కోతల కాలం

26 Mar, 2018 00:51 IST|Sakshi

ఒక రైతు కష్టపడి పనిచేసేవాడు. రోజంతా పొలంలోనే ఉండేవాడు. ఆ రైతు కష్టాన్ని ఆ పొలంలోనే గూడు కట్టుకుని ఉన్న ఒక పిచ్చుకల కుటుంబం చూస్తూ ఉండేది. కొన్నాళ్లకు రైతు కష్టం ఫలించింది. పంట కోతకొచ్చింది. ఊళ్లో మిగతా రైతులు కూడా కోతలకు సిద్ధం అయ్యారు. ‘‘ఇరుగు పొరుగును తీసుకొచ్చి రేపే నేను కూడా కోతలు మొదలు పెట్టాలి’’ అని ఆ రైతు ఎవరితోనో అంటుంటే పిల్ల పిచ్చుకలు విన్నాయి. వెంటనే వెళ్లి తల్లికి చెప్పాయి. ‘‘అమ్మా.. ఇవాళే మనం ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి.

కోతలు మొదలైతే మన గూడును కూడా పడగొట్టేస్తారు’’ అన్నాయి.‘‘తొందరేం లేదు. రేపు మన రైతు కోతలు మొదలవ్వవు’’ అంది పిచ్చుకల తల్లి నమ్మకంగా. అన్నట్లే మర్నాడు కోతలు మొదలవ్వలేదు. పిచ్చుకలు ఆశ్చర్యపోయాయి.రైతు మళ్లీ.. ‘‘రేపే దగ్గరి బంధువుల్ని తీసుకొచ్చి కోతలు మొదలు పెట్టాలి’’ అని అంటుంటే విని, ఆ విషయాన్ని తల్లికొచ్చి చెప్పి, ‘‘వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోదాం’’ అన్నాయి పిచ్చుకలు. ‘‘తొందరేం లేదు. రేపు కూడా మన రైతు కోతలు మొదలవ్వవు’’ అంది తల్లి పిచ్చుక.

అన్నట్లే ఆ రేపు కూడా కోతలు మొదలవ్వలేదు! పిల్ల పిచ్చుకలు మళ్లీ ఆశ్చర్యపోయాయి.ఈసారి రైతు.. ‘‘రేపు నేనే కోతలకు సిద్ధమౌతున్నాను’’ అని ఎవరితోనో అంటుంటే పిచ్చుకలు విని, తల్లికి చెప్పాయి కానీ, ‘మనం వెళ్లిపోదాం’ అని అనలేదు! అయితే ఈసారి తల్లే ఆ మాట అంది.. ‘‘మనం వెంటనే గూడును ఖాళీ చేసి వేరే చోటుకు వెళ్లిపోవాలి’’ అని! పిచ్చుకలు తల్లి వైపు ఆశ్చర్యంగా చూశాయి. ‘‘అవును. మన రైతు రేపు కోతలు మొదలు పెట్టేస్తాడు. తన కష్టాన్ని నమ్ముకున్నవాడు ఎవరి కోసమూ ఎదురు చూడడు’’ అంది పిచ్చుకల తల్లి.

మరిన్ని వార్తలు