ఆ జీవితమే ఒక పుస్తకం

28 Oct, 2018 01:06 IST|Sakshi

భగవంతుడు మనిషికి మాత్రమే ఇచ్చిన విశేషాలు మూడు. 84 లక్షల జీవరాశుల్లో  ఏ ఇతర ప్రాణికీ ఇవ్వనివి ఇవి. మొదటిది – వాక్కు.  దీనిని ఒక మనుష్య ప్రాణికే ఇచ్చాడు. మాటల ద్వారా ఎంత కష్టంలో ఉన్నవారినయినా ఓదార్చవచ్చు. చెడుదార్లు మళ్ళుతున్నవారిని మంచిదారిలో పెట్టవచ్చు. అవతలివాడి అజ్ఞానాన్ని పోగొట్టవచ్చు. ఎక్కడ మాట్లాడాలో అక్కడ గంగాప్రవాహంలో మాట్లాడాలని భర్తృహరి అంటాడు. ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు సమయోచితంగా, సందర్భోచితంగా, భాషాదోషం, భావదోషం లేకుండా స్పష్టంగా మాట్టాడే ప్రజ్ఞను సంతరించుకోవాలి. అది అభ్యాసం చేత వస్తుంది. అది ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకుని తన చుట్టూ ఉన్నవారికి శాంతినివ్వాలి.

శ్రీరామాయణంలో హనుమ –‘‘సీతమ్మ కొన్ని నెలలుగా రావణుడి పట్టణంలో ఉండి, రాముడికోసం దుఃఖిస్తూ ఉన్నప్పుడు నేను నా మాటల చేత శాంతినిచ్చాను. ఇప్పుడామె ప్రసన్నురాలయి ఉంది’’ అంటాడు. ‘నామాటల చేత నేను సాధించగలిగాను’ అంటాడు. అదే రావణుడయితే –బతుకుదామనుకున్న సీతమ్మను ఆత్మహత్య చేసుకునేటట్టుగా చేసాడు. అదృష్ట్టవశాత్తూ స్వామి హనుమ ఉన్నాడు కాబట్టి ఆమె ఆ ప్రయత్నాన్ని విరమించి మళ్ళీ జీవితం మీద పూనిక పొందింది.

మాట ఎంత శక్తిమంతమయినదంటే – ‘‘కడుపున్‌ రంపపుకోత కోయునది గాకుండినన్‌’’ అంటారు బలిజేపల్లివారు. ఒక వ్యక్తిని తీసుకొచ్చి పడుకోబెట్టి అటు ఒకరు, ఇటు ఒకరు నిలబడి రంపంతో కోస్తున్నప్పుడు ఏర్పడే గాయం బాధకన్నా ఒక అనరానిమాట అన్నప్పుడు ఆ వ్యక్తి జీవితాంతం అది గుర్తొచ్చినప్పుడల్లా పడే బాధ ఎక్కువ. రంపంతో కోసిన గాయం కొన్నాళ్ళ తరువాత మానిపోవచ్చు. కానీ అనరానిమాట తొందరపడి అంటే – ఆ అవతలి వ్యక్తి పొందే బాధ ఎప్పటికీ పోదు. అందుకే మాట ఎంత గొప్పదో...మాటని ఉపయోగించేటప్పుడు అంత జాగ్రత్తగా ఉండాలి.

మాట మాట్లాడాలంటే సంస్కారం ఉండాలి. అది చదువుతో వస్తుంది. పెద్దలయిన వారి చరిత్రలు చదవాలి. మీరెంతగా శాస్త్రాన్ని రోజూ చదువుతున్నా కనీసం ఒక పదిపుటలు రోజూ మహాత్ముల జీవితాలు చదివితే ఒక్క విషయం మాత్రం మీకు స్పష్టంగా తెలుస్తుంది– ‘ఏ మహాత్ముడి జీవితం వడ్డించిన విస్తరి కాదు’ అని. చదువుకోవడం ఒక ఎత్తు. ఏదయినా ఒక భయంకరమైన సమస్య ఎదురయినప్పుడు దానిని ఎదుర్కోగల సామర్థ్యం, చాకచక్యం, స్థితప్రజ్ఞత  మరొక ఎత్తు. అవి రావాలంటే మహాత్ముల జీవితాలను చదవాలి.

ఒకప్పడు ముఖ్యమంత్రి పదవిని అలంకరించిన టంగుటూరి ప్రకాశంపంతులు చిన్నతనంలో ట్యూషన్‌ ఫీజు కట్టడానికి కేవలం రు.3/–లు లేక దానికోసం 25 మైళ్ళు నడుచుకుంటూ వాళ్ళబావగారి దగ్గరకు వెళ్ళి లేదనిపించుకుని తిరిగి అంతే దూరం ఈసురోమని నడుచు కుంటూ వచ్చి తల్లికి విషయం చెప్పి పరీక్ష తప్పిపోతుందని బాధపడ్డాడు. తల్లి వెంటనే తనకున్న ఒక్క పట్టుచీర తాకట్టు పెట్టి ఫీజుకట్టింది. తరువాత కాలంలో ఆయన బారిష్టరు చదివి లక్షల రూపాయలు సంపాదించి దేశ స్వాతంత్య్రంకోసం వాటిని గడ్డిపోచ సమానంగా ఖర్చు పెట్టేసాడు.

‘ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా, నేనేమి ఇవ్వగలనని ఆలోచిస్తాను’ అని అబ్దుల్‌ కలాంగారు విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించినప్పడు ఆయన ఉద్దేశం... మహాత్ముల జీవితాలను తెలుసుకుని వారి నుంచి స్ఫూర్తి పొందాలని, ఇచ్చి బాధ పడకుండా ‘భగవంతుడు నాకిచ్చిన దానిలో నేనేమి ఇవ్వగలను’ అని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూ ఉండాలని.


- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

మరిన్ని వార్తలు