పడమటి గాలిపాట

18 Nov, 2019 00:09 IST|Sakshi
ఇంగ్లండ్‌ రాజు మూడో ఎడ్వర్డ్‌ కొలువుదీరిన సభలో తన కవిత్వం వినిపిస్తున్న ఇంగ్లిష్‌ ఆదికవి జెఫ్రీ ఛాసర్‌. కాలం 14వ శతాబ్దం. 1851లో దీన్ని చిత్రించినవారు ఫోర్డ్‌ మడాక్స్‌ బ్రౌన్‌

ఆంగ్ల కవిత్వం–ఒక పరిచయం

ఇంగ్లీషు కవులు అలంకారాలు, శబ్ద వైచిత్రి కన్నా భావుకతకు, తాత్వికతకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. వారు శృంగార వర్ణనలను  మితంగా, హద్దు మీరక చిత్రించారు. వారు అంతర్ముఖులై ఎక్కువగా ఏకాంతాన్ని ఆరాధించారు. జీవితంలోని అమానవీయత వారిని కలవరపెట్టింది. వ్యక్తి స్వేచ్ఛకు, భావ స్వాతంత్య్రానికి పట్టం గట్టారు.

క్రీ.శ. 4వ శతాబ్దంలో రోమ్లను బ్రిటన్‌ని వదిలి వెళ్లిపోయిన తర్వాత ఆంగ్లో–శాగ్జన్లు, జర్మనీ నుంచి బ్రిటన్‌పై దండయాత్ర చేసి ఆక్రమించుకొన్నారు. అంతకుముందే వున్న కెల్టులను ఓడించి దూరంగా తరిమివేసారు. ఇప్పటికీ స్కాట్లాండు, వేల్సు, ఐర్లాండులలో కెల్టిక్‌ భాష సజీవంగా వుంది. ఆంగ్లో–శాగ్జన్లలో భాగమైన ఏంగిల్స్‌ (Ballads) అనే వారి భాష నుంచి పరిణామం చెంది ఆధునిక ఇంగ్లీషుభాష ఆవిర్భవించింది.

కాని చాలా కాలంవరకు ఇంగ్లీషులో లిఖిత కావ్యాలు లేవు. మౌఖికంగా బాలడీర్స్‌ అనే వాళ్లు వీరగాథలూ, భక్తిగీతాలూ పాడుతూ ఆ పాటల్ని ప్రచారం చేసేవారు. ఆ పాటల్లో (ఆ్చ  ్చఛీట) కొన్ని ఇంకా మిగిలివున్నవి. కానీ ప్రాచీన ఇంగ్లీషు భాషకీ, ఆధునిక భాషకీ చాలా తేడాలున్నాయి.

11వ శతాబ్దిలో ఫ్రాన్సు నుంచి జర్మన్లు దండెత్తి బ్రిటన్‌ని ఆక్రమించాక ఫ్రెంచి భాషే రాజభాషగా, అధికార భాషగా చలామణి అయింది. తర్వాత క్రమంగా ఆంగ్లభాష ఉపయోగించబడుతూ, అందులో కావ్యాలు కూడా వెలువడనారంభించాయి.

మనం సంస్కృతంలో వాల్మీకిని, తెలుగులో నన్నయని ఎలా ఆదికవులుగా పరిగణిస్తామో, అదే విధంగా ఇంగ్లీషులో ఆదికవిగా ‘ఛాసర్‌’ని పరిగణిస్తారు. ఆయన రచనల్లో ముఖ్యమైనది కాంటర్బరీ టేల్స్‌. కొందరు యాత్రికులు కలుసుకొని, ఒక్కొక్కరు చెప్పిన కథలనే ఛాసర్‌ పద్యరూపంలో వ్రాశాడు. ఛాసర్‌ జీవితకాలం క్రీ.శ. 1340–1400. ఈయన తర్వాత కొందరు కవితలు, వచనం వ్రాసిన వారు వున్నారు. 15, 16 శతాబ్దాలలో అచ్చుయంత్రం కనిపెట్టడం వల్ల పుస్తకాలకి ఎక్కువ ప్రచారం కలిగి, రచయితల సంఖ్య కూడా పెరిగింది. 

ఛాసర్‌ తర్వాత ముఖ్యుడైన కవి ఎడ్మండ్‌ స్పెన్సర్‌ (1552–99). ఈ కాలాన్ని ఎలిజబెతన్‌ పీరియడ్‌ అంటారు. 1వ ఎలిజబెత్‌ రాణి పాలించిన కాలం. స్పెన్సర్‌ రాసిన రాణిని పొగుడుతూ వ్రాసిన కావ్యం ద ఫెయిరీ క్వీన్‌. ఈ కాలంలో ముఖ్యుడైన షేక్‌స్పియర్‌ జగత్ప్రసిద్ధుడు. అనేక గొప్ప నాటకాలే కాకుండా, సానెట్స్‌ వంటి కవితలు కూడా రచించాడు. ఆయన నాటకాల్లో సంభాషణలు కూడా మన పద్యనాటకాల్లాగా రాగయుక్తంగా చదివేందుకు పనికివస్తాయి. మరొక కవి క్రిస్టఫర్‌ మార్లో. ఈ కాలపు కవిత్వంలో ముఖ్యాంశాలు, యూరోపియన్‌ సంప్రదాయాన్ని, కవి సమయాల్ని అనుసరించడం. క్లాసిక్స్‌ని అనుసరించి, కథా వస్తువుగా స్వీకరించడం. నాటకాలని కూడా పద్యాలలాగ రచించడం. మధ్యలో కొంతకాలం జరిగాక మిల్టన్‌ అనే గొప్పకవి ఉద్భవించాడు(17వ శతాబ్ది). ఇతడు రాజరికాన్ని వ్యతిరేకించాడు. అంధుడు. పారడైజ్‌ లాస్ట్‌ అనే గొప్ప ఇతిహాసాన్ని రచించాడు. అందులో కథావస్తువు దేవునికీ సైతానుకీ సంఘర్షణ, సైతాను పాతాళలోకానికి బహిష్కరించబడటం.

తర్వాత అగస్టన్‌ కాలం అనబడే 18వ శతాబ్దంలో అలెగ్జాండర్‌ పోప్, జాన్‌ డ్రైడన్‌ ముఖ్య కవులు. వీరికి ప్రాచీన ప్రపంచమంటే మక్కువ. వీరి తర్వాత కవులు ఎక్కువగా ప్రకృతిని ఆరాధించారు. పల్లెటూళ్ల గురించి, ప్రకృతి సౌందర్యం గురించి కవితలు అల్లారు. వీరిలో గోల్డ్‌స్మిత్, థామస్‌ గ్రే, రాబర్ట్‌ బర్న్స్‌ ముఖ్యులు.

19వ శతాబ్దం ప్రథమభాగంలో చెప్పుకోవలసినది రొమాంటిక్‌ యుగం. ఇక్కడ రొమాన్స్‌ అంటే  శృంగారమని కాదు. భావుకత, కాల్పనికత అని అర్థం చేసుకోవలసి వుంటుంది. ప్రకృతి కవుల్లో వర్డ్స్‌వర్త్‌ పేర్కొనదగినవాడు. రొమాంటిక్‌ కవులలో షెల్లీ, కీట్స్, బైరన్‌లను పేర్కొంటారు. వీరు మొదట్లో ఫ్రెంచి విప్లవం ప్రభావానికి లోనైనా అందులో జరిగిన హింసాకాండ, దౌర్జన్యాల వల్ల తర్వాత విముఖులయ్యారు. వీరిపై అమెరికన్‌ స్వాతంత్య్ర యుద్ధ ప్రభావం కూడా ఉంది. మన భావకవులను షెల్సీ, కీట్సు ప్రభావితం చేసిన విషయం విదితమే. రొమాంటిక్‌ ఉద్యమం వ్యక్తిగత సృజనాత్మకతను, సామాన్య మానవుని భావాలను, ప్రకృతి రామణీయకతను ప్రోత్సహించింది. అదే సమయంలో రాబర్ట్‌ బ్రౌనింగ్‌ వంటివారు క్లాసికల్‌ ధోరణిని కూడా అనుసరించారు.

తర్వాత విక్టోరియా మహారాణి పాలనలో బ్రిటన్‌ సామ్రాజ్యం అత్యున్నత దశకు చేరుకున్నది. క్రీ.శ.1850 నుండి 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమయే వరకూ విక్టోరియన్‌ యుగంగానే పరిగణిస్తారు. ఈ కాలానికి ప్రతినిధులుగా టెన్నిసన్, రుడ్లార్డ్‌ కిప్లింగ్‌లను భావిస్తారు. శాస్త్ర విజ్ఞానం, అనేక నూత్న పరికరాల్ని కనిపెట్టడం, పారిశ్రామిక విప్లవం వీటిలో బ్రిటన్‌ అగ్రస్థానం వహించిన కాలం. ఐనా కొందరు కవులు క్రిక్కిరిసిన నగరాలు, మురికి వాడలు, రణగొణ ధ్వనులు, ఆధ్యాత్మికత కంటే భౌతిక దృక్పథం, ధనార్జన మీద దురాశ మున్నగు వాటివల్ల యీ కాలంలో వైముఖ్యాన్ని ప్రదర్శిస్తూ, ప్రకృతిని కీర్తిస్తూ కవితలు వ్రాశారు. టెన్నిసన్‌తో బాటు బ్రౌనింగ్, అతడి భార్య ఎలిజబెత్‌ బ్రౌనింగ్, మాథ్యూ అర్నాల్డ్‌ ఇప్పటి ముఖ్య కవులు. కాని క్రమంగా కవిత్వానికి ప్రాముఖ్యం తగ్గి, నవల, నాటకం, జర్నలిజం వంటి ప్రక్రియలకి ప్రాధాన్యం పెరిగింది. కాని 20వ శతాబ్ది ప్రారంభంలో కొందరు మంచి కవిత్వాన్ని అందించిన వారు ఉన్నారు. స్విన్‌బర్న్, యేట్స్, రాబర్ట్‌ గ్రేవ్స్, డి.హెచ్‌.లారెన్స్, రూపర్ట్‌ బ్రూక్స్, వాల్టర్‌ డీలా మారి వంటివారు, థామస్‌ హార్డీ, బ్రోంటీ సోదరీమణులు నవలలకి ప్రసిద్ధి చెందినా, ఆధునిక దృక్పథంతో కొన్ని కవితలు కూడా రచించారు.

క్రీ.శ. 1914–40 వరకు యుద్ధాల్లో జరిగిన విపరీతమైన జననష్టం, ఆస్తినష్టం ప్రజల్లో అశాంతిని కలిగించింది. యుద్ధాల మధ్యకాలంలో కూడా విప్లవాలు, తిరుగుబాట్లు, ఆర్థిక మాంద్యం, కరువు కాటకాలు, నిరుద్యోగం, భీతావహమైన వాతావరణం– వీటివల్ల నిరాశ, నిస్పృహ, ఆధునిక నాగరికత పైనే వైముఖ్యం, అపనమ్మకం– ఇవన్నీ కవులపైన కూడా ప్రభావాన్ని చూపించాయి. టి.ఎస్‌.ఇలియట్‌ వంటి వారు వేస్ట్‌ లాండ్‌ వంటి రచనలలో యీ దృక్పథాన్ని ప్రతిఫలింపజేశారు. అధివాస్తవికత (సర్రియలిజం) వంటి కొత్త ఉద్యమాలు బయలుదేరాయి. ఫాసిజం వంటి నియంతృత్వాన్ని సమర్థించేవారు కూడా ఇంకొక ప్రక్క బయలుదేరారు. ఎజ్రా పౌండ్, ఆడెన్, స్పెండర్‌ వంటివారు. కొందరు సోషలిస్టు పరిష్కారాల వైపు, రష్యాలో జరిగిన బోల్షివిక్‌ విప్లవం వైపు మొగ్గు చూపారు. సంప్రదాయ కవిత్వం కన్నా, వచన కవిత్వాన్ని ఎక్కువగా అనుసరించారు.

ఒక చిన్న తెగకు భాషగా ఒక మారుమూల ద్వీపంలోని భాషగా వున్న ఇంగ్లీషు వెయ్యి సంవత్సరాల్లో అనేక చారిత్రక పరిణామాల వల్ల ఇప్పుడు అపారమైన సాహిత్యం కల అంతర్జాతీయ భాషగా మారింది. శాస్త్రీయ విజ్ఞాన ప్రగతికి, పారిశ్రామికీకరణకు అవసరమైన గ్రీకు, లాటిన్‌ వంటి ప్రాచీన భాషల నుండి అసంఖ్యాకంగా పేర్లు, పదాలు తనలో ఇంగ్లీషు ఇముడ్చుకుంది. కాలక్రమాన అనేక యితర భాషల నుండి కూడా పదాలను చేర్చుకొని అంతర్జాతీయ భాష ఐనది. 

ఇంగ్లీషు కవులు అలంకారాలు, శబ్ద వైచిత్రి కన్నా భావుకతకు, తాత్వికతకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. వారు శృంగార వర్ణనలను చాలా మితంగా, హద్దు మీరక చిత్రించారు. మొదట్లో వారిపై గ్రీకు, లాటిన్‌ సంప్రదాయాల ప్రభావం ఎక్కువగా ఉంది. తర్వాత సహజత్వానికీ, ప్రకృతికీ ప్రాధాన్యత పెరిగింది. కవుల్లో చాలామంది మీద క్రైస్తవ మత ప్రభావం, ఆధ్యాత్మిక తత్వం ఉంది. ‘రవి అస్తమించని’ సామ్రాజ్యాన్ని బ్రిటన్‌ పాలించినా ఆ అతిశయం కిప్లింగ్, టెన్నిసన్‌ వంటి కొందరి మీద మినహా అంతగా కనిపించదు. అంతర్ముఖులై ఎక్కువగా ఏకాంతాన్ని ఆరాధించారు. జీవితంలోని అమానవీయత వారిని కలవరపెట్టింది. వ్యక్తి స్వేచ్ఛకు, భావ స్వాతంత్య్రానికి పట్టం గట్టారు.

ఇప్పుడు ఇంగ్లీషు సాహిత్యం, కవిత్వం అంటే ఇంగ్లండు దేశంలో వెలువడేది మాత్రమే కాదు. బ్రిటీష్‌ దీవులతో పాటు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండీ వెలువడుతున్న ఆంగ్లభాషా సాహిత్యమని అర్థం. ముఖ్యంగా అమెరికా, కెనడా, కరేబియన్‌ దీవులు, ఆఫ్రికాలో నైజీరియా, దక్షిణాఫ్రికా వంటి దేశాలు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వంటి దేశాల్లో వెలువడుతున్న ఆంగ్లభాషా సాహిత్యాన్ని చేర్చాలి. అంతే కాదు, భారత ఉపఖండంలో ఇంగ్లీషు భాషలో వెలువడే సాహిత్యమంతా యీ కోవకే చెందుతుంది.


డాక్టర్‌ ముద్దు వెంకటరమణారావు
(వ్యాసకర్త, సుప్రసిద్ధ ఆంగ్ల కవితలకు తెలుగు అనువాదం ‘పడమటి గాలిపాట’ వెలువరించారు.)

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా