కండాక్టరమ్మ

12 Nov, 2018 00:13 IST|Sakshi

అనిత డాక్టరమ్మ కాదు. కండక్టరమ్మ. ప్రయాణికులను గమ్యం చేరుస్తూనే.. ప్రాణాంతక తలసేమియా నుంచి చిన్నారుల ఊపిర్లను నిలుపుతున్నారు! ప్రాణం పోసేవారే కాదు.. ప్రాణం పోయాలని తపించేవారూ డాక్టర్‌లే. అందుకే  ఆమె కండాక్టరమ్మ.  

అరవై ఏళ్ల అత్తగారు కోడలి ముందుకు వచ్చి, ‘ఆ చిన్నపిల్లల కోసం నీవు చేస్తున్న సేవకు నా పెన్షన్‌లో మూడొంతులమ్మా’ అంటూ  డబ్బులు కోడలి చేతిలో పెట్టింది. అత్త చూపిన ఔదార్యం కోడలు అనిత సేవను మరింత ముందుకు కొనసాగించేలా చేసింది. అత్తతో పాటు భర్త, తోటికోడలు, బావ, మరిది ‘మేమూ సాయం చేస్తామం’టూ తలా ఓ చేయి కలిపారు.

కుటుంబంలో అందరూ చేయీ చేయీ కలిపితే కొండంత పనైనా దూదిపింజెంత తేలికవుతుందనిపించింది అనితకు. అలా తమందరి వేతనంలో నుంచి కొంత భాగంతో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులను విగతజీవులుగా మారకుండా కాపాడేందుకు వినియోగిస్తున్నారు అనిత.. ఆమె ‘సంకల్ప’బలంతో నేడు వందలాది తలసేమియా చిన్నారులు ఊపిరి నిలుపుకొని హాయిగా చిరునవ్వులు చిందిస్తున్నారు.

మొగ్గ రాలిపోవడం.. దగ్గరగా చూసి!
ఖమ్మం ఆర్టీసీ బస్సు డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నారు పొద్దుటూరి అనిత. స్థానిక ఇందిరానగర్‌ కాలనీలో ఉమ్మడి కుటుంబంతో కలిసి ఆమె నివాసం ఉంటున్నారు. ఎనిమిదేళ్ల క్రితం సమీప బంధువు కుమారుడు తలసేమియా వ్యాధితో బాధపడుతూ మరణించాడు. ఆ పిల్లవాడి తల్లిదండ్రులు పడిన బాధను చూసిన అనిత ‘ఈ వ్యాధితో పసిమొగ్గలు రాలిపోతుంటే చూస్తూ ఊరుకోవడమేనా,  ఏమీ చేయలేమా..? అని ఆలోచించారు. ఎలాగైనా ఇలాంటి పిల్లలకు బాసటగా  నిలవాలని అనుకున్నారు.

‘కదిలిన’.. కుటుంబం
తొలుత ఒంటరిగానే తలసేమియా పిల్లలకు సేవ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు అనిత. వచ్చే వేతనంలో నుంచి కొంత మొత్తాన్ని తలసేమియా పిల్లలకు ఉచితంగా రక్తం అందించడానికి ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు హోంగార్డుగా పనిచేస్తున్న అనిత భర్త రవిచంద్ర ప్రోత్సాహం తోడైంది.

అత్త చంద్రలీల, తోడికోడళ్లు పావని, ప్రియ, బావ ఉదయ్‌భాస్కర్, మరిది వంశీకిరీటి ఆర్థికంగా సహాయం చేస్తామని ముందుకొచ్చారు. అలా ఇంట నిలిచిన అనిత బయట గెలవడానికి బయల్దేరారు. 2010లో తలసేమియా వ్యాధిగ్రస్తులను అన్ని విధాలుగా ఆదుకోవాలనే లక్ష్యంతో ‘సంకల్ప’ పేరుతో స్వచ్ఛంద సంస్థను స్థాపించారు.

నిరాశ ఎదురైనా వెరవలేదు!
సేవ స్వచ్ఛందమైనా ఇందుకోసం సహకరించే వారే కొరవడటంతో పిల్లలకు ఇవ్వాల్సిన రక్తం కోసం ఎక్కని గడప లేదు.. అడగని సంస్థా లేదు అన్న రీతిలో తన లక్ష్య సాధన కోసం అందరినీ అభ్యర్థించారు అనిత. మొదట్లో ‘ఇదేమి సేవ.. ఎంత చేసినా ఎక్కువ కాలం బతకని పిల్లల కోసం ఎందుకింత ఆరాటం. వాళ్లేమైనా నూరేళ్లూ బతికి బట్టకడతారా.. ’ అంటూ నిరుత్సాహంగా మాట్లాడినవారే ఎక్కువ.  అయినప్పటికీ అనిత మాత్రం కుటుంబ సభ్యుల అండతో రక్త సేకరణకు పూనుకున్నారు.

మొదట్లో.. కుటుంబంలో ఎవరి పుట్టిన రోజులు, పెళ్లి రోజులు వచ్చినా బంధుమిత్రులను కలుపుకుంటూ రక్తదాన శిబిరాలను నిర్వహించేవారు. ఈ క్రమంలో తలసేమియా వంటి భయంకర వ్యాధితో పిల్లలు అనుభవిస్తున్న నరకం, వారి తల్లిదండ్రులు పడుతున్న మానసిక క్షోభను సమాజానికి అర్థమయ్యేలా చెప్పడంలో కొన్నాళ్లలోనే అనిత అనితర సాధ్యురాలు అనిపించుకున్నారు. దాంతో జిల్లాల్లోని తలసేమియా వ్యాధిగ్రస్తులకు అనిత అందిస్తున్న సేవలు అందరి దృష్టిలో పడ్డాయి.

యజ్ఞంలా.. ప్రతినెలా రక్త సేకరణ!
తలసేమియా వ్యాధి కారణంగా పిల్లలు చిరుప్రాయంలోనే మరణించిన ఘటనలు తరచూ నమోదు అయ్యేవి. అనిత ‘సంకల్ప’ సంస్థ ఆచరణలోకి వచ్చాక జిల్లాలో తలసేమియా వ్యాధి వల్ల మరణించిన వారి సంఖ్య క్రమేణా తగ్గుతూ వస్తోంది. తొలుత రెండు, మూడు బ్యాగుల రక్త సేకరణ నుంచి ప్రారంభమైన అనిత సేవ.. నేడు నెలకు 250 బ్యాగుల రక్తం సేకరించి చిన్నారులకు ఎక్కించే స్థాయికి చేరింది.

ఈ రక్తం ఇస్తేనే ఆ నెలకు 180 మంది చిన్నారుల ఆయుష్షు మరో నెలకు పొడిగించబడుతుంది! దాంతో ప్రతినెలా ఈ రకమైన రక్తయజ్ఞం చేయడం ఆమెకు అలవాటైంది. ఒకవైపు కండక్టర్‌ వృత్తి చేస్తూ.. మరోవైపు సంసారం చక్కదిద్దుకుంటూ, భర్త, అత్త, తోటికోడళ్ల సహకారంతో ‘సంకల్ప’ స్వచ్ఛంద సంస్థను దిగ్విజయంగా నడిపిస్తున్నారు అనిత. ఇప్పుడు తలసేమియా వ్యాధి బాధితులకు రక్తం లోటు లేదు. ప్రతి 15 రోజులకోసారి 180 మంది బాధితులకు రక్తం ఎక్కించడానికి కావాల్సినంత రక్తం ఆమె స్థిరీకరించుకోగలిగారు.

కష్టార్జితాన్ని ఖర్చుపెట్టాకే..
ఇంటి నుంచి మొదలైన ఆర్థిక సహాయంతో పాటు దాతల సహకారమూ తోడై ఇప్పుడు ప్రతి నెలా రూ.3లక్షల వరకు తలసేమియా వ్యాధిగ్రస్తులకు కావాల్సిన మందులను అనిత ఆధ్వర్యంలోని ‘సంకల్ప’.. ఉచితంగా పంపిణీ చేస్తోంది. ‘మా కష్టార్జితాన్ని సేవకు వినియోగించిన తర్వాతే దాతలను ఆశ్రయిస్తామ’న్న అనిత ఆలోచన మరికొందరు సమాజ సేవకులను ఈ సేవలో పాలుపంచుకునేలా చేసింది. తలసేమియా బాధితులకు సేవ చేస్తున్నందుకు, సదస్సుల ద్వారా ప్రజలలో తలసేమియా పట్ల అవగాహన కల్పిస్తున్నందుకు ఈ ఏడాది  జూలై నెలలో ఉత్తమ మోటివేటర్‌ అవార్డును గవర్నర్‌ నరసింహన్‌ చేతుల మీదుగా అందుకున్నారు అనిత.

‘మేము సైతం’
తలసేమియా వ్యాధి ప్రధానంగా మేనరికపు వివాహాల వల్ల సంతానానికి సంక్రమిస్తుంది. ఆరు నెలల నుంచి ఒకటిన్నరేళ్ల వయసులో ఈ వ్యాధిని గుర్తిస్తే సకాలంలో వ్యాధి నివారణ చర్యలు చేపట్టి.. మరణం అంచున ఉన్న వారిని సైతం కాపాడే అవకాశం ఉంది. ఈ వ్యాధి బాధితుల్లో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి ఉండదు.. అందుకే ప్రతి 15, 20 రోజులకోసారి శుద్ధి చేసిన రక్తాన్ని ఎక్కించాల్సి ఉంటుంది. ఇది శ్రమతో కూడిందే కాదు.. ఖర్చుతో కూడుకున్నది.

అయితే అనిత చేసిన ధైర్యం అందరినీ ఆలోచింపజేసింది. మేము సైతం అంటూ జిల్లాలోని పలువురు వైద్యులు, పోలీస్‌ అధికారులూ బాసటగా నిలిచారు. జాతీయపర్వదినాలలో రక్తదాన శిబిరాల ఏర్పాటుకు ముందుకు వచ్చారు. ‘సంకల్ప’ సంస్థకు శివ బ్లడ్‌ బ్యాంక్‌ యజమాని రాజేశ్‌గార్గె సేవలు తోడయ్యాయి. అలాగే పిల్లల వైద్య నిపుణులు డాక్టర్‌ కూరపాటి ప్రదీప్, అంకుర ఆస్పత్రి వైద్యులు డాక్టర్‌ రాకేశ్‌ తలసేమియా బాధిత చిన్నారులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు.

– మాటేటి వేణుగోపాల్, సాక్షి, ఖమ్మం

మరిన్ని వార్తలు