కురాయ్‌ ఒన్రుమ్‌ ఇల్లై గోవిందా...

18 Nov, 2018 00:58 IST|Sakshi

హెలన్‌ కెల్లర్‌ పాశ్చాత్య దేశానికి చెందిన వ్యక్తి. పుట్టినప్పుడు భగవంతుడు ఆమెకు అన్నీ ఇచ్చాడు. అసలు లేకపోతే వేరు. కొన్నాళ్ళు ఉండిపోతే ఆ బాధ వేరుగా ఉంటుంది. క్రమంగా ఆమెకు చూపు పోయింది. కొన్నాళ్ళకు వినికిడి శక్తి పోయింది. మరి కొన్నాళ్లకు మాట్లాడగలిగిన శక్తికూడా పోయింది. ఏదో కొద్దిగా మాట్లాడేవారు. అంత బాగా అర్థమయ్యేది కాదు. కానీ ఆవిడ గొప్పతనం ఏమిటంటే–ఎదురుగా ఉన్నది ఏదయినా సరే, ఇలా ముట్టుకుని స్పర్శజ్ఞానంతో చెప్పగలిగేవారు. చిరునవ్వు ఎప్పడూ ఆమె ముఖం మీదనించి చెరిగిపోలేదు.
ఆమె స్నేహితురాలు ఒకరు ఓ రోజు ఉదయం వ్యాహ్యాళికి వెళ్ళి వచ్చారు. 

అలా ప్రకృతిలోకి వెళ్ళివచ్చావు కదా, ఇంతసేపు ఏ అందాలు చూసి వచ్చావు... అని కెల్లర్‌ అడిగారు. ‘‘ఆ... చూడ్డానికేముంది, రోజూ ఉండేదేగా.  కాసేపు అలా నడచి వచ్చా.’’ అని స్నేహితురాలు చెప్పింది. వెంటనే కెల్లర్‌..‘‘నాకు ఒక్క పువ్వుతొడిమ ముట్టుకుంటే.. ఆ తొడిమను అంత సున్నితంగా చేసిన వాడెవరు? దానిమీద ఆ పువ్వు పెట్టిన వాడెవరు? ఆ బరువుకి తొడిమ వంగిపోకుండా నిలబెట్టినవాడెవరు? అందులోంచి సువాసన వచ్చేట్టు చేసినవాడెవరు?...’’ అని కళ్ళులేని దాన్ని పువ్వు ముట్టుకుంటేనే ఆనందంతో చిరునవ్వు వస్తుందే... కన్నులు, చెవులు, నోరున్నదానివి, ప్రకృతి అందాలు అంతా చూసి చూడ్డానికి ఏముందంటావేం?  అంది. అదీ హృదయంలో ఐశ్వర్యం ఉండటం అంటే.

ఆవిడ ఒకసారి ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మిగారి కచేరికి వచ్చారు. ఆమె పాడుతుంటే వినడానికి కెల్లర్‌కు అవకాశం లేదు. కానీ సుబ్బులక్ష్మిగారి కంఠంమీద వేలుపెట్టి, ఆ ధ్వని ప్రకంపనలతో గుర్తించేవారు.. ఆమె ఏం పాడుతున్నారో. సుబ్బులక్ష్మిగారి ఆరోజు పాడుతూ.‘కురాయ్‌ ఒన్రుమ్‌ ఇల్లై గోవిందా...’ అని ఓ కీర్తన ఆలపిస్తున్నారు. కురాయ్‌ అంటే.. నాకు ఏ విధమైన ఫిర్యాదు... ఒన్రుమ్‌... ఒక్కటి కూడా ఇల్లై.. లేదు అని. ‘‘నువ్వు నాకు ఫలానా విషయంలో కష్టాన్నిచ్చావు. దానివల్ల నేను బాధపడ్డాను..అని చెప్పడానికి  గోవిందా... నాకు ఏ ఫిర్యాదూ మిగల్చకుండా చేసావు... నాకు సమస్యలు ఇవ్వలేదు, కష్టాలు ఇవ్వలేదు... నాకు నీపై ఫిర్యాదు చేయడానికి... ఇల్లై గోవిందా... ఏమీ లేకుండా చేసావు గోవిందా...’’ అని ఆమె ఆర్తితో పాడుతున్నారు.

నిజానికి సుబ్బులక్ష్మిగారు పడినన్ని కష్టాలు మరొకరు పడి ఉండరు. అన్ని కష్టాలకు ఓర్చుకుని ఆ స్థాయికి వెళ్ళారామె. అటువంటి తల్లి త్రికరణశుద్ధిగా ‘నాకు ఫలానాది ఇవ్వలేదని నా దైవానికి ఫిర్యాదు చేయడానికి ఏమీ లేదు’ అని పాడుతుంటే... ఆమె కళ్ళవెంట కన్నీరు ధారలు కడుతున్నది. అక్కడే ఉన్న కెల్లర్‌ ఎలాగూ వినలేదు కాబట్టి ఆవిడ కంఠంమీద వేలుపెట్టి... కీర్తన ముగియగానే వేలు తీసేసి వలవలా ఏడ్చేసారు. సుబ్బులక్ష్మిగారు సంజ్ఞల ద్వారా అడిగారు... ఎందుకు ఏడుస్తున్నారని. దానికి కెల్లర్‌.. ‘‘నాకు కూడా ఇదే. భగవంతుడు నాకు ఏ సమస్యా ఇవ్వలేదు. నిజానికి నాకు వరాలిచ్చాడు.

కళ్ళు, చెవులు, నోరు లేవు... అందువల్ల నేను జీవితంలో చాలా శ్రమపడి వృద్ధిలోకి వచ్చాను. అన్నీ ఇచ్చి ఉంటే...ఇంత శ్రమపడేదాన్ని కానేమో... విచ్చలవిడిగా వాడుకుని ఎందుకూ కొరగాకుండా ఉండిపోదునేమో... ఎన్ని జన్మలెత్తినా ఓ భగవంతుడా... నన్ను అనుగ్రహించి నాకున్న ఈ లోపాలు అలాగే ఉంచు. అప్పుడు నేను ఇలాగే ఉంటాను’’ అని సంకేతాలతో తెలియచేసారు. జీవితంలో మనల్ని సమస్యలు చుట్టుముట్టినప్పడు వాటిని విజయవంతంగా ఎదుర్కొని మనల్ని మనం నిగ్రహించుకోవడానికి, మన జీవితానికి ఓ అర్థం, పరమార్థం పొందడానికి ఇటువంటి వారి అనుభవాలు మనకు దిశానిర్దేశం చేస్తాయి.


- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

మరిన్ని వార్తలు