తల్లి ప్రథమ శత్రువు

2 Mar, 2020 01:06 IST|Sakshi

తుర్గేనెవ్‌ తల్లిదండ్రులు పాత ప్రభువంశానికి చెందినవారు. ఆయన తల్లి ఒరేల్‌ రాష్ట్రంలో అతి ధనవంతురాలైన జమీందారిణి. ఆమె భూదాస్య విధానాన్ని గట్టిగా బలపర్చేది, తన భూదాసులను క్రూరంగా హింసించేది. ‘‘నేను కొట్టడాలూ, చెంప దెబ్బలూ, వగైరాలుండే వాతావరణంలో పుట్టి పెరిగాను. అప్పటికే నేను భూదాస్య విధానాన్ని అసహ్యించుకునేవాణ్ణి’’ అని తుర్గేనెవ్‌ ఆ తరువాత రాశాడు. భూదాసులను సమర్థించి ఆయన తన తల్లితో తీవ్ర ఘర్షణ పడి ఇల్లు విడిపోవలసి వచ్చింది. ‘‘నేను అసహ్యించుకునే చోట ఆ గాలిని పీలుస్తూ వుండలేకపోయాను. నా దృష్టిలో యీ శత్రువుకు ఒక నిర్దిష్ట రూపం వుంది, ఒక నిర్దిష్టమైన పేరు వుంది, భూదాస్య విధానమే ఆ శత్రువు’’ అని ఆయన రాశాడు.

యువకుడైన తుర్గేనెవ్‌ తన జీవితకాలమంతా యీ బద్ధ శత్రువుకు వ్యతిరేకంగా పోరాడుతానని ‘‘హనిబాల్‌ ప్రమాణం’’ తీసుకున్నాడు (కార్తేజి యుద్ధంలో ప్రసిద్ధ నాయకుడైన హనిబాల్‌ పేర తీసుకున్న ప్రమాణం). సాహిత్య విమర్శకుడూ తొలి విప్లవకర్త ప్రజాస్వామికవాదులలో ఒకడూ అయిన వి.బెలీన్‌స్కీ– తుర్గేనెవ్‌ మిత్రుడయ్యాడు. బెలీన్‌స్కీ భావాలూ, రచనలూ రష్యన్‌ సాహిత్యం మీద ప్రజల ఆలోచనల మీద గొప్ప ప్రభావాన్ని నెరపాయి. తుర్గేనెవ్‌ ‘‘తండ్రులూ కొడుకులూ’’ అనే తన నవలను బెలీన్‌స్కీ స్మృతికి అంకితమిచ్చి ఆయన భావాల పట్ల తనకున్న భక్తి విశ్వాసాలను నిరూపించుకున్నాడు.
(కొండేపూడి లక్ష్మీనారాయణ రష్యన్‌ నుంచి తెలుగులోకి అనువదించిన ఇ.తుర్గేనెవ్‌ ‘తండ్రులూ–కొడుకులూ’ ముందుమాటలోంచి)
  -యు. ఎ.తొల్‌స్త్యకోవ్‌ 

మరిన్ని వార్తలు