అవని తల్లి

19 Nov, 2018 00:04 IST|Sakshi

పెళ్లయిన పదేళ్ల వరకూ పిల్లలు పుట్టలేదు అవనికి. ఎన్నో పరీక్షలు చేయించి, ఎన్నెన్నో మందులు, చికిత్సలూ తీసుకున్నాక ఆమె గర్భం ధరించింది. ఆమె ఆనందానికి అవధులు లేవు. ఆమె కడుపులో ఉన్న బిడ్డకు ఎందుకో ఆత్రుత కలిగింది కాబోలు ఎనిమిదోనెలలోనే భూమ్మీద పడాలనుకున్నాడు. పడ్డాడు. దురదృష్టవశాత్తూ ఆ బిడ్డ బతకలేదు. ఆ దుఃఖాన్ని తట్టుకోవడం చాలా కష్టమైంది ఆవనికీ, భర్తకూ కూడా. వారం రోజుల తర్వాత ఇంటికి పంపించారామెను హాస్పిటల్‌ నుంచి. పొరుగింటిలో పసికందు కేరింతలు చూడగానే ఆమెకు పాలు రావడం మొదలైంది. డాక్టర్‌కు ఫోన్‌ చేస్తే పాలు పోయేందుకు ఏవో మందులు చెప్పారు. అవనికెందుకో ఆ మందులు వాడబుద్ది కాలేదు.

పాలను పిండి పారబోయడం లేదా మందులు వాడి పాలు రాకుండా చేసుకోవడమే ఆమె ముందున్న ప్రత్యామ్నాయాలు. ఆమెకు ఆ రెండు మార్గాలూ ఇష్టం లేకపోయింది. సరిగ్గా అదే సమయంలో ఫేస్‌బుక్‌లో ఒక పోస్టింగ్‌ చూసిందామె. ఒక బిడ్డకు తల్లిపాలు కరువయ్యాయనీ, పోతపాలు పడటం లేదనీ, దయగల తల్లులెవరైనా ఆ బిడ్డకు పాలిచ్చి పసికందు ప్రాణాలు కాపాడమని ఉంది అందులో. తల్లిపాలు కరువైన ఆ బిడ్డకు తన పాలు ఇచ్చి ఆదుకునేందుకు ఆమె అరక్షణం కూడా ఆలోచించలేదు. వెంటనే వెళ్లి వాడికి పాలిచ్చింది. ఆమె స్నేహితురాలి పిల్లకు కూడా పాలు అవసరమయ్యాయి.

ఇంకా మరికొందరి విషయం కూడా ఆమె దృష్టికి వచ్చింది. భర్త అనుమతి తీసుకుని వారందరికీ పాలిచ్చిన తల్లి అయిందామె. పాలిచ్చినందుకు ఆమె ఏమీ తీసుకోదు తన పాలు తాగుతున్న ఆ పసికందు ఫొటో తప్ప. వారిలోనే ఆమె తన బిడ్డని చూసుకుంటోంది. అలా ఓ ఏడాది గడిచింది. అవని ఇప్పుడు మళ్లీ గర్భం దాల్చింది. మామూలుగానైతే అందులో ఆశ్చర్యం ఏమీ ఉండేది కాదు. కానీ ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఆమె మరోసారి గర్భం దాల్చే అవకాశం లేదని వైద్యులు చెప్పారామెకు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసేముందు. తనకు పుట్టిన పిల్లాడు తనకు లేకపోయినా, తన పాలిచ్చినందుకు అవనికి ఇప్పుడు దేవుడందుకే వరమిచ్చాడు కాబోలు. అందుకే అంటారు పెద్దలు. నిస్వార్థంగా మనం ఎవరికైనా ఏమయినా మేలు చేస్తే అంతకు పదింతల ఫలితం మనకు దక్కుతుందని.

– డి.వి.ఆర్‌.

మరిన్ని వార్తలు