ఆత్మజ్ఞానంతోనే పరిణామ దశ

11 Nov, 2018 01:52 IST|Sakshi

ఆ అనంతశక్తి కాలాతీతమైనది. కాలం అనేది సూర్యుని వల్ల ఏర్పడే దివారాత్రుల వలన కలిగే ఒక భావన. సూర్యమండలంలోని ఒక్కో గ్రహానికి ఒక్కో కాలం ఉంటుంది. కాలం అనేది జనన మరణాలు కల పదార్థాలకు మాత్రమే ఉంటుంది. జననమరణాలు లేని అనంతశక్తికి ఉండదు. అట్టిదానికి కాలాన్ని ఆపాదించనూలేము. కాలాన్ని చెప్పగలిగే లేదా చూపగలిగే పదార్థం అనంతశక్తి ఆవల పుట్టలేదు. కారణం, ఆ అనంతశక్తి అలాంటి స్థానమే లేకుండా ఆవరించి ఉండడమే. అంతేకాకుండా, పుట్టే పదార్థానికి ఇదే శక్తి కావాలి. కాబట్టి, కాలం అనే భావనకు కారణమైన అన్ని నక్షత్ర, గ్రహాలను కన్నది ఈ అనంతశక్తే కాబట్టి, అది కాలాతీతమైనది.

సనాతనమైన ఆత్మ తన ఉనికిని, నూతనత్వాన్ని చాటుకోవడానికి పరిణామాన్ని ఆశ్రయించిందని తెలుసుకున్నాం. అయితే, ఆత్మకు జన్మ అనేదిలేదు. అలాగే, ఈ పరిణామ ప్రక్రియ ప్రారంభమూ చెప్పలేము. అయితే, పరిణామం అనేది అనంతశక్తికి తప్పనిసరైన విధి. గమ్మత్తేమిటంటే, ప్రతి పదార్థరీత్యా ఆ పదార్థమే తొలిసారిగా ఉద్భవించినట్టు తోస్తుంది. ఎందుకంటే, పరిశోధన భూకేంద్రంగా చేసుకుని సాగడమే.

అంతటి విచిత్రమైన అనంతశక్తిలో సృష్టిలయలు కలిగి ఉన్న పదార్థాలు అనగా గెలాక్సీలు, నక్షత్రాలు, గ్రహాలు ఎన్నని ఎంచగలం, ఎక్కడని చెప్పగలం? పార్సెక్‌ లాంటి ఖగోళ కొలతలకు అందని దూరాలలో ఒక పదార్థాన్ని చూసే శక్తి సముపార్జించే లోపల మరో పదార్థం పురుడు పోసుకుంటుంది. ఈ పదార్థమే తర్వాత అనంతశక్తిగా రూపొందుతుంది. ఈ పరిణామం నిరంతర ప్రక్రియ. ప్రస్తుతం మన నివసిస్తున్న భూమండలం, మన సౌరకుటుంబం ఆ అనంతశక్తి లో ఏ భాగమో, ఏ దిశలో ఉందో, ఎంతటి భాగాన్ని ఆక్రమించి ఉందో ఏ విధంగా చెప్పగలం?

ఈ విధంగా అనంతశక్తికి వైజ్ఞానికపరంగా చూసినా, ఉపనిషత్తుల పరంగా చూసినా పరిణామం చెందడమే ప్రధాన లక్షణమని అర్థమౌతుంది. ఇదే విషయాన్ని శ్వేతాశ్వతర ఉపనిషత్తు నిర్ధారిస్తోంది. అనంతశక్తిని ‘పరిణామశీల అయిన అంతర్యామి’గా పేర్కొంటూ, పరిణామాన్ని నిత్య లక్షణంగా అలవాటు చేసుకున్న ఆ శక్తి అన్ని ప్రాణులలోను, వాటి అవయవాలలోనూ, నిర్జీవులలోనూ దాగుకొని అందంగా ఉందని పేర్కొంటుంది.

ఈ విషయాన్ని తెలుసుకున్న సాధకుడు, ఈ శరీరంలో స్వయంప్రకాశక ఆత్మతత్వం ద్వారా, తనలోనూ, తన చుట్టూతా నిశ్చలమై ఉన్న బ్రహ్మ తత్వాన్ని సాక్షాత్కరించుకున్నప్పుడు మాత్రమే జన్మరాహిత్యాన్ని, శాశ్వతత్వాన్ని అవగాహనలోకి తెచ్చుకుని జాతి, కుల, మత, లింగ, భాష, వయో ఆధారిత సకల బంధాల నుండి విముక్తుడై, మోక్షజీవితాన్ని ఆనందంగా జీవిస్తాడు. జ్ఞానం వలన సాధకుడు విశ్వనరుడై ఉదారజీవితాన్ని గడిపి, మరణభయం లేకుండా, శరీరాన్ని వదిలి మరో పరిణామ దశలోకి ప్రవేశిస్తాడు.

– గిరిధర్‌ రావుల

>
మరిన్ని వార్తలు