శబ్దాలను బట్టి జబ్బులు గుర్తించే ఆప్‌!

8 Jun, 2019 01:20 IST|Sakshi

పిల్లలు అదేపనిగా దగ్గుతున్నప్పుడు, సమస్య ఏమిటో తెలుసుకునేందుకు మనం వారిని డాక్టర్‌ దగ్గరకు తీసుకెళతాం. అయితే ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తల ప్రయోగాలు ఫలిస్తే సమీప భవిష్యత్తులోనే సమస్య ఏమిటో ఇంట్లోనే గుర్తించవచ్చు. అదెలాగంటారా? చాలా సింపుల్‌.. దగ్గు తాలూకూ ధ్వనుల ద్వారా జబ్బు ఏమిటో తెలుసుకునేందుకు వీరు ఒక స్మార్ట్‌ఫోన్‌ యాప్‌ను తయారు చేస్తున్నారు మరి. ఆసుపత్రిలో చేరిన పిల్లలు (29 రోజుల వయసు నుండి 12 ఏళ్ల వయసు వరకూ) దగ్గినప్పుడు వచ్చే శబ్దాలను రికార్డు చేయడం.. సాధారణ పద్ధతుల్లో గుర్తించిన ఆరోగ్య సమస్యలను వీటికి జోడించడం ఈ ప్రాజెక్టులో కీలక అంశం.

ఇప్పటికే 1437 మంది శబ్దాలను రికార్డు చేసిన శాస్త్రవేత్తలు మెషీన్‌ లెర్నింగ్‌ ప్రోగ్రామ్‌ ద్వారా వాటిని నిశితంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. న్యుమోనియా, ఉబ్బసం, బ్రాంకైటిస్‌లతో పాటు సాధారణ ఊపిరితిత్తుల సమస్యలకు సంబంధించిన ధ్వనులను అప్లికేషన్‌ ద్వారా గుర్తించేలా చేశారు. అప్లికేషన్‌ పూర్తయిన తరువాత దగ్గు ధ్వనులను రికార్డు చేసిన పిల్లలు 585 మంది మీద పరీక్షలు జరిపారు. ఎవరికి ఏ జబ్బు ఉందో 81 నుంచి 97 శాతం కచ్చితత్వంతో గుర్తించింది ఆ అప్లికేషన్‌ అని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త పాల్‌ పోర్టర్‌ తెలిపారు. వైద్య సదుపాయాలు లేని ప్రాంతాల్లో పిల్లల సమస్యలను గుర్తించేందుకు ఈ అప్లికేషన్‌ ఉపయోగపడుతుందని, మరింత సమర్థంగా పనిచేయించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.

మరిన్ని వార్తలు