తెలుగు సాహిత్య పాలవెల్లి ఖండవల్లి

20 Apr, 2020 01:23 IST|Sakshi
ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం 

వర్ధంతి

కోరాడ రామకృష్ణయ్య, పింగళి లక్ష్మీకాంతం, నిడదవోలు వేంకటరావు, గంటి జోగి సోమయాజి, భూపతి లక్ష్మీనారాయణ రావు లాంటి మహాపండితులు తెలుగు భాషా సాహిత్యాలకు ఎనలేని సేవ చేసిన ఆచార్య పురుషులు. వీళ్లందరు విశ్వవిద్యాలయాల్లో తెలుగు బోధించి తామర తంపరగా తెలుగు ఉపాధ్యాయుల్ని మలిచిన మహానుభావులు. కాని ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం ఈ మహనీయుల మధ్య చుక్కల్లో చంద్రునిలా వెలుగొందారంటే ఎవరైనా ఆశ్చర్యపోయినా తప్పులేదు.
ఖండవల్లి లక్ష్మీరంజనం (1908–1986) ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖలో 1936లో అసిస్టెంట్‌ లెక్చరర్‌గా ప్రవేశించి, రీడర్‌ అయి 1946లో ఆచార్యులై, 1964లో పదవీ విరమణ చేశారు. ఆయన ఉద్యోగంలో చేరేనాటికి తెలంగాణలో ఏ కళాశాలలో గానీ తెలుగు, కంటిలో కలికానికైనా కానవచ్చేది కాదు. లక్ష్మీరంజనం ఉస్మానియా పాలకవర్గంతో పోరాడి, అంచెలంచెలుగా డిగ్రీ స్థాయిలో బీఏ, బీఎస్‌సీ, బీకాం విద్యార్థులకు తెలుగును పాఠ్యక్రమంలో చేర్పించారు. 

వారు, మహామహులైన పండితుల్ని సంపాదకులుగా చేసి వెలువరించిన సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశం సంపుటాలు తెలుగు భాషా సాహిత్యాలకు కీర్తి కళశాలు. ఉద్దండ సంస్కృతాంధ్ర విద్వాంసుల సహకారంతో ప్రచురించిన ఎనిమిది ఆంధ్ర మహాభారత పరిష్కృత సంపుటాలు తెలుగు సాహిత్య భాండాగారానికి పెన్నిధి.
ఖండవల్లి ‘శిష్య వాత్సలమ్ము చెలువు తార్చిన మూర్తి’. వారు తరగతి గదులకే పరిమితం కాలేదు. ‘ఆంధ్రుల చరిత్ర– సంస్కృతి’ రచించిన ఘనుడు, శిష్యుడైన బిరుదురాజు రామరాజు సంపాదకత్వంలో ఎంఏ విద్యార్థుల చేత వ్యాసాలు రాయించి ‘మన చరిత్ర– సంస్కృతి’ గ్రంథాన్ని వెలువరింప జేశారు. విద్యార్థులకు పథ ప్రదర్శనం చేసి నన్నయ, శ్రీనాథ పదకోశాలను నిర్మింపజేశారు. అంతేకాదు, 1950లోనే ఉస్మానియాలోనూ, ఇతరత్రానూ ఆంధ్ర అభ్యుదయ మహోత్సవాల్ని ఏటేటా జరపడం మొదలెట్టారు. కొడిగట్టుతున్న తెలుగు దీపానికి తైలం పోసి తెలంగాణలో తెలుగును సముజ్వలం చేశారు.

ఖండవల్లి వేద విజ్ఞాన సంపన్నులు. ఆయన కృషి కారణంగా తెలంగాణలో 1956 నుంచి ప్రాచ్య భాషాధ్యయనంలో డిగ్రీ తరగతులు (బీఓఎల్‌) మొదలయ్యాయి. 1957 నుంచి ఓరియంటల్‌ కళాశాలలు సాయంకాలం పూట పనిచేసేలా ప్రారంభమయ్యాయి. ఇంగ్లీషు భాషా పరిచయం లేని పేదసాదా విద్యార్థులు ఈ కళాశాలల్లో చదివి, ఎంఏ తెలుగు, సంస్కృతం పట్టాలు పొంది కాలేజీ లెక్చరర్లు కాగలిగారు. 1966లో తెలుగు మాధ్యమంలో సాయం డిగ్రీ కళాశాలను స్థాపించారు. 1960లో హైదరాబాదులో వేద పాఠశాలను ప్రారంభించి, తాను కూడా తరగతులు తీసుకునేవారు.

ఆయన రాసిన పుస్తకాల్లో ఆంధ్రుల చరిత్ర– సంస్కృతి, ఆంధ్ర సాహిత్య చరిత్ర సంగ్రహము, తెనుగుదుక్కి, లక్ష్మీరంజనం వ్యాసావళి, ఆంధ్రదేశ చరిత్ర భూగోళ సర్వస్వము మూడు సంపుటాలు, కాసె సర్వప్ప రాసిన సిద్దేశ్వర చరిత్రము, శ్రీనాథుని హరవిలాసము (పరిష్కరణ గ్రంథాలు) ప్రసిద్ధాలు.
ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖాధ్యక్షులుగా 1964లో విశ్రాంతి తీసుకున్నా, ‘అలయక, సొలయక, వేసట నొలయక’ మరో 22 సంవత్సరాలు సాహిత్య సేవ చేసి, 1986 ఏప్రిల్‌ 19న హైదరాబాద్‌లో మరణించారు.
ఘట్టమరాజు వారు వెలువరించిన సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశం సంపుటాలు తెలుగు భాషా సాహిత్యాలకు కీర్తి కళశాలు. ఎనిమిది ఆంధ్ర మహాభారత పరిష్కృత సంపుటాలు తెలుగు సాహిత్య భాండాగారానికి పెన్నిధి.

మరిన్ని వార్తలు