ప్లీజ్‌.. నా బిడ్డ పేరు అడగండి

9 Sep, 2018 00:43 IST|Sakshi

ప్రతివారి జీవితంలోను ఒక్కో బంధం ఏర్పడిన ప్పుడు ఒక్కో ‘హోదా’ వస్తుంది. పెళ్లి కాగానే భార్యాభర్తలు, పిల్లలు పుట్టగానే తల్లిదండ్రులు, మనుమలు జన్మించగానే అమ్మమ్మతాతయ్యలుగా పిలుస్తుంటారు. ఈ బంధాలు ప్రపంచంలో వారి వారి భాషలలో ఉన్నాయి. మరి బిడ్డ జన్మించగానే తల్లిదండ్రులుగా పిలువబడే వారిని, పుట్టిన బిడ్డ పసికందుగానే మర ణిస్తే, ఏమని పిలవాలి. మాజీ తల్లిదండ్రులనా, భార్యాభర్తలనా... ఏమని? ఇదే ప్రశ్న వేస్తున్నారు ఎల్‌ రైట్‌ అనే మహిళ. ఆమెకు పుట్టిన కుమారుడికి టెడ్డీ అని ముద్దుగా పేరు పెట్టుకుంది. మూణ్నాళ్ల ముచ్చటలాగ, కన్ను తెరిచిన మూడోనాడే టెడ్డీ కన్ను మూశాడు. ఒకసారి తను ఒక బిడ్డకు జన్మనిచ్చింది కనుక ఆ బిడ్డ మరణించినా తన  గురించి అమ్మ అనే చెప్పాలంటోంది ఎల్‌ రైట్‌.

‘‘మా అబ్బాయి నాతో ఎన్నో సంవత్సరాలు ఆనందంగా గడుపుతాడనుకున్నాను. కాని వాడు హాస్పిటల్‌ నుంచి ఇంటికే చేరలేదు. వాడితో నా అనుబంధం మూడు రోజులు మాత్రమే. వాడు పుట్టగానే నాలో మాతృత్వం పొంగుకొచ్చింది. అంతలోనే ఇలా జరిగింది. 2015 సెప్టెంబరులో నాలో కొత్త మార్పు వస్తోందని తెలుసుకున్నాను. నా భర్త ‘నికో’ ఇంటికి రాగానే విషయం చెప్పాలనే ఆత్రంతో ఎదురుచూస్తున్నాను. వచ్చీరాగానే అతని చేతిలో ప్రెగ్నెన్సీ పాజిటివ్‌ రిపోర్టును చేతిలో పెట్టాను. అతను సంతోషంతో గంతులు వేశాడు. నాకు చెప్పరాని ఆనందం అనిపించింది. 12 వారాల తరవాత స్కానింగ్‌ తీయించి, అప్పుడు అందరితో ఈ ఆనందాన్ని పంచుకున్నాం.

స్కానింగ్‌ స్క్రీన్‌ మీద పసిబిడ్డ ఏడుస్తూ, అరుస్తూ, కాళ్లు కదపడం చూసి మురిసిపోయాను. నా భర్తకి వెంటనే మెసేజ్‌ పంపాను. ఇలా కళ్లుమూసుకు తెరిచేలోగా ఆరు నెలలు గడిచిపోయాయి. రోజులు దగ్గరపడే కొద్దీ నాలో ఆనందం రెట్టింపవుతోంది. తొమ్మిది నెలలు నిండాయి, హాస్పిటల్‌లో చేరాను. సిజేరియన్‌ చేసి బాబుని నాకు చూపించారు. బాబుని హాస్పిటల్‌ టవల్‌లో చుట్టి ఉంచారు. అయితే.. ఆనందంలో మురిసిపోతున్న నాకు డాక్టర్‌ మాటలు నెత్తి మీద పిడుగు పడినట్టుగా అయ్యింది. బాబుకి ఏదో చిన్న అనారోగ్యం ఉందని చెప్పారు. రెండు మూడు రోజుల కంటే ఊపిరి పీల్చలేడని చెప్పారు. అప్పటికే నేను నా చిన్నారికి టెడ్డీ అని పేరు పెట్టుకున్నాను. వాడు కేవలం 74 గంటలు మాత్రమే భూమి మీద గాలి పీల్చుకున్నాడు.

రెండు రోజులు నా బిడ్డను దగ్గరగా పడుకోబెట్టుకున్నాను. ఆ రోజు అర్ధరాత్రి మిడ్‌వైఫ్‌ వచ్చి గాభరాగా నన్ను నిద్రలేపింది, బాబుకి బాగోలేదని. నేను బాబు శరీరం ముట్టుకుని చూశాను, చల్లగా మంచుముద్దలా ఉంది. నెమ్మదిగా ఊపిరి తీసుకోవడం ఆగిపోతోంది, చూస్తుండగానే 20 నిమిషాలలో అంతా సర్దుకుంది. బాబుకి నా పాలు పట్టించాను. అందులో ఏం అమృతం ఉందో కాని, బాబు కాసేపటికే ఆడుకోవడం మొదలుపెట్టాడు. ఆ ఆట ఎంతోసేపు ఉండదని తెలుసు, కాని నా మాతృహృదయం బాబుకి పాలు తాగిస్తున్నంతసేపు ఆనందపారవశ్యంలో నిండిపోయింది. బాబుని గుండెలకు హత్తుకున్నాను. వాడు ఎంత గట్టిగా తన్నుతుంటే అంత ఆనందం వేసింది. మళ్లీమళ్లీ ఈ అనుభూతి ఉండదు కదా అనుకున్నాను.

టెడ్డీ మే 16, 2016లో పుట్టాడు, మే 19, 2016లో తన చిరునవ్వులను తనతో తీసుకువెళ్లిపోయాడు. టెడ్డీ శరీరానికి పెట్టిన ఆక్సిజన్‌ గొట్టం తొలగించారు. శరీరానికి వేసిన మెడికల్‌ టేపులన్నీ తీసేశారు. ఊపిరి లేని, చిరునవ్వుల టెడ్డీని నాకు అందించారు. ఎట్టకేలకు వాడు అన్ని రకాల ఇబ్బందుల నుంచి మోక్షం పొందాడు, ఇది జరిగిన తరవాత నేను మానసికంగా, శారీరకంగా కృంగిపోయాను. ఇలాంటివి ఇతరులకు కూడా జరుగుతుంటాయి. హృదయాన్ని పోలి ఉండే వాడి చిరునవ్వులను మరచిపోలేకపోతున్నాను. నా స్నేహితులందరికీ మెసేజ్‌ పంపాను, ‘గుడ్‌ బై టు టెడ్డీ’ అని. ‘టెడ్డీ డైడ్‌’ అనడానికి నాకు మనస్కరించలేదు.

వాస్తవాన్ని అంగీకరించడానికి కొన్ని నెలల సమయం పట్టింది. ఫోన్‌ మోగగానే ఎత్తాలంటే కూడా మనస్కరించలేదు, మనసు సంభాళించుకుని ఫోన్‌ ఎత్తగానే, వారు ‘నీకు మేమందరం ఉన్నాం. మేం నిన్ను ప్రేమగా చూసుకుంటాం’ అంటున్నారు. నేను సమాధానం చెప్పకపోయినా వారు కోపం తెచ్చుకోవట్లేదు. నా స్పందన కోసం వారు ఎదురుచూడట్లేదు. నా కథ ఎందుకు చదవాలా అని మీరు అనుకోవచ్చు. ఒక్కసారి తల్లిదండ్రులమైతే, పిల్లలు ఉన్నా ఉండకపోయినా మమ్మల్ని తల్లిదండ్రులుగానే గుర్తించాలి అని నేను కోరుకుంటున్నాను. మీరందరూ మా అబ్బాయి పేరు ఏంటి అని అడగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అంటున్నారు ఎల్‌ రైట్‌ అనే ఈ బ్రిటన్‌ మాతృమూర్తి.

 – రోహిణి

మరిన్ని వార్తలు