నేను కూడా అంతే! మనిషినిలోని మనస్సుకు శిక్షణ ఇస్తాను. నా దగ్గరకు వచ్చిన వారి మనసుల్ని అకుశలాల నుండి కుశలంవైపు మళ్లేలా చేస్తాను. నా శిక్షణ ఎప్పుడూ ఎప్పుడూ మృదువుగానే ఉంటుంది. కొందరి మనస్సు కరడు గట్టి ఉంటుంది.

అలాంటి మనస్సుకు కాస్త కఠినంగానే శిక్షణ ఇస్తాను. ఇక ఎన్ని చెప్పినా, ఎంత చెప్పినా వినని వారిని నీవు గుర్రాన్ని చంపినట్లు మాత్రం చంపను. నా ధర్మంలో, నా మార్గంలో హింసకు తావులేదు. పదే పదే ప్రయత్నిస్తాను’’ ‘‘కేశీ! మనం మనస్సును రౌతు గుర్రాన్ని అదుపులో ఉంచేట్టు అదుపులోనే ఉంచుకోవాలి. నీవు గుర్రాన్ని దారిలోకి తెచ్చుకోడానికి ఎలా శిక్షణ ఇచ్చావో, సాధన చేశావో, నీ మనస్సు విషయంలో కూడా అలాగే సాధన చేయి’’ అని చెప్పాడు. కేశి ఆ మార్గాన్ని పాటించి, అతి తక్కువ సమయంలో మనోసాధనలో మేటిగా నిలిచాడు.

– డా. బొర్రా గోవర్ధన్‌

మరిన్ని వార్తలు