అదే స్వర్గం అదే మోక్షం

28 Oct, 2018 01:15 IST|Sakshi

ఆధునిక విజ్ఞానశాస్త్రం కూడా కనుగొనలేని, వివరించలేని ఆ అనంతశక్తి లేదా ఆత్మ ఒక మహా ఆశ్చర్యకరమైన వస్తువనీ, ఇంద్రియానుభవ రహితమైనదని, మానసికానుభవమని నాటి ఋషులుగా చెప్పబడే ఆధ్యాత్మిక పరిశోధకులు వేల ఏళ్లక్రితం ఉపనిషత్తుల్లో ఘోషించడం ఎంతో ఆశ్చర్యకరం. ఉపనిషత్తులు ఆ ఆత్మ గురించి పరిపరి విధాల వర్ణిస్తూ, ప్రతి ఒక్కరినీ మానవత్వం నిండిన విశ్వనరునిగా జీవించమంటూ, బతికినంతకాలం జ్ఞానపీఠికపై కర్మయోగిగా, చిత్జడ గ్రంథిని చిదిమివేసి మోక్షాన్ని అనుభవించాలని ఉపదేశిస్తాయి. ప్రాణసహితంగా ఉన్నా, ప్రాణరహితంగా ఉన్నా ‘నీవే ఆ అనంతశక్తిగా అనుభూతి చెందాలి’ అని చెప్తాయి.

అనుభూతి అనేది మనసు చేసే మథనం. ఇదే విషయాన్ని ‘ముండకోపనిషత్తు’ ‘ఆ ఆత్మ కళ్ళతోనో, ఇతర ఇంద్రియాలతోనో తెలుసుకోబడదు. తపస్సు వలననో, కర్మలచేతనో లభించదు. సాధకుని మనస్సు విశుద్ధమైనదై ఉండి, నిరంతరం ఆ ఆత్మతో తాదాత్మ్యత పొందడం వలననే దాని సాక్షాత్కారం పొందడం సాధ్యమౌతుంద‘ని తెలుపుతోంది. అంతేకాకుండా నయమాత్మా’ బలహీనేన లభ్యో...’ అంటూ ‘ఆత్మను బలహీనులైన వారు పొందలేరు. అజాగ్రత్త వలన, నిర్దిష్టమైన తపస్సు లేని యెడల ఆత్మసాక్షాత్కారం జరుగదు. శారీరక, మానసిక దృఢత్వం వలన వచ్చే మనోస్థైర్యం కలిగిన సాధకులు మాత్రమే బ్రహ్మస్థితిని అనగా ఆత్మసాక్షాత్కారం పొందగలర‘ని నిర్ధారిస్తోంది.

మనసుకున్న గొప్పలక్షణాల వల్ల ఆత్మ అటువంటి శక్తిని గ్రహించగలుగుతుంది. మనసు ఎంతో బలమైనదై, నిశ్చలమైనదై ఉండాలి. దృఢమైనది ఎందుకంటే ఆత్మతో ఏకత్వాన్ని అనుభవించినపుడు కలిగే ఆనందాన్ని భరించగలిగినదై ఉండాలి. నిశ్చలమైనదై ఎందుకుండాలంటే, మనసు నిశ్చలంగా ఉంటేనే పదార్థ లక్షణాలేవీ లేని శక్తిపట్ల తాదాత్మ్యత పొందగలుగుతుంది. నీటి ప్రవాహంలో గాలి బుడగలు ఉద్భవించి, కొంతదూరం ప్రయాణించి, పగిలిన తర్వాత తిరిగి నీటిలో కలిసి పోయినట్లే ఈ చరాచర ప్రపంచం ఆ అనంతశక్తిలో ప్రవర్తిస్తుంది. ఈ విషయాన్ని ఏకాగ్రచిత్తంతో గమనిస్తూ ఉంటే అర్థమవుతుంది. ఈ విధమైన ఏకాగ్రత మనలో ఎనలేని మార్పును తీసుకొస్తుంది. ఏ పదార్థంపైనా, జీవిపైనా వ్యామోహంగానీ, విరక్తి గానీ కలుగదు. మంచి–చెడు,సుఖం–దుఃఖం లాంటి ద్వైదీభావనలు కలుగవు. కామ, క్రోధాది అరిషడ్వర్గాలకు అసలు స్థానమే ఉండదు.

నిర్వికార, నిశ్చలమనస్సు ఏర్పడి ప్రతిపనిలో, ప్రతివాక్కులో, ప్రతిరూపంలో, సర్వత్రా ఏకాత్మను గ్రహిస్తూ ఉంటుంది. అదో అద్భుత ఆనందానుభూతి. ఈ దృశ్యమాన ప్రపంచాన్ని, దానికి హేతువైన ఆత్మను గెలిచి, ఒడిసిపట్టుకున్న ఆనందం. అంతకుమించిన విజయమేముంటుంది మనిషికి? జీవరాశుల్లో అన్నిట్లో మేధావి ఐన మనిషికి భౌతిక ప్రపంచంలో తాను ఆశించిందాన్ని గెలుపొందడమే గొప్ప విజయంగా భావిస్తాడు. అలాంటిది ఈ సృష్టి మొత్తానికి హేతువైన అనంతశక్తిని మన మనసులో ఒడిసి పట్టుకోవడం ఎంతటి విజయమో మనం ఊహించలేం. ఆ విజయానందం అనిర్వచనీయం. సాధకుడు ఆ జీవితాన్ని అనుభవించాల్సిందే. అప్పుడు సాధకుని మనస్సు అనిర్వచనీయమైన, అవధుల్లేని ఆనందడోలికల్లో తేలిపోతూ ఉంటుంది. ఈ ప్రపంచం, దాని పరిణామాలన్నీ ఆల్పమైపోతాయి. అసలు వీటిమీద ఏ చింతా కలగదు.

 భగవంతుని చూడాలనుకునే ప్రతి ఒక్కరూ భగవంతుడు అని చెప్పబడే ఆ ఆత్మను సాకారం చేసుకోలేరు. మనసులో ఆత్మను నిరంతర సంయోగం చేయగలవారే ఆత్మ లేక భగవత్సాక్షాత్కారం పొందగలరు. అలా పొందిన వారు అద్వైతచిత్తులై, కుల, మత, లింగ, భాష, ప్రాంత, జైవికాది భేదాలకు అతీతులై, ఉన్నత మానసిక స్థితిలో ఓలలాడుతూ ఉంటారు. అదే స్వర్గం. అదే మోక్షం.

– గిరిధర్‌ రావుల

మరిన్ని వార్తలు