ఏమిటి! నా బెర్త్‌ ఇవ్వాలా?!

12 Nov, 2018 00:34 IST|Sakshi

అదో రైలు బోగీ. ఏసీ స్లీపర్‌ కోచ్‌. అందులో ఓ పెద్దావిడ. ఆవిడ ముందు ఓ పెద్దాయన. ‘‘దయచేసి మీరు పక్క బెర్త్‌ తీసుకుంటారా? మా వాళ్లంతా ఇక్కడున్నారు. అది కూడా లోయర్‌ బెర్తేనండీ..’’ చాలా ఆÔ¶ గా, వినయంగా అడుగుతోందామె. నొసలు ముడి వేశాడాయన. ఏమిటీ, నా బెర్త్‌ మీకు ఇవ్వాలా? లేదు. నేను నాకు కేటాయించిన సీటులోనే కూర్చుంటాను. నాకు ఇచ్చిన, నాకు వచ్చిన బెర్త్‌ మీదనే పడుకుంటాను. మారే ప్రసక్తే లేదు’’ అన్నాడు కర్కశంగా, కచ్చితంగా. పాపం! ఆమె చిన్నబుచ్చుకుని వెళ్లిపోయింది.

సరిగ్గా అప్పుడే బోగీలో ఎక్కాడో కుర్రాడు. బక్కచిక్కిపోయిన వాడి వంటిమీద చిరుగులు పడ్డ చొక్కా, మాసికలు వేసిన లాగూ ఉన్నాయి. వాడు తన వెంట తెచ్చుకున్న ఒక చిన్న చీపురుతో బోగీని ఊడుస్తున్నాడు. ఈయన తిని పడేసిన వేరుసెనక్కాయ తొక్కలు, ఆయన పక్కన ఉన్నావిడ తిని పడేసిన కమలాతొక్కలు కూడా ఊడ్చి శుభ్రం చేశాడు. తర్వాత చేయి చాపి పొట్ట చూపిస్తూ అందరి ముందుకూ వెళుతూ, వీళ్లముందుకు కూడా వచ్చాడు. దయగల వాడికి తలా కాస్త చిల్లర విదిలిస్తున్నారు. పెద్దాయన మాత్రం వాడిని చీదరింపుగా చూసి, పక్కనున్న ఆవిడతో ‘‘వీళ్లు ఇంతేనండీ, ఎప్పటికీ మారరు. అసలు ఇలాంటి వాళ్ల వల్లే దేశం భ్రష్టుపట్టిపోతోంది.

ఇలాంటి వాళ్లకి డబ్బులివ్వడమంటే బిచ్చగాళ్లని, దేశద్రోహులని పెంచి పోషించినట్లే...’’ అని అంటున్నాడు. ఆవిడ మరేనండీ అంటోంది. ఈయన మరికొద్దిగంటల్లో రైలు దిగిన తర్వాత ‘మారుతున్న మానవతా దృక్పథం... అంతరించిపోతున్న మానవ విలువలు’ అనే అంశంపై తాను ఇవ్వబోతున్న ఉపన్యాసపు ప్రతిని మరోసారి సరి చూసుకుంటున్నాడు! ఆవిడేమో ‘అనాథ పిల్లల బతుకులను బాగు చేయడం ఎలా’ అనే టాపిక్‌ మీద వ్యాసం తయారు చేయడంలో మునిగిపోయింది!! మనలో చాలామంది ఇంతే. ఆశయాలు ఉన్నతంగా ఉంటాయి. ఆచరణలో అవి శూన్యం అవుతాయి.

– డి.వి.ఆర్‌.

మరిన్ని వార్తలు