వదిలిన దేశం తాలూకు ఇంటి బెంగ

4 Feb, 2019 00:22 IST|Sakshi
ఇంతియాజ్‌ హుసేన్‌ 

కొత్త బంగారం

అబ్బూ చనిపోతూ, ఇంక తమది కాని పూర్వీకుల రూప్‌నగర్‌ ఇంటి తాళాలను జాకిర్‌ చేతుల్లో పెడుతూ, ‘ఇవి నమ్మకానికి చిహ్నం. దాన్ని కాపాడుకో. మనం వదిలిన భూమి, మనపై చూపిన దయని జాపకం పెట్టుకో’ అని చెప్తాడు.

ఏనాటి కిందటో, ‘ప్రపంచం కొత్తగానూ, ఆకాశం స్వచ్ఛంగానూ ఉన్నప్పుడు, భూమి ఇంకా మలినపడనప్పుడు’ కాల్పనిక ఊరైన రూప్‌నగర్‌ (ఇండియా) లో ‘బస్తీ’ నవల మొదలవుతుంది. కథకుడైన జాకిర్‌ పుట్టినది అక్కడే. అతని అబ్బూజాన్, అమ్మీ, చెల్లెల్నీ– పరిచయం చేస్తారు రచయిత ఇంతిజార్‌ హుసేన్‌. ‘తాబేలు మీద నిలుచున్న ఏనుగు తలపైనే భూమి ఉంటుంది’ అనే ఊరి పెద్దయిన భగత్‌జీ కథకీ, ‘కాదు, చేప మీద నిలుచున్న ఆవుకొమ్ము మీద భూమి ఉంటుంది’ అనే అబ్బూ కథకీ మధ్యన ఏ వైరుధ్యతా కనపడని హిందూ–ముస్లిమ్‌లకున్న సామరస్యమైన వాతావరణంలో పెరుగుతాడు జాకిర్‌. దేశ విభజన సమయంలో, పాకిస్తాన్‌ తరలి వెళ్తుంది అతని కుటుంబం. జాకిర్‌ చిన్నప్పటి స్నేహితురాలైన సబీరా మాత్రం ఊర్లోనే ఉండిపోతుంది. 

జాకిర్, లాహోర్లో ఏ రాజకీయ పార్టీతోనూ అనుబంధం పెట్టుకోకుండా, టీ తాగుతూ దేశ భవిష్యత్తు గురించి చర్చిస్తుంటాడు. హిస్టరీ ప్రొఫెసర్‌గా చేరతాడు. సబీరాను తలచుకుంటూ– గతం, వర్తమానం, కల, యథార్థతలకి మధ్య ఊగిసలాడుతూ–  రూప్‌నగర్, లాహోర్‌ కలిసిపోతాయన్న ఆశ వదలడు. తన ఊరి వేపచెట్టుని తలచుకుంటూ, లాహోర్లో ఉన్న మర్రిచెట్టుకి అలవాటు పడతాడు. అయితే, ‘పాత తరం మాత్రం తమ శరీరాలనైతే కొత్త దేశానికి తెచ్చుకుంది కానీ తమ ఆత్మలను తమ ఇళ్ళలోనే వదిలి వచ్చినది. మారుతున్న కాలానికి అనుగుణంగా మారలేకపోతూ, గతంలోనే బతుకుతున్నది’. కొత్త దేశానికి వెళ్ళినవారి ఆశలు, ఆశయాలు నవలంతటా ప్రతిధ్వనిస్తాయి.

నవల పాకిస్తాన్‌ దేశపు మొదటి పాతికేళ్ళనీ ఒక శరణార్థి దృష్టితో చూపిస్తుంది. లాహోర్‌ పట్టణానికి– చరిత్ర గురించి రూప్‌నగర్‌కు ఉన్నంత పట్టింపు ఉండదు. ‘సూర్యుడు, తుపాన్లు, వర్షం, పక్షి రెట్టల వల్ల తప్ప– దేశంలో కలిగిన సంక్షోభం– ఊర్లో ఉన్న ఏ బిల్డింగుకీ గతంతో సంబంధం కల్పించదు. ఉన్న కేంద్రీకరణంతా రాజకీయాల మీదే’.

1971లో బంగ్లాదేశ్‌ ఏర్పడ్డాక, జాకిర్‌ ఆశావాదం మాయం అవుతుంది. ‘రూప్‌నగర్‌ సాంప్రదాయాలు, లాహోర్‌ నాగరికత కూడా పోయాయి. మాట్లాడగలిగేవారు మౌనంగా ఉన్నప్పుడు బూట్ల లేసులే మాట్లాడతాయి’ అన్న తండ్రి మాటలు తలచుకుంటాడు. మొదటి రోజున లాహోర్‌లో గమ్యం లేకుండా తిరుగుతూ, ‘సంతోషమైన రోజది. తాజా భూమి మీద, నిర్మలమైన ఆకాశం కింద నడిచాను. ఎంతో స్వచ్ఛంగా అనిపించింది’ అనుకున్న జాకిర్‌ కొన్నేళ్ళ తరువాత, ‘రోజులు మురికి పట్టాయి. ఆ రోజుల తేటదనం ఎక్కడ పోయిందో?’ అని దిగులు పడి, ‘నా అడుగులు ఏ భూమ్మీద పడుతున్నాయో!’ అన్న అయోమయ స్థితికి చేరతాడు.

అబ్బూ చనిపోతూ, ఇంక తమది కాని పూర్వీకుల రూప్‌నగర్‌ ఇంటి తాళాలను జాకిర్‌ చేతుల్లో పెడుతూ, ‘ఇవి నమ్మకానికి చిహ్నం. దాన్ని కాపాడుకో. మనం వదిలిన భూమి, మనపై చూపిన దయని జాపకం పెట్టుకో. అదే నీ కర్తవ్యపాలన’ అని చెప్తాడు. ‘ఏ కథా అంతం అవదు. దానినుండి మరొక కొత్త కథ పుడుతుంది. అలా కథలు పుట్టుకొస్తూనే ఉంటాయి’ అనే హుసేన్‌– గతంలోనే కూరుకుపోకుండా, దానినుండి ప్రేరణ పొందుతారు. ఏ దేశాన్నీ సమర్థించరు. పుస్తకంలో–విభజన వివరాలు కానీ విషాదం కానీ కనిపించదు. ఒక కాలక్రమాన్ని పాటించని నవలకి నిర్దిష్టమైన ముగింపేదీ ఉండదు. 1979లో రాసిన యీ పుస్తకాన్ని ఉర్దూ నుండి ఇంగ్లిష్‌లోకి అనువదించినది ఫ్రాన్సిస్‌ డబ్ల్యూ ప్రిట్చెట్‌.
-కృష్ణ వేణి

మరిన్ని వార్తలు