బంగారు పూలు నాకెందుకు!

26 May, 2019 02:01 IST|Sakshi

సంగీత సాహిత్యం

‘‘కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు /కొండలంత వరములు గుప్పెడువాడు’’. ఆ కొండలు ఈనాటి కొండలు కావు. అసలు ఆ కొండలే వేంకటేశ్వరుడంటారు. అందుకనే ఆ కొండ పాదాన్ని స్వామి పాదుకలుగా భావించి అర్చన చేస్తారు. వృషాద్రి, వృషభాద్రి,  గరుడాద్రి, అంజనాద్రి, వేంకటాద్రి, శేషాద్రి, నారాయణాద్రి– అవి ఏడు కొండలు. ఒక్కొక్క కొండ ఎందుకొచ్చిందో ఆ విశేషాల్ని వరాహ పురాణం  వర్ణించింది. అది –‘‘కృతే వృషాద్రిం వక్ష్యంతి/త్రేతాయాం అంజనాచలమ్‌ /ద్వాపరే శేషశైలతే /కలౌ శ్రీ వేంకటాచలమ్‌.’’ కృత యుగంలో వృషాద్రి అని, త్రేతా యుగంలో అంజనాద్రి అని, ద్వాపర యుగంలో శేషాద్రి అని, కలి యుగంలో వేంకటాద్రి పేరిట ఈ దివ్య క్షేత్రం కొన్ని కోట్ల సంవత్సరాలుగా విరాజిల్లుతోంది. ఇప్పటికీ వేంకటాచలంపైన శిలాతోరణం ఉంది. అది ఎప్పటిదో ఎవ్వరికీ తెలియదు.

దానంతట అదిగా ఏర్పడింది. అది క్రీడాద్రి. శ్రీమన్నారాయణుడు విహరించిన ఉద్యానవనం. దానిని గరుడుడు తీసుకొచ్చి భూమిమీద పెట్టాడు.ఇక కోనేరు–దానిని స్వామి పుష్కరిణి అంటాం. మనకు జీవితంలో మూడే మూడు దుర్లభమయినవని వరాహ పురాణం చెబుతున్నది. ఈ మూడింటిలో ఏదయినా నీకు దొరికితే నీవు అదృష్టవంతుడి కింద లెక్క. అవి–  ‘సద్గురోః పాదసేవనం’. సర్వకాలాల్లో భగవంతుని పాదారవిందాలనుంచీ స్రవించే అమృతపానంతో మత్తెక్కిపోయిన హృదయమున్న పరమ భాగవతుడైన జ్ఞాని పాదసేవ అంత సులభం కాదు. సమస్త తీర్థాలు అటువంటి గురువు పాదాలలో ఉంటాయి. అలాగే ఏకాదశీ వ్రతాన్ని శాస్త్రం ఎలా చెప్పిందో అలా చేయడం చాలా కష్టం. ఇక మూడవది–పుష్కరిణీ స్నానం. ఘటికాచల మహాత్మ్యంలో తెనాలి రామకృష్ణుడు చెప్తాడు... అక్కడ స్నానం చేస్తే అకాల మృత్యువు, మతి భ్రమణం ఇతర అనారోగ్యాలు దరి చేరవంటాడు.

అందులో కొన్ని వందల తీర్థాలు అంతర్వాహినిగా కలుస్తుంటాయి. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు శ్రీదేవి, భూదేవిలతో కలిసి జలకాలాడిన పరమ పావనమైన పుష్కరిణీ స్నానం విశేషమైనది. దానికి రాయడు అంటే రాజు అటువంటి దుర్లభమైన పుష్కరిణీ స్నాన అవకాశాన్ని మనకు కలిగించాడు. అందుకని కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడైనాడు.కొండలంత వరములు గుప్పెడు వాడు..వాడు కొండలలో ఉన్నాడు. సాధారణంగా మనం ఒక మాట అంటుంటాం. ఆయనేం ఇవ్వలేడు కనుక. కొండంత ఇచ్చేస్తాడు–అని. ఆయన ఏదయినా ఇవ్వగలడు, కరుణా సముద్రుడు. ఎవరయినా ఏదయినా ఇస్తారు. తనదే ఇవ్వమంటే తనకున్న స్థితి నుంచి కిందకొచ్చి ఇవ్వలేరు. అలా భక్తికి ఎంతగా పరవశించిపోతాడో చూపడానికి అన్నమాచార్యులవారు తన కీర్తనలో..‘‘కుమ్మర దాసుడైన కురువరతినంబి యిమ్మన్న  వరములెల్ల నిచ్చినవాడు.

దొమ్ములు సేసినయట్టి తొండమాన్‌ చక్కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు’’ అన్నాడు. శ్రీవేంకటాచలం క్షేత్రానికి దగ్గరలో కుండలు చేసుకుంటూ జీవనం సాగించే భీముడనే కుమ్మరి.. స్వామివారి భక్తుడు. తన పూరి గుడిసెలోనే ఒక మూలన స్వామి వారి విగ్రహాన్ని పెట్టుకుని తాను కుండలు చేసే ముందు మట్టితో చేసిన తులసీదళాలను స్వామి వారికి అర్పిస్తూ అర్చన చేసేవాడు. ‘బంగారు దళాలతో పూజచేసే తొండమాన్‌ చక్రవర్తి అహంకారాన్ని అణచడానికి, నిస్వార్థంగా, పారవశ్యంతో పూజించే భీముడింటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించి అనుగ్రహించావు. ఎంత దయాసముద్రుడివయ్యా’– అని పొంగిపోతూ కీర్తన చేసారు అన్నమయ్య. స్వామికి కావలసింది బంగారు పుష్పాలు కాదు, హృదయ పుష్పాలు.

మరిన్ని వార్తలు